Facebook Twitter
తెలంగాణలో తెలుగుకి అండ.. సురవరం ప్రతాపరెడ్డి

తెలంగాణలో తెలుగుకి అండ - సురవరం ప్రతాపరెడ్డి

 


ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ రచయితల గురించి లోకానికి చాటే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. కానీ దాదాపు 70 ఏళ్ల క్రితమే తెలంగాణలో కవుల గురించి ఓ ప్రత్యేక సంచిక తీసుకువచ్చారు ఓ పెద్దాయన. న్యాయవాదిగా, రచయితగా, సంపాదకుడిగా, సంఘసంస్కర్తగా, ప్రజాప్రతినిథిగా, చరిత్రకారునిగా... అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అద్భుతాలు చేసి చూపించారు. ఆయనే సురవరం ప్రతాపరడ్డి.

1896లో మహబూబ్‌నగర్‌లోని ఇటిక్యాలపాడులో జన్మించారు సురవరం. చదువంటే ఉన్న ఆసక్తితో కర్నూలులోని బంధువుల ఇంట్లో ఉండి చదువుకునేవారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్‌ భాషలతో పాటు సంస్కృతం, ఫారసీ భాషల మీద కూడా మంచి పట్టు సాధించారు. హైదరాబాదులోని నిజాం కాలేజీ, మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజిలలో ఉన్నత చదువులు పూర్తిచేశారు.

సురవరం మొదట హైదరాబాదులోని రెడ్డి హస్టలు నిర్వహణ బాధ్యతలు చూసేవారు. ఆ హాస్టలు ఇప్పటికీ నిలదొక్కుకుని ఉందంటే, అందుకు సురవరం తీసుకున్న చర్యలు కూడా కారణమే! సురవరానికి సాహిత్యం మీద మొదటి నుంచీ ఉన్న ఆసక్తి వల్ల 1926లో గోలకొండ పత్రికను స్థాపించారు. అప్పటిదాకా నిజాం రాజ్యంలో ఒక తెలుగు పత్రికే లేదంటే నమ్మగలమా! అలా ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషలు రాజ్యమేలుతున్న నిజాం రాజ్యంలో తెలుగు సాహిత్యం నిలదొక్కుకునేందుకు ‘గోలకొండ పత్రిక’ బీజం వేసింది.

గోలకొండ పత్రికకి సురవరమే సర్వస్వంగా ఉండేవారు. సంపాదకుడి దగ్గర నుంచి ప్రూఫ్ రీడరు వరకూ అన్ని బాధ్యతలూ తనే నెత్తిన వేసుకుని పత్రికను నడిపించేవారు. ఆ సమయంలో ఎవరో ‘నిజాం రాజ్యంలో తెలుగు కవులు లేరంటూ’ ఓసారి సురవరాన్ని ఎగతాళి చేశారట. అందుకు జవాబుగా 354 మంది తెలంగాణ కవుల పరిచయాలతో కూడిన ‘గోల్కొండ కవుల సంచిక’ని విడుదల చేశారు సురవరం.

సురవరం గోలకొండ పత్రికతో పాటు ప్రజావాణిలాంటి పత్రికలను స్థాపించారు. నిజాం రాజ్యంలో తెలుగు పత్రికని స్థాపించడమే ఓ సాహసం అనుకుంటే... నిజాంను తన పత్రికలలో ఏకిపారేస్తూ దూకుడుగా వ్యవహరించేవారు సురవరం. ఒక దశలో నిజాం రాజు గోలకొండ సంపాదకీయాలకి సైతం భయపడ్డారంటే... సురవరం కలం ఎంత పదునైనదో అర్థం చేసుకోవచ్చు.

సంపాదకునిగానే కాదు, రచయితగానూ సురవరానిది తెలుగు సాహిత్యంలో ఓ అద్బుతమైన స్థానం. ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో దాదాపు వెయ్యేళ్ల ఆంధ్రుల చరిత్రను నమోదు చేశారు. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతిని తెలుగులో మొదటిసారి సురవరం ప్రతాపరెడ్డికే అందించింది. తెలుగువారి చరిత్రకు సంబంధించి ఇప్పటికీ ఇది ఓ ప్రామాణిక గ్రంథం. దీంతోపాటుగా సురవరం రాసిన ‘హిందువుల పండుగలు’ పుస్తకం కూడా తెలుగువారి సంస్కృతికి అద్దం పడుతుంది.

సురవరం గురించి చెప్పుకొనేటప్పుడు ఆంధ్రమహాసభ గురించి కూడా చెప్పుకోవాలి. ఒకప్పుడు హైదరాబాదులో ఉర్దూ, మరాఠీ భాషలు మాత్రమే వినిపించేవి. తెలుగు మాట్లాడేవారిని చాలా చులకనగా చూసేవారు. ఆ వివక్షను ఎదుర్కొనేందుకు మొదలైందే ‘ఆంధ్ర మహాసభ’ ఉద్యమం. 1930లో జరిగిన మొదటి ఆంధ్రమహాసభకు సురవరం అధ్యక్షునిగా వ్యవహరించారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగు మళ్లీ తలెత్తుకుందంటే అందులో ఆంధ్రమహాసభ పాత్ర ఎంతో ఉంది.

ఇలా ఏ రకంగా చూసినా కూడా తెలంగాణలో తెలుగు సాహిత్యం ఎక్కడా వెనక్కి తగ్గకుండా, తన ఉనికిని కాపాడుకునేందుకు సురవరం ప్రతాపరెడ్డి కృషి ఎంతో ఉందని తెలిసిపోతోంది.


- నిర్జర.