Facebook Twitter
గురకానందం

 

గురకానందం

 


 తెలుగు సాహిత్యంలో ప్రధానంగా చెప్పుకోదగిన వచన కవితా రచనలు విష్ణుధనువు, నవమి చిలుక. వీటిని రచించిన కవి శిష్ట్లా ఉమామహేశ్వరారవు. అద్భుతమైన ఊహలు చేయడంలో, వాటిని కవిత్వపు అక్షరాలుగా మార్చడంలో వీరికి వీరే సాటి. ప్రముఖ విమర్శకులందరూ వీరి కవితా రచనలను మెచ్చుకున్న వారే. అలాంటి ఉమామహేశ్వరరావు కథలు రాశాడని చాలా మందికి తెలియదు. సిపాయి కథలు, ఆంగ్లో ఇండియన్ కథలు వీరు రాసిన ఆణిముత్యాలే. అదీగాక వీరి కథలు హాస్యపు జల్లులు కురిపిస్తాయని, పొట్టచెక్కలయ్యేలా నవ్వును పుట్టిస్తాయని కూడా తెలియదు. అయితే వీరి గురకానందం కథ హాస్యాన్నే కాదు, హాస్యంతో పాటు అద్భుతమాన ముగింపుతో మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.

గురకానందం కథ చాలా విచిత్రంగా మొదలవుతుంది. అసలు ఆనందరావు పుట్టగానే పేరుపెట్టడంలోనే తల్లిదండ్రుల మధ్య చర్చ జరుగుతుంది. తల్లి- "వాళ్లమ్మ అచ్చమ్మ, నాన్న రామయ్యల పేర్లు కలిసుండేలా అచ్యుతరామయ్య అనే పేరు పెడదామని" అంటుంది. తండ్రి- "తెల్లవాళ్ల దేశంలో కూడా జాతకాలు పాటిస్తున్నారని చెప్పి చివరకు ఆనందరావు" అని పేరు పెడతాడు. అలాంటి ఆనందం బి.ఏ. చదవడానికి పట్నం వెళ్తాడు. ఆనందం గురకకు భయపడి ఎవరూ అతని రూములో చేరరు. చివరకు ఒక్కడికే రూమ్ లో ఉండాల్సి వస్తుంది. అయితే ఆనందరావును వెక్కిరించడం, గురకను ఎగతాళి చేయడం తోటి విద్యార్థుల్లో మొదలైంది. ఒక అరవ కుర్రాడు "ఎన్నడా గురకారావ్" అని పిలిస్తే అది నచ్చని తెలుగు వాళ్లు "గురకానందం" చేశారు. అలా ఆనందారావు కాస్తా గురకానందంగా మారిపోయింది.

హాస్టల్ కుర్రాళ్ల బాధ ఇలా ఉంటే ఇక భార్య సుశీల బాధ వర్ణనాతీతం. శోభనం రోజు రాత్రే గుండెల్లో రాయిపడింది. అసలు మొదట్లో గురక ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కునే ప్రయత్నం చేసి చివరు అది భర్తనుంచి వచ్చేశబ్దం అని తెలిసి విస్తుపోయింది.  రెండోరోజే కన్నీళ్లతో భర్తగదిలోకి అడుగు పెడుతుంది. భర్తచేత గురక మాన్పిద్దామనుకున్న సుశీల ప్రయత్నం అప్రయత్నంగానే మిగిలిపోయింది. ఇక ఓ నిర్ణయానికి వచ్చేసి, పుట్టింటికి వచ్చేసింది. ఆఖరకు సుశీల అమ్మ సలహా కూడా ఇచ్చింది." కిటికి అవతల గాడెదను కట్టేసి ఆ అరుపను వినిపించ"మని, సుశీల ఆ ప్రయత్నం చెయ్యలేదు కానీ భర్త దగ్గరకు మాత్రం వెళ్లనంది. గురకానందం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్ల కాపరానికి కూడా వచ్చింది. సుశీలకు బాగలేక ఆసుపత్రిలో జేరితే అక్కడే ఆనందరావుకు భార్యగా వచ్చిన రెండో పిల్ల పరిచయం అవుతుంది. ఆనందారావు గురక పెట్టడం లేదని చెప్తుంది. దాంతో సుశీల అమ్మ నాన్న సుశీలను కాపరానికి పంపాలని నిర్ణయించుకొని ఓ ప్లాన్ వేస్తారు.

ఇంట్లో సుశీల నిద్రపోయేటప్పుడు కావాలని ఇద్దరూ గురకపెడుతున్నట్లు నటిస్తారు. అది విని సుశీలకు విసుగొస్తుంది. రోజు రోజుకు పెరిగే గురకశబ్దాలు వినలేక సుశీల కాపురానికి వెళ్తాననే నిర్ణయానికి వస్తుంది.  తల్లిదండ్రులు రాజీ మాటలు సాగించి ఆనందరావు దగ్గరకు మళ్లీ సుశీలను పంపుతారు. ఓ రోజు తండ్రి సుశీలను చూడ్డానికి వచ్చి, "నిన్ను కాపురానికి పంపడానికి గురక తంతువాడం. కానీ మీ అమ్మకు గురక అలానే అలవాటైంది. నేను పడలేకపోతున్నాను" అని తన గోడు వెళ్లబోసుకుంటాడు. సుశీల తండ్రి గురకతో ఆనందానికి నిద్ర లేకుండా పోతుంది. ఎప్పుడు మీ నాన్న ఊరికి వెళ్తాడు అని అడుగుతాడు.  అలానే సుశీల కూడా గురక పెడుతుందన్న విషయాన్ని ఆనందరావు చెప్పడంతో... కథ ముగుస్తుంది.

ఇలా కేవలం గురక వల్ల ఇతరులు పడే కష్టాన్ని ఇతివృత్తంగా తీసుకొని పూర్తి హాస్యంతో రాశారు కథను ఉమామహేశ్వరరావు. ఆనందరావు పేరు పెట్టడం నుంచి, గురక వల్ల భార్యాభర్తలు విడిపోవడం, ఆనందరావురెండో పెళ్లి, తల్లిదండ్రులు గురకతోనే భార్యాభర్తల్ని కలపాలన్న పన్నాగం, చివరకు సుశీలే గురకపెట్టడం... ఇలా ప్రతిది ట్విట్ ఫర్ టాట్ లా సాగుతుంది. కథ మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. పాత్రోచిత భాష మరొ గొప్ప లక్షణం. ఇలా ఈ కథను ఇప్పుడు చదివినా గురక వల్ల పడే బాధ ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చి మన ముఖంలో కూడా నవ్వులు పూస్తాయి.

-డా. ఎ.రవీంద్రబాబు