TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అన్నమయ్య కాదు... ఇతను యథావాక్కుల అన్నమయ్య!
తెలుగు సాహిత్యంలో అన్నమయ్య పేరు వినపడగానే ఆ శ్రీనివాసుని తన కీర్తనలతో కొలిచిన తాళ్లపాక అన్నమయ్యే గుర్తుకువస్తాడు. కానీ అంతకు ఓ రెండు వందల సంవత్సరాలకు పూర్వం, అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి తెలుగునాట సుస్థిరమైన ఒక శతకాన్ని రాశారు. ఆ శతకం పేరు ‘సర్వేశ్వర శతకం’. దాన్ని రాసినవాడు ‘యథావాక్కుల అన్నమయ్య’.
శతకసాహిత్యం కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితమైన ప్రక్రియ కాదు. కానీ కొన్ని నియమాలకు కట్టుబడి ఛందోబద్ధంగా సాగే శతకాలు మన దగ్గరే ఎక్కువగా కనిపిస్తాయి. కొబ్బరి చిప్ప దగ్గర నుంచి స్వాతంత్ర్య పోరాటం దాకా ఏ విషయం మీదైనా శతకం రాయగలగడం తెలుగు కవులకే సాధ్యం. అందుకే ఇప్పటివరకు తెలుగులో పదివేలకు పైగా శతకాలు వెలువడ్డాయని ఓ అంచనా!
తెలుగునాట వెలువడిన తొలి శతకాలలో సర్వేశ్వర శతకం ఒకటి. శివభక్తే ప్రధానంగా సాగే ఈ శతకం ‘సర్వేశ్వరా’ అనే మకుటంతో 142 పద్యాలతో కనిపిస్తుంది. ఒకవైపు శివుని మహిమను వర్ణిస్తూనే, శివభక్తులను కూడా అంతే గౌరవంగా చూసుకోవాలని సూచిస్తుంది. సర్వేశ్వర శతకంలో ఉన్న ఓ ప్రత్యేకత.. ఖచ్చితమైన కాలనిర్ణయం. తాను ఈ శతకాన్ని 1242లో రాశానని అన్నమయ్య తన శతకంలో పేర్కొన్నాడు. ఆకాలంలోని సాహిత్యంలో ఇలాంటి స్పష్టత చాలా అరుదుగా కనిపిస్తుంది.
సర్వేశ్వర శతకం మత్తేభ, శార్దూల వత్తాలలో రాయబడింది. మత్తేభం అంటే ఏనుగు, శార్దూలం అంటే పులి. శివుడు ఏనుగు చర్మాన్నీ, పులి చర్మాన్నీ ధరించే విరాగి. అందుకనే కవి ఆ వృత్తాలను ఎంచుకున్నాడనీ అంటారు. సర్వేశ్వర శతకం శివుని మీద రాసిందే అయినా... ఇందులో ప్రత్యేకించి ఒకే పుణ్యక్షేత్రం గురించి కానీ, ఒకే కథని కానీ ఆధారం చేసుకోకపోవడం మరో ప్రత్యేకత.
ఇంతకీ ఈ యథావాక్కుల అన్నమయ్య వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి స్పష్టమైన సమాచారమూ లేదు. ఈయన గోదావరి జిల్లావాడని కొందరంటే, కర్నూలు జిల్లావాడని మరికొందరి అభిప్రాయం. కానీ శ్రీశైల మల్లికార్జునుడి భక్తుడన్న విషయంలో మాత్రం ఎలాంటి సందేహమూ లేదు. యథావాక్కుల అన్నమయ్య తన శతకాన్ని రాయడం వెనుక ఓ సరదా కథ ఒకటి ప్రచారంలో ఉంది. దాని ప్రకారం-
యథావాక్కుల అన్నమయ్య తాను తాటాకు మీద రాసిన ప్రతి పద్యాన్నీ నీటిలోకి వదిలేవాడట. అది కనుక తిరిగి వస్తే, పరమేశ్వరుడు తన పద్యాన్ని అంగీకరించినట్లుగానూ... తిరిగి రాకపోతే తిరస్కరించినట్లుగానూ భావించాడట. ఒకవేళ అలా ఎప్పుడైనా ఓ పద్యం తిరిగిరాని పక్షంలో తన మెడను కత్తిరించుకుంటానని శపథం చేశాడట. అలా ఒకనాడు ఆయన నీటిలో విడిచిన పద్యం తిరిగిరాలేదు. దాంతో తన మెడను కత్తిరించుకునేందుకు సిద్ధపడ్డాడు. ఆ సమయంలో ఓ పశువుల కాపరి సదరు పద్యం ఉన్న తాటాకుని తీసుకుని అన్నమయ్య దగ్గరకు వచ్చాడు. ఆ తాటాకు మీద అన్నమయ్య రాసిన పద్యంతో పాటుగా మరో పద్యం కూడా రాసి ఉండటం విశేషం. ఇదంతా ఆ పరమేశ్వరుని అనుగ్రహమే అని భావించిన అన్నమయ్య తన శతకాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేశాడు.
సర్వేశ్వర శతకంలోని ఓ పద్యం మచ్చుకి...
ఆనందంబును బొందునప్పుడును, సత్యాశ్చర్యకార్యార్థ భా
వానీకంబులు దోచునప్పుడును, రోగాపాయ దుఃఖాతుర
గ్లానింబొంది చరించునప్పుడును, సత్కార్యంబున న్నీవు నా
ధ్యానంబందు దయింపుమయ్య దివిజేంద్రస్తుత్య సర్వేశ్వరా !
... ఆనందం, ఆశ్చర్యం, అనారోగ్యం, శ్రమ, దుఃఖం, కష్టం, సత్కార్యం... ఇలా సర్వావస్థల్లోనూ తన మదిలో నిలవమంటూ శివుని వేడుకొనడమే ఈ పద్యంలోని భావం.
- నిర్జర.