Facebook Twitter
ప్రమదాక్షరి ఉగాది హేల






ఉగాది పర్వదినం మరునాడు శ్రీమతి సోమరాజు సుశీలగారింట్లో ప్రమదాక్షరి సమావేశం జరపాలని నిర్ణయిచబడింది. ఉగాది రోజున ఎక్కడ చూసినా పంచాంగ శ్రవణాలతోపాటు కవి సమ్మేళనాలూ, కవితాగానాలూ, పండిత సన్మానాలూ జరుగుతూ వుంటాయికదా. కొత్త సంవత్సరం మొదలుకదా, మనం మాత్రం ఆ ఆనవాయితీని పోగొట్టటమెందుకు, మనలో అనేకమంది కవయిత్రులు వున్నారు, వారంతా కవితాగానం చెయ్యండి అన్నారు ఎడ్మిన్స్. మనవారిలో కూడా అనేక అవార్డులు పొందినవారున్నారుకదా, వారిని ప్రమదాక్షరి తరఫున సన్మానించుకుందాం, ఎవరెవరికి ఏ అవార్డులొచ్చినయ్యో, కిందటి ఉగాది నుంచీ ఇప్పటిదాకా ఏ ఏ బహుమతులొచ్చినయ్యో లిస్టు పెట్టెయ్యండి, ఫైల్ ఓపెన్ చేశానన్నారు భానక్క .. మరేనండీ .. భానక్కంటే శ్రీమతి మంధా భానుమతే

మీరెవరూ దిష్టిపెట్టనంటే చెబుతాను...అదేం లిస్టండీ...ఏ ఒకరిద్దరికో తప్పితే అందరికీ బహుమానాలొచ్చాయి .. పైగా ఒకటికాదు రెండుకాదు .. కిందటేడు తెలుగు సాహిత్యంలో వున్న బహుమతులు మూడొంతులు పైన వీళ్ళదగ్గరే వున్నాయండీ. మీకు నమ్మకం లేకపోతే పత్రికలు తిరగెయ్యండి, లేకపోతే లిస్టు భానక్క దగ్గరుంది. వీరంతా మా ప్రమదాక్షరి మెంబర్లు, మా స్నేహితులు, వారితో మాకెంతో సాన్నిహిత్యమున్నది, వారితో మేమంతా సరదాగా గడుపుతాం అన్న భావనే నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాంటి మహానుభావులలో కొందరి పేర్లు......

శ్రీమతులు

* ఆర్. శాంత సుందరి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
* సోమరాజు సుశీల, మాకు ఆతిధ్యమిచ్చిన ప్రముఖ రచయిత్రి
* మంధా భానుమతి, ప్రముఖ రచయిత్రి, ప్రమదాక్షరి ఎడ్మిన్
* ముక్తేవి భారతి, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత
* డి. కామేశ్వరి, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత
* పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ హాస్య రచయిత్రి, ఈ సంవత్సరం మునిమాణిక్యంవారి హాస్య సాహిత్య అవార్డు గ్రహీత
* కె.బి. లక్ష్మి, ప్రముఖ విశ్లేషకురాలు, కవయిత్రి, కధయిత్రి, సంపాదకురాలు, కాలమిస్ట్, వక్త.
* అత్తలూరి విజయలక్ష్మి, ప్రముఖ రచయిత్రి. నాటికలు వీరి ప్రత్యేకత. కధలు, వ్యాసాలు, నవలలుకూడా వ్రాస్తారు.
* పోడూరి కృష్ణకుమారి, ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత్రి
* శీలా సుభద్ర, ప్రముఖ కవయిత్రి, చిత్రకారిణి, కధయిత్రి, గాయని
* గంటి సుజల (అనూరాధ), ఈ సంవత్సరం సాహిత్యంలో అత్యధిక బహుమతులు అందుకున్న ప్రఖ్యాత రచయిత్రి
* వారణాసి నాగలక్ష్మి, ప్రముఖ కధయిత్రి. వీరుకూడా తమ కధలకు బహుమతులు అందుకున్నారు. చిత్రకారిణి,

కవయిత్రి, గాయకురాలు
* తమిరశ జానకి, ప్రముఖ రచయిత్రి. అనేక కధలు, కవితలు, నవలలు రాశారు. అనేక పోటీలకు న్యాయ నిర్ణేతగా వున్నారు. ప్రముఖ అంతర్జాల పత్రిక సుజనరంజని సంపాదకవర్గంలో ఒకరు. ఈ సంవత్సరం మానసా ఆర్ట్స్ వారి పురస్కారాన్ని అందుకున్నారు.
* జి.యస్. లక్ష్మి, హాస్య లక్ష్మి అని అందరం పిలుచుకునే ఈవిడ ప్రముఖ రచయిత్రి. తమ కధలకు అనేక బహుమతులు అందుకున్నారు. బ్లాగరి.
* పి.యస్..యమ్. లక్ష్మి, యాత్రా వ్యాసాలేకాక కధలు, నాటికలు, కవితలు రాస్తారు. రచయిత్రులలో తెలుగులో ఇప్పటిదాకా అత్యదిక యాత్రా వ్యాసాలు వ్రాసిన రచయిత్రి. యాత్రలగురించి 6 ఇబుక్స్ ప్రచురించారు.
* నండూరి సుందరీ నాగమణి, అనేక కధలు రాశారు. అంతర్జాలంలో అనేక కవితలకు బహుమతులు అందుకున్నారు. అంతర్జాల మాస పత్రికలో ప్రతి నెలా పజిల్స్ నిర్వహిస్తున్నారు.
* మణి వడ్లమాని, ప్రముఖ కధా రచయిత్రి. తమ కధలకు బహుమతులు అందుకున్నారు. ఈ నెలలో 3 ప్రముఖ పత్రికలలో వారి కధలు ప్రచురించబడ్డాయి.
* స్వాతి శ్రీపాద, ప్రముఖ రచయిత్రి. అనువాదం వీరి ప్రత్యేకత. అనేక కధలు, నవలలు రాశారు. ప్రముఖ కవయిత్రి.
* వీరుకాక ఆ రోజు సమావేశంలో పాల్గొన్న విదుషీమణులు, ముచ్చర్ల రజనీ శకుంతల, శ్రీ రమణగారి శ్రీమతి జానకి, ప్రమదావనం ప్రోత్సాహంతోనే రచయిత్రులమయ్యామనే శ్రీమతులు మాలా కుమార్, బాలా మూర్తి, బి. ఉమా మహేశ్వరి ఇంకా ఎందరో. నేను మరచిపోయి పేర్లు పేర్కొననివారంతా నన్ను క్షమించాలి.
* మరి సమావేశం ముచ్చట్లు చెప్పాలికదా...ఉదయం 10-40 కు బయల్దేరి నేను మాలా కుమార్, దోవలో కె.బి. లక్ష్మిని పికప్ చేసుకుని సోమరాజు సుశీల గారింటికి వెళ్ళాము. దోవంతా ఎన్నో కబుర్లతోబాటు ఎండలు పెరిగిపోతున్నాయి,
* ఇంక ఎండల్లో బయటకి రాకూడదనే ఆపసోపాలూ అయినాయి, పగలంతా కూర్చోలేము వీలయినంత పెందరాళే వచ్చేద్దామనే నిర్ణయాలూ అయ్యాయి.

ఉదయం 11-30కి సుశీలగారింట్లో అడుగు పెట్టాము. ఒక్కసారి ఎన్ని స్నేహ సుమ పరిమళాలో....మల్లెలు, జాజులు, సంపెంగలు, మొగలిపూలు, పొగడలు, చామంతులు, మాలతులు, మందారాలు, గులాబీలు ఇంకా ఎన్నో ఎన్నో సువాసనలు గుప్పుమన్నాయి. అర్ధమయిందా? అప్పటికే అక్కడ మన మిత్రులు వున్నారన్నమాట. వారి పలకరింపుల పరిమళాలవ్వి.

పెద్దలు అతిధి దేవోభవ అనేవారు. పూర్వం అతిధులని ఆదరించటం గృహస్తు ధర్మాలలో ముఖ్యమైనవాటిలో ఒకటి. ఆతిధ్యమివ్వటం ఒక కళలాంటిది. ఈ మధ్య ఉరుకుల పరుగుల జీవితాలతో ఆ కళ కళ తప్పిపోతోంది. కానీ నిన్న సుశీలగారింట్లో కళకళలాడింది. వెళ్ళగానే మంచి నీరు ... ఎండనబడొచ్చారు, వెంటనే తాగద్దు, రెండు నిముషాలాగి తాగండి అనే మిత్రుల ఆప్యాయతతో, తర్వాత భానుడి ప్రతాప భారాన్ని తగ్గించే ఫ్రూట్ సలాడ్ ... కొంచెం చల్లబడ్డామో లేదో ఇంకొంచెం స్ధిమితపడండి అంటూ కొబ్బరి నీరు. మిస్సయినవారంతా ఖచ్చితంగా బాధ పడాల్సిందే. ఇవే కాదు, ఇంకా చాలా మిస్సయ్యారు మీరు.

సభ్యులూ, అతిధులూ ఒక్కొరొక్కరూగా చేరుకుంటూ, కబుర్లు సాగుతున్న సమయంలో భానక్క సభ మొదలుపెట్టారు. ఇవాళ సమావేశంలో ముఖ్యంగా రెండు అంశాలున్నాయి. ఒకటి కవితాగానం, రెండోది పురస్కార గ్రహీతలకు సన్మానం. ముందు కవితాగానం. సభ్యులు చాలామంది తమ కవితలు వ్రాసుకు వచ్చి చదివి వినిపించగా, శ్రీమతి కె.బి. లక్ష్మి, పొత్తూరి విజయలక్ష్మి ఆశువుగా చెప్పి అలరించారు. ఇంకొక ముఖ్య అతిధి, మిధునం రచయిత శ్రీ రమణ, వారి వాక్చాతుర్యంతో సభ్యులను ఆకట్టుకుని కడుపుబ్బ నవ్వించారు. ఫ్రూట్ సలాడ్, కొబ్బరి నీళ్ళు, ఆప్యాయతలు, కవితాగానాలతో వచ్చిన శక్తి అంతా వీరి కవిత్వాలకీ, జోకులకీ నవ్వీ నవ్వీ ఖర్చు పెట్టేశాము.

మధ్యాహ్నం 1-30 అవుతోంది. అందరూ భోజనాలకి లేవండి అన్నారు. ఎండాకాలం ఏమీ తినబుధ్ధి కావటం లేదు అనుకుంటూ ప్లేటు తీసుకున్నవాళ్లమంతా మారు వడ్డించుకోకుండా మానలేదంటే నమ్మండి. గుత్తి వంకాయ కూర, బీరకాయ కూర, పప్పు, పెరుగు పచ్చడి, గోంగూర పచ్చడి, ఆవకాయ, ముక్కల పులుసు, కుండలో తోడు పెట్టిన గడ్డ పెరుగే కాదు, బొబ్బట్లు, పులిహోర, మిర్చి బజ్జీ. బి.పీలు షుగర్లూ ఆ సమయంలో ఎవరికీ గుర్తు రాలేదు. వాటి రుచిని మెచ్చుకోనివారు లేరు. కేటరర్స్ ఎవరూ అని అడిగిన నాకు ఠక్కున సమాధానం వచ్చింది ..అవ్వన్నీ స్వయంగా శ్రీమతి సుశీలగారే చేశారు. హయ్యబాబోయ్ .. నేను కలలోకూడా చెయ్యలేని పని.

కమ్మటి విందారగించిన తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి శాంత సుందరి, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతలు శ్రీమతి డి. కామేశ్వరి, ముక్తేవి భారతికీ, తర్వాత ప్రమదాక్షరిలో బహుమతుల గ్రహీతలతోబాటు ఈ సంవత్సరం అధిక రచనలు చేసినందుకు నాకు కూడా ప్రమదాక్షరి ఆత్మీయ సత్కారం జరిగింది. బహుమతిగా శ్రీమతి స్వాతి శ్రీపాద స్పాన్సర్ చేసిన అందాల కుంకుమ భరిణ, పుష్పంతో సహా ఇచ్చారు. అనురాగ పూరితమైన ఈ అత్మీయ సత్కారం అన్ని అవార్డులకన్నా మిన్న అనుకున్నాం అందరం.

ఈ సందట్లో అందరికీ కూర్చున్న చోటికే కసటా ఐస్ క్రీంలు, తర్వాత కాఫీలు సరఫరా చెయ్యబడ్డాయి. కుళ్ళుకోకండని ముందే చెప్పా. ఈ కార్యక్రమాలయిపోయాక గ్రూప్ ఫోటో. ఓపికగా కార్యక్రమాన్నంతా ఫోటోలు తీసినవారు శ్రీ గంటి మూర్తిగారు.

ఎంతో సందడిగా సాగిన కార్యక్రమాలు అయిపోయినా ఇంటికి రావాలనిపించలేదు అందరినీ వదిలి. అక్కడికీ వేరే కార్యక్రమాలున్నవారు కొందరు సెలవు తీసుకుంటున్నారు. ఎండల్లో ఎక్కడికీ వెళ్ళద్దని వచ్చేటప్పుడు డిసైడ్ చేసుకున్నవాళ్ళం, భానక్కా మళ్ళీ ప్రోగ్రాం ఎప్పుడు అని మొదలు పెట్టాము. కొంచెం సేపుండి వచ్చేద్దామనుకోవటమూ ఎవరికీ గుర్తు రాలేదు.

నేనింకా ముచ్చట్లు పెట్టుకు కూర్చుంటే కె.బి. లక్ష్మి నా చెయ్యి పట్టుకుని లాక్కొచ్చేసింది. తనకి వేరే ప్రోగ్రాం వుందని ముందునుంచీ చెబుతూనే వున్నది మరి. అలా జరిగిన మా సాహితీ మిత్రుల సమావేశం అందరికీ పండగకన్నా ఎక్కువ ఆనందాన్ని పంచిన పండగ అయింది.

.... పి.యస్.యమ్ - లక్ష్మి