ఆశావాది! - శారదా అశోకవర్ధన్
ఆశావాది!
- శారదా అశోకవర్ధన్
పిచ్చి కెరటం పరుగెడుతుంది
కొండలకు ఢీకొట్టుకుంటూ
ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా
లెక్కజెయ్యక ప్రయాణం ఆపుకోక
ఒడ్డు చేరుకోవాలన్న ఆశ తప్ప
అలుపుతెలీని కష్టజీవి కెరటం
వెన్నెలకు చూస్తూ వెర్రెత్తినట్టు
మరీ పరుగెడుతుంది వేగాన్ని పెంచుతూ కెరటం
ఆనందంతో నురగలు కక్కుతూ!
చీకటి రాత్రిలో నిశిని చూసి
ఉన్మాదినిలా ఉరకలు వేస్తుంది కెరటం
కడలి గుండెను చీల్చుకుంటూ
పరుగులు తీస్తుంది ఆవేశంతో
జీవితంలో దగాపడ్డ ఆడదానిలా!
ఏమైనా సరే ఆపదు దాని ప్రయాణం
సాగుతూనే వుంటుంది అహర్నిశం
ఆశావాదానికి ప్రతీక సముద్ర కెరటం!



