Facebook Twitter
బీనాదేవి

 

బీనాదేవి

 




       తెలుగు సాహిత్యంలో కలంపేర్లతో రచనలు చేసిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ భార్యాభర్తలు ఇద్దరూ ఒకే కలం పేరుతో రచనలు చేసే సంప్రదాయానికి వీళ్లే ప్రథములు అని చెప్పాలి. వాళ్లే బీనాదేవి. భాగవతుల నరసింగరావు, భార్య భాగవతుల త్రిపుర సుందరి. వీళ్లిద్దరూ కలిసి బీనాదేవి పేరుతో కథలు, నవలలు రాశారు. భర్త నరసింగరావు చనిపోయే వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. నరసింగరావే రచనలు చేస్తున్నారని పాఠకులు భావించేవాళ్లు. అయితే బీనాదేవి రచనలు రావిశాస్త్రి రచనల్లా ఉంటాయనేది చాలామంది అభిప్రాయం. కానీ అనుకరణలు కావు కేవలం అతని రచనా వ్యక్తిత్వాన్ని తెలిపే వారసత్వానికి బీనాదేవి ప్రతినిధి అని కొడవటిగంటి కుటుంబరావు గారే చెప్పారు.
        నరసింగరాజు ఆగస్టు 25, 1924లో జన్మించారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. త్రిపురసుందరి ఫిబ్రవరి 11, 1935న జన్మించారు. వివాహం అయిన తర్వాత భర్త ఉద్యోగరీత్యా త్రిపురసుందరి కూడా తెలుగు ప్రాంతమంతా తిరగవలసి వచ్చింది. విశాఖపట్నంలో జన్మించిన త్రిపురసుందరికి కర్ణాటక సంగీతమంటే ఇష్టం. అంట్లు తోముకునే ఆడపిల్లకు  ఆల్జీబ్రా ఎందుకు అనే రోజుల్ని, సంఘటనల్ని అధిగమిస్తూ, నలుగురు పిల్లలు పుట్టినా లెక్కచేయకుండా ప్రైవేటుగా చదివి బి.ఎ. పట్టా పుచ్చుకుంది. భర్తతో కలిసి రచనలు చేసి, 1990లో ఆయన చనిపోయిన తర్వత కూడా అదేపంథాలో రచనలు చేసింది. వీరి రచనలు ఫస్ట్ కేఫ్ 1960లో, ఎమేటరాఫ్ నే ఇంపార్టెన్స్ 1972లో, రాధమ్మపెళ్లి ఆగిపోయింది 1975లో, డబ్బు డబ్బు డబ్బు 1975లో, హరిశ్చంద్ర మతి 1980లో, బీనాదేవి కథలు - కబుర్లు 1998లో సంపుటాలుగా వచ్చాయి. బీనాదేవి కథలు - కబుర్లు భర్త చనిపోయిన తర్వాత భార్య ప్రకటించిన రచన.  త్రిపుర సుందరి 90ల తర్వాత కథలు, వ్యాసాలు కూడా రాసింది. వీరి రచనలకు అనేక పోటీలలో బహుమతులు వచ్చాయి.
                వీరి రచనల్లో ఎక్కువ ఉత్తరాంధ్ర మాండలికం కనిపిస్తుంది. కథ, పాత్రలు కూడా వస్తువు తగినవిధంగా ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. రావి శాస్త్రి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అలానే పుణ్యభూమి కళ్లుతెరు వీరు రాసిన గొప్ప నవల. మరో నవల హేంగ్ మీ క్విక్ పై మార్క్సిజం ప్రభావం కనిపిస్తుంది. రాజ్యం, దాని ప్రభావం, వ్యక్తులపై అది చేసే దోపిడీని సజీవ దృశ్యాలుగా ఈ నవల మనకు చూపిస్తుంది. సమాజంలోని ప్రజల సంవేదనల్ని వీరి రనచలు వస్తువుగా స్వీకరించాయి. న్యాయస్థానాల్లో కేసులు ఓడిపోయిన నిజాయితీ పరులైన పేదలు, వారి కష్టాలు వీరికి కనిపించాయి. అందుకే బీనాదేవిది ప్రజల పక్షం అని చెప్పాలి. వీరి రచనలు ఎంత సామాన్యంగా ఉంటాయంటే... 1967లో రచించిన ఫస్ట్ కేస్ కథలో-
         ఆనందరావు డాక్టరు. అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉంటాడు. మిత్రుడి కోరికపై ఓ పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ ఓ పేదపిల్ల తన చెల్లికి వైద్యం చేయమని ప్రాదేయపడుతుంది. కాదన లేక వెళ్తాడు. ఆ అమ్మాయి రోగానికి మందు ఆకలి తీర్చడమే అని తెలుసుకుని తనదగ్గరున్న హార్లెక్స్ ను చెల్లికివ్వమని అక్కతో పంపిస్తాడు. తీరా ఆనందరావు పేషంట్ దగ్గరకు వెళ్లే సరికి ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. అక్క కనపడదు. ఆనందరావుకు కోపం వస్తుంది. వెతికుతాడు. చివరకు ఆ హార్లెక్స్ పాలు అక్క తాగిందని తెలుస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి పక్కన ఉన్న పాములాగే  కనిపిస్తుంది ఆనందరావుకు.  ఆకలికి బంధుత్వాలు, ప్రేమలు ఉండవని తెలుసుకున్న డాక్టరు విస్తుపోతాడు. వీరిది బీనాదేవీయం మరో గొప్ప రచన, దీనిలో త్రిపురసుందరి వ్యక్తిగత జీవితాన్ని, కౌటుంబిక జీవితాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
           1972లో బీనాదేవికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి సమగ్ర రచనలను మనసు ఫౌండేషన్ వాళ్లు ముద్రించారు. వీరి కథల్లో కొన్ని చెప్పవలసి వస్తే- ఆత్మహత్య, అసలు లేని వడ్డీ, అతడు ఆమె, అవు పులి, ఇది కథకాదు, రిబ్బను ముక్క,  ఏదిక్రమం, ఉద్యోగపర్వం, అందాలూ అనుభవాలూ, అదృష్టహీనుడు, ఔను అమ్మ చచ్చిపోయింది, కుంకుమ ఖరీదు పదివేలు... .... ఇలా చాలానే ఉన్నాయి. వాస్తవాన్ని రచనలుగా చేస్తూ, దోపిడీని, రాజ్య స్వభావాన్ని ఎండగడుతూ నిత్యం చైతన్య వంతమైన రనచలు కావాలంటే బీనాదేవి రచనలు చదవాల్సిందే. అంతేకాదు రావిశాస్త్రి గారిని తెలుగు ప్రజలు మర్చిపోకుండా ఉండాలన్నా బీనాదేవిని గుర్తుపెట్టుకోవాల్సిందే.

 - డా. ఎ.రవీంద్రబాబు