Facebook Twitter
ఈ రచయితలు ఉపాధ్యాయులు కూడా!

 

మంచి ఉపాధ్యాయులు మంచి రచయితలు అవుతారని కొందరి నమ్మకం. అందుకు కారణం లేకపోలేదు. ఉపాధ్యాయుడైనా, రచయిత అయినా... తనకు తెలిసిన విషయాన్ని, తోచిన ఆలోచనని నలుగురికీ అర్థమయ్యేలా ఆసక్తికరంగా చెప్పగలిగినప్పుడే విజయం సాధిస్తాడు. అలా అటు టీచర్‌గానూ, ఇటు రైటర్‌గానూ విజయం సాధించిన కొందరి వివరాలు....

సల్మాన్ రష్దీ – ‘సాటానిక్‌ వర్సెస్’ పుస్తకంతో ముస్లింలతో తగువు పెట్టుకున్నా ‘మిడ్‌నైట్‌ చిల్డ్రన్’ అంటూ భారత విభజన గురించి నవల రాసినా సల్మాన్‌ రష్దీ ప్రతి పుస్తకమూ ఓ సంచలనమే! సల్మాన్‌ రష్దీ అమెరికాలోని ‘ఎమొరీ విశ్వవిద్యాలయం’లో ఏటా క్లాసులు చెబుతూ ఉండేవారు. ఇలా దశాబ్దకాలానికి పైగానే రష్దీ ఎమరీ విద్యార్థలకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఆంగ్ల సాహిత్యంతో పాటుగా చరిత్ర, రాజకీయాలు, మతం, సినిమారంగాల మీద కూడా తన అనుభవాలను పిల్లలతో పంచుకునేవారు.

స్టీఫెన్ కింగ్‌ – హారర్‌ నవల అనగానే స్టీఫెన్ కింగ్ పేరే గుర్తుకువస్తుంది. ఆయన రాసిన నవలల ఆధారంగా 50కి పైగా సినిమాలు రూపొందాయంటే స్టీఫెన్ ప్రభావం ఏమిటో అర్థమవుతుంది. ఆ సినిమాల్లో ‘The Shawshank Redemption’లాంటి బ్లాక్‌బస్టర్లు కూడా ఉన్నాయి. స్టీఫెన్ చదువు చెప్పడంలో డిప్లొమాను తీసుకున్నాడు. కానీ వెంటనే ఏ ఉద్యోగమూ దొరక్కపోవడంతో కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చినా... అటు కథలు రాస్తూ, ఇటు చదువు చెబుతూ తన వృత్తిని కొనసాగించాడు.

జే.కే. రౌలింగ్‌ – హ్యారీ పోటర్ గురించి ఈ ప్రపంచానికి ఎంత తెలుసో... ఆ పుస్తకాల రచయిత రౌలింగ్ గురించి కూడా అంతే తెలుసు. నానాకష్టాలనూ ఎదుర్కొని పైకి వచ్చిన రౌలింగ్ అంటే అందరికీ ఆరాధనే! రౌలింగ్‌కు కష్టకాలంలో ఎవ్వరూ తోడు లేకపోయారు. కానీ ఆమె ఎంచుకున్న ఉపాధ్యాయ వృత్తి మాత్రమే కావల్సినంత విశ్వాసాన్ని రగిల్చింది. తన పోర్చుగల్‌ విద్యార్థులకు ఆమె ఇంగ్లిష్ బోధించేది. ఒకపక్క పిల్లలకు చదువు చెబుతూనే, రెస్టారెంట్లలో కూర్చుని హ్యారీ పాటర్‌ నవలను పూర్తిచేసింది. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే!

డాన్‌ బ్రౌన్ – ‘ద డావిన్స్ కోడ్‌’ అన్న ఒకే ఒక్క పుస్తకంతో సాహిత్యంలో సంచలనం సృష్టించినవాడు డాన్‌ బ్రౌన్‌. ఈయన తండ్రి ఓ గొప్ప లెక్కల టీచరట. పిల్లలకు లెక్కల పుస్తకాలు కూడా రాశారట. ఆయన బాటలోనే బ్రౌన్‌ కూడా ఇంగ్లిష్‌, స్పానిష్ భాషలను నేర్పేవారు. క్రమంగా పుస్తకాలూ రాయడం మొదలుపెట్టారు. 1998లో ఆయన రాసిన ‘డిజిటల్‌ ఫోర్టెస్’కు మంచి పేరు రావడంతో ఇక పూర్తిగా రచనలకే అంకితమైపోయారు.

వీళ్లే కాదు... ప్రపంచ సాహిత్యం మీద తనదైన ముద్ర వేసిన షేక్‌స్పియర్‌, తన కవితలతో నెహ్రూని ప్రభావితం చేసిన Robert Frost, అలిస్ ఇన్‌ వండర్‌లాండ్‌ రాసిన Lewis Carroll అంతా కూడా ఉపాధ్యాయులే! ఇక తెలుగు సాహిత్యానికి వస్తే.... విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, సినారే వంటి ఎందరో రచయితలు ఉపాధ్యాయులుగా ఉంటూ తమ కలాన్ని కదలించినవారే!

- నిర్జర