Facebook Twitter
డాక్ట‌ర్ సూరం శ్రీ‌నివాసులుకు సాహితీ సిరికోన పుర‌స్కార ప్ర‌దానం

డాక్ట‌ర్ సూరం శ్రీ‌నివాసులుకు సాహితీ సిరికోన పుర‌స్కార ప్ర‌దానం

ఉత్తమ సాహిత్య సృజనకు, అధ్యయనానికి అంకితమై కేవలం వాట్సప్ వేదికగానే కాకుండా ఒక సామాజిక మాధ్యమ సాహిత్య అకాడెమీగా రూపుదిద్దుకున్న 'సాహితీ సిరికోన' ప్రతి ఏటా తమ అంతర్జాతీయ వేదికపై ఎంతోమంది రచయితలను ప్రోత్సహిస్తూ పురస్కారాలు అందజేస్తోంది. ప్రతీ ఏటా అత్యుత్తమ కవితకు పురస్కారాన్ని అందించడం ఆనవాయితీగా చేసుకుంది. ఈ నేపథ్యంలో 2021కి గాను ఈ పుర‌స్కారం ప్రముఖ శతావధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి డా. సూరం శ్రీనివాసులు రచించిన 'ఏటివాలు జ్ఞాపకం' కవితను వరించింది. 

కాలిఫోర్నియా బే-ఏరియాలోని గూగుల్ సంస్థ సాంకేతిక నిపుణులు శ్రీ వేణు ఆసూరి గారు తమ మాతృశ్రీ స్మారకంగా ఏర్పాటు చేసిన శ్రీమతి ఆసూరి మరింగంటి సులోచనా రంగాచార్య స్మారక పురస్కారాన్ని, అలాగే 25 వేల నగదు మొత్తాన్ని డాక్ట‌ర్ సూరంకు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో కూడా విలువలు ఉన్న సాహిత్యం వస్తోందని, అలాంటి సాహిత్యాన్ని ప్రోత్సహించడం మంచి విషయమన్నారు. పురస్కార గ్రహీత డా. సూరం వంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని ఈ విధంగా సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన రచించిన 'ఏటివాలు జ్ఞాపకం' వస్తువులోనూ, రూపంలోనూ, అభివ్యక్తి నవ్యతలోనూ ఆధునిక  ఉత్తమ మానవీయ కావ్యంగా నిలిచిపోతుందన్నారు.

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆచార్య రాణీ సదాశివమూర్తి  కావ్యాన్ని ఆవిష్కరించి, సిరికోన పక్షాన పురస్కార విజేతను సత్కరించారు. ఇటువంటి ఆధునిక వచన కవితా కావ్యాన్ని ధారావాహికంగా రాయటం అభినందించాల్సిన విషయమన్నారు. తొలిసారిగానైనా, ఏడాది పొడవునా సిరికోనలో ఎన్నో అంశాలమీద అద్భుతమైన కవిత్వం రాసి, అందరి ప్రశంసలు పొందిన  శ్రీ దర్భముళ్ల చంద్రశేఖర్ కు  సిరికోన ప్రత్యేక బహుమతి లభించింది. ఆం.ప్ర. భాషా సాంస్కృతిక శాఖ పూర్వ నిర్దేశకులు, ప్రముఖ నాటక కర్త, డా. దీర్ఘాసి విజయభాస్కర్ పురస్కార గ్రహీతకు రూ. 10 వేల   నగదును అందించి సత్కరించారు. 

సంస్కృత విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు  శ్రీ పి.బి.ఎన్. సత్యనారాయణమూర్తి, సుప్రసిద్ధ అచ్చతెలుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్ పురస్కార గ్రహీతలను ప్రశంసించారు. కేంద్ర సమాచార పూర్వ కమీషనర్, ప్రముఖ న్యాయశాస్త్రవేత్త ఆచార్య మాడభూషి శ్రీధర్ సోషల్ మీడియాలో వస్తున్న సాహిత్యాన్ని, దాని తీరుతెన్నుల్ని వివరించారు. 

సిరికోన ప్రధాన సంచాలకులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, ప్రముఖ కవయిత్రులు ఘంటశాల నిర్మల, స్వాతి శ్రీపాద  ప్రభృతులు విజేతలకు  అభినందనలు తెలిపారు. చివరగా డా. సూరం కృతజ్ఞతలు తెలుపుతూ, త‌న‌కు ఈ పురస్కారం లభించటం ఎంతో ఆనందంగా ఉందని హర్షానందాన్ని వెలిబుచ్చారు. ఉభయరాష్ట్రాలతో పాటు అమెరికా, లండన్, కెనడాలోని సాహిత్యాభిమానాలు జూమ్ కార్యక్రమంలో  పాల్గొన్నారు.