Facebook Twitter
వాసిరెడ్డి సీతాదేవి

  

వాసిరెడ్డి సీతాదేవి

 


        స్వాతంత్ర్యానంతంరం తెలుగు కథకుల్లో, నవలా రచయిత్రుల్లో వాసిరెడ్డి సీతాదేవిది ప్రముఖమైన పాత్ర. సామాజిక వాస్తవికతకు కళాత్మకను జోడించి, అందమైన శిల్పంగా మార్చగల ప్రతిభ ఆమెది. ఎన్నో విలువైన, అమూల్యమైన నవలల్ని, కథల్ని రచించడంతోపాటు కొన్ని ఉన్నతమైన పదవులు కూడా నిర్వహించారు. ఎక్కువగా సమాజంలో దిగువ తరగతి జీవితాల గురించి, మానసిక స్థితుల గురించి,1970-90 ల మధ్య తెలుగు సమాజం గురైన మార్పులను జాగ్రత్తగా తన రచనల్లో పొందుపరిచారు.
            వాసిరెడ్డి సీతాదేవి  తండ్రి రాఘవయ్య, తల్లి రంగనాయకమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని చేబ్రోలు వీరిది. సాంప్రదాయమైన కుటుంబం. బయటకు వెళ్లాలంటే ఘోషా లాంటిది ధరించే వెళ్లే వాళ్లు. అలాంటి
కుటుంబంలో సీతాదేవి డిసెంబరు 15, 1933లో జన్మించారు. గుర్రం బండికి చుట్టూ పరదా కట్టుకొని బడికి వెళ్లేది. అలా ఐదో తరగతి వరకు చదువుకొన్నది, తర్వాత మద్రాసు వెళ్లడంతో అక్కడ ప్రైవేటుగా హిందీ చదువుకొంటూ సాహిత్య రచన వరకు పూర్తి చేశారు. అంతేకాదు ప్రైవేటుగానే నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఆ తర్వాత ఎం.ఎ. కూడా చదువుకుంది   
          సీతాదేవి 1950లో సాహిత్య రచన ప్రారంభించారు. మొదటి సారిగా జీవితం అంటే అనే నవల రాశారు. మొదటి కథ సాంబయ్య పెళ్లిని 1952లో రాశారు. మొత్తంగా వీరు 39 నవలలు, వందకు పైగా కథలు రాశారు. సాంబయ్య పెళ్లి కథలో కురూపి, దరిద్రుడు అయిన సాంబయ్య, మూగదైన మేనకోడల్ని పెళ్లిచేసుకుంటాడు. కానీ ఆమె మూగదని తెలుసుకొని దూరమై, చివరకు దగ్గరవుతాడు. ధర్మదేవత గుడ్డికళ్లు కథలో భర్త భార్యను కొట్టడం సహించలేని ఇరుగుపొరుగు భర్తను జైలుకు పంపిస్తారు. జైల్లో పరిచయం అయన వ్యక్తి ద్వారా తన తప్పు తెలుసుకుంటాడు భర్త. ఎల్లమ్మ తెల్లరూపాయి కథ మద్రాసులో కారేజీలు మోసే స్త్రీజీవితాన్ని మరింత హృద్యంగా చిత్రించింది. తరాలు అంతరాలు కథలో స్వాతంత్ర్యానంతరం స్త్రీల జీవితాల్లో వస్తున్న మార్పును తెలియజేశారు. సత్ చిత్ ఆనంద్, ధర్మాసనం కథలో స్వాముల ఆశ్రమాల్లో జరుగుతున్న అక్రమాలను, లొసుగులను ఎత్తి చూపారు. ఇలా వీరి కథల్లో వస్తువు సమాజంలోని అన్ని కోణాలను మనకు విశధీకరిస్తుంది. ఇంకా ఉద్యోగాలు చేస్తున్న స్త్రీల జీవితాలు, మూఢనమ్మకాలతో ప్రజలు పడుతున్న అవస్థలు కనిపిస్తాయి. వీరి కథల్లో ఉపన్యాసాలు ఉండవు. సూటిగా చుక్కానిలా సాగుతుంటాయి. అవసరాన్ని బట్టి సీతాదేవి గ్రామీణభాషను కూడా చక్కగా ప్రయోగించింది కథల్లో.
          మరీచిక, ఉరితాడు, వైతరణి, మృగతృష్ణ, అడవి మల్లె, ఊర్మిళ, బొమ్మరిల్లు, నింగినుండి నేలకు, ప్రతీకారం, తొణికిన స్వప్నం...ఇలా ఎన్నో నవలలు మనకు అందించారు వాసిరెడ్డి సీతాదేవి. వీరి నవలలు కుటుంబ వాతావరణంలో వస్తున్న మార్పులను ఒడిసి పట్టుకున్నాయి. చిన్నతనంలో బాల్యంలో పడిన ముద్రలు జీవితాంతం ఎలా వెంటాడతాయో చాలా నవలల్లో చిత్రీకరించారు ఈమె. మానినీ  నవలలో సావిత్రి తన మామ, అత్తను కొట్టడం, హిసించడం చూసి మగవారిపై అనుమానాన్ని పెంచుకుంటుంది. దాంతో స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేస్తుంది. మృగతృష్ణ నవలలో కూడా సునంద బాల్యం ఇలానే ఉంటుంది. మరీచిక నవల్లో శబరి తండ్రి చూపే అతిప్రేమ, తల్లి చేసే షాపింగ్ లతో ఆమె జీవితంలో అద్భుతాలు సృష్టించాలనుకొని డ్రగ్స్ కు బానిస అవుతుంది. సమత నవల రాజకీయాల్లోని కుళ్లను కడిగేస్తుంది. కాపురాన్ని, ఇంటిని వదిలిన స్త్రీజీవితాన్ని కూడా వివరిస్తుంది. మరీచిక నవల నక్సలైట్ ఉద్యమాన్ని చిత్రించింది. 1980లలో ఈ నవలను ప్రభుత్వం నిషేధించింది. అయితే కొంతమంది సాహిత్యకారుల అభిప్రాయాలతో మళ్లీ నిషేధాన్ని ఎత్తి వేసింది. రాబంధులు - రామచిలుకలు నవలలో భూస్వాముల దోపిడీ, వర్గపోరాటాన్ని అద్భుతంగా వివరించింది.                                           
          వాసిరెడ్డి సీతాదేవి చిన్నారుల కోసం బుజ్జి కథలు కూడా రాశారు.
         సీతాదేవి రచనలను విశాలాంధ్ర వాళ్లు 9 సంపుటాలుగా వెలువరించారు. యాభై కథల్ని ఒక సంపుటంగా తెచ్చారు. ప్రస్తుతం 5 సంపుటాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీరి నవలలు కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. సమత ప్రజానాయకుడు సినిమాగా, ప్రతీకారం నవల మనస్సాక్షిగా, మానినీ నవల ఆమెకథగా మృగతృష్ణ నవల అదే పేరుతో సినిమాలుగా వచ్చాయి. మట్టిమనిషి నవల 14 భాషల్లోకి అనువాదం పొందింది.
         వీరికి ఐదుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయాలు గౌరవ డి.లిట్ లను ప్రధానం చేశాయి. తెలుగువిశ్వవిద్యాలయం జీవితకాల పురస్కారం కూడా ఇచ్చింది. వాసిరెడ్డి సీతాదేవి ఏప్రిల్13, 2007లో మరణించారు. కానీ ఆమె రచనలు, అవి సంధించిన ప్రశ్నలు మాత్రం మనల్ని జాగృతం చేస్తూనే ఉంటాయి.

- డా. ఎ.రవీంద్రబాబు