TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
త్యాగరాజు
తెలుగు వాగ్గేయ కారులలో ప్రముఖులు త్యాగరాజు గారు. ఈయన నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చునని నిరూపించిన మహానుభావుడు. ఈయన ప్రకాశం జిల్లా కంభం మండలం లోని కాకర్తలో 1767 వ సంవత్సరం మే 4 వ తేదీన జన్మించారు. కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మల మూడో సంతానం త్యాగరాజు. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు వినిపించిన గీతాలే ఈయనను సంగీతం పట్ల ఆకర్షణీయుణ్ణి చేశాయి. వీరు కాకర్ల నుండి తమిళ నాడుకి వలస వెళ్ళారట. త్యాగరాజు తాతయ్యగారు గిరిరాజ కవిగారి దగ్గర త్యాగయ్య సాహిత్య అధ్యయనం చేసేవారట. తర్వాత త్యాగయ్య గారిని సంగీతాభ్యసము కోసం శొంఠి వెంకటరమణయ్యగారి దగ్గర చేర్చారట.
త్యాగయ్య గారి తండ్రిగారు అస్తమించినప్పుడు ఈయన భాగములు కులప్రతిమలైన శ్రీరామలక్ష్మణులు విగ్రహములు వచ్చాయట. ఆ ప్రతిమను అతి భక్తితో పూజిస్తూ...తన యిష్టదైవమైన శ్రీరాములపై క్రుతులు రచించేవారట. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామనామములుజపించి వారి దర్శనము పొంది వారి ఆశీర్వాదము పొందారు. ఈయనకు 18 సంవత్సరాల వయసులో పార్వతి అనే యువతితో వివాహం అయిందట.కానీ ఆమె ఆయన 23 వయస్సులో ఉండగానే మరణించిందట. తర్వాత త్యాగరాజు గారు ఆమె సోదరి అయిన కమలాంబ అనే యువతిని వివాహం చేసుకున్నారట. వీరికి సీతామహలక్ష్మి అనే కూతురు కలిగిందిట.తమ ద్వారా త్యాగరాజుకి ఒక మనవడు కలిగాడట కానీ యవ్వనంలోకి అడుగు పెట్టకముందే మరణించాడట.
కాబట్టి త్యాగరాజుకు కచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొన సాగుతూనేఉంది. చిరు ప్రాయము నుండే త్యాగరాజు నమో నమో రాఘవా...అనే కీర్తన పాడారట.. గురువు శొంఠి వేంకటరమణయ్య గారి ఇంటిలో చేసిన కచేరీ లో దరో మహానుభావులు కీర్తనను పాడారట. ఈ పాటకు వెంకట రమణయ్య గారు చాలా సంతోషించి త్యాగరాజు గారిలోని బాల మేధావి గురించి తంజావూరు రాజుగారికి చెబితే రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించారట. త్యాగరాజు నిధి కన్నా రాముని సన్నిధి సుఖమని ఆ కానుకలని తిరస్కరించారట.
అతని అన్నయ్య జపేవుడు ...త్యాగరాజు నిత్యం పూజించే విగ్రహాలను కావేరీ నదిలో విసిరేసాడట. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారత యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను తీర్ధములను దర్శించి ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించారట. చివరగా శ్రీరామున అను గ్రహంతో విగ్రహాలు పొందారట. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిదిని చేరుకున్నాడు. త్యాగయ్య 24 వేల కీర్తనలు రచించారు. త్యాగయ్య ఏ దేవాలయానికి వెళితే అక్కడ దేవుడి మీద కీర్తనలు చెప్పేవారు. అలా చెప్పిన వాటిలో..
1. జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా
2. సంగీత జానము భక్తి వినా సన్మార్గము గలదే...
3. ఎందరో మహానుభావులు...
4. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి
5. మరుగేలరా ఓ రాఘవా
6. మనసులోని మర్మమును దెలుసుకో...
7. సామజ వరగమనా...
8. ఎంతనేర్చిన ఎంత జూచినా ఎంతవారలైనా...
9. శాంతము లేక సౌఖ్యము లేదు
లాంటి కీర్తనలు ఎన్నిటితోనో అందరినీ అలరించిన... మహానుభావుడు త్యాగరాజు గారు. 1847 జనవరి 6 వ తేదీన స్వర్గస్దులయ్యారు. అయినా ఆయన కీర్తనలు.... ఎన్నిజన్మలైనా అలా భద్రంగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు... అపారమైనది ఆయన దైవ భక్తి.... అదే ఇచ్చింది ఆయనకు శక్తి... ఆ మహనీయుడి కీర్తనలు విన్నప్పుడల్లా ఆయన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం...ధన్యవాదాలు చేసుకుందాం...