మహిళా మేలుకో
నువ్వు పుట్టకముందే నీ ఆనవాళ్ళను
యంత్రంతో తడిమి భ్రూణ హత్యకు
ఉరుకులాడుతుంటారు
చచ్చీచెడీ భూమ్మీద పడ్డాక
అస్తిత్వాన్ని అర్పేయాలని ఆరాట పడతారు
సీతాకోక చిలుకలా ఎగురుతున్నపుడు వందల చూపులతో
నీ దేహాన్ని తూట్లు పొడుస్తారు
పసితనం నుంచే పోరాటం మొదలు
వివక్షత నదిలో ఈదుతూనే హక్కుల కోసం గర్జించావు అని
మెళ్ళో గంట కట్టి పిల్లిలా ఊరేగిస్తారు
ఆకాశంలో సగమంటూ అరచేతిలో
వైకుంఠం చూపి
వంట గదిలో బందీని చేస్తారు
నడి రాత్రి కాదు పట్టపగలే
తెగబడ్డ మగమృగాల క్రీడల్లో
బలి కాబడుతున్న లేడిని చేస్తారు
అంతరిక్షంలో దూసుకు పోతున్నా
అభివృద్ధితో అందలం ఎక్కిస్తున్నా
ప్రపంచాన్నే నడపగల శక్తి ఉండి కూడా
అణిగి మణిగి ఉండాలని
అణిచి వెయ్యాలని చూస్తున్నారు
ఈ దాస్య విముక్తికై
అలుపెరగని పోరాటానికి సిద్ధం కావాలి
పితృస్వామ్యపు భావజాలానికి
చరమ గీతం పాడాలి
మహిళా... రేపటి శతాబ్దానికి
నీవే అడుగులు వెయ్యాలి
ప్రతి దినం మహిళా దినోత్సవమే అవ్వాలి
-పుష్యమి సాగర్ ksr.sweet@gmail.com
