Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? రొకెయ్యా బేగం

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? రొకెయ్యా బేగం - బెంగాలి

 

 

రచయిత్రి,, సంఘ సంస్కర్త రొకెయ్యా బేగం ఒక చిన్న గ్రామం రంగ్పూర్ అనే జిల్లా బెంగాల్లో ఒక జమిందారీ కుటుంబంలో పుట్టింది. సహజంగానే ఆ ఇంట, చాలా కఠిన నియమాలు స్త్రీలకి ఉండేవి. పర్దా మగవాళ్ళనుంచే కాదు, బయటి ఆడవారిముందు కూడా. తల్లికీ బిడ్డకీ మధ్యన కూడా పర్దా ఎంత అంటే నాకు నా తల్లి గురించి ఏమీ గుర్తు లేదు పర్దా తప్ప అని రొకెయ్యా అనేంతవరకూ. ఆ ఇంట ఆడవాళ్ళు చదువుకోవడం నిషేధం. కానీ రొకెయ్యాకి ఆమె అక్కకీ చదువు మీద ఎంతో ఆసక్తి. బంగాలీ నేర్చుకోవడం ఇష్టం లేదు ఆమె తండ్రికి. కానీ మగపిల్లలు లోకల్గా మంచి పదవుల్లో ఉండాలంటే బంగాలి రావడం తప్పనిసరి కాబట్టి తండ్రి వారికి బంగాలీ నేర్పిస్తాడు. రొకెయ్యా అన్నగారు కొంచం అభ్యుదయ భావాలు కలిగి ఉండటం అక్కచెల్లెళ్ళిద్దరికీ ఉపకరిస్తుంది. ఇంట్లో అందరూ ముఖ్యంగా తండ్రి నిద్రపోయేవరకూ ఆగి అప్పుడు ఇద్దరికి బెంగాలి ఇంకా ఇంగ్లీష్ నేర్పేవాడట. వీరిద్దరి చురుకుదనం అతనికెంతో నచ్చుతుంది. ఒకసారి రొకెయ్యా అక్క బెంగాలి స్టోరీ బుక్ చదువుతూ తండ్రికి పట్టుబడిపోతుంది. తండ్రి కోప్పడతాడన్న భయంతో మూర్ఛ పోతుంది. ఆమె అంత భయపడటం చూసి తండ్రి కూడా వీరిద్దరిను చదువుకోనిస్తాడు. తండ్రికి అరబిక్, పెర్షియన్, పుష్తున్, ఉర్దూ, ఇంగ్లీష్, హింది, బెంగాలి భాషల్లో ప్రవేశం ఉంటుంది. అదే పిల్లలకూ వస్తుంది.

రొకెయ్యా భర్త ఆమె కన్న చాలా పెద్దవాడు. పదహారేళ్ళ వయసులో ఉన్న రొకెయ్యాకు ముప్పైలు పైబడిన రెండోపెళ్ళివాడిని కేవలం ఆమె అన్నగారికి అతను బాగా నచ్చడం వల్ల ఇచ్చి పెళ్ళి చేసారు. అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే, అతనికి చాలా విశాల హృదయం అభ్యుదయ భావాలు కలవాడు. రొకెయ్యాను రాయడానికీ, చదువుకోవడానికి ప్రోత్సహించి ఆమె తోటి ముస్లిం ఆడపిల్లలకు కూడా చదువు చెప్పాలని ప్రోత్సహించి అందుకు కావాల్సిన డబ్బు కూడా కూడబెట్టి ఇస్తాడు. సమాజంలో మార్పు రావాలంటే ఆడవాళ్ళు చదువుకోవడం చాలా ముఖ్యమని అతను భావిస్తాడు. అతని ప్రోత్సాహంతోటే ఆమె తన 21వ ఏడు నించి రాయటం మొదలుపెడుతుంది. సమాజంలో మార్పు రావాలంటే ఆడవాళ్ళు చదువుకోవడం చాలా ముఖ్యమని అతను భావిస్తాడు. అతని ప్రోత్సాహంతోటే ఆమె తన 21 వ ఏడు నించి రాయటం మొదలుపెడుతుంది. అప్పటి స్త్రీల సమస్యలూ, సామాజ వాతావరణం గురించి ఆమె రాసిన వ్యాసాలు The Indian Ladies Magazine లో అచ్చవుతాయి.. ఆమె రాసిన వ్యాసాలు "The Female Half”, “The Veil”, “The Ideal Housewife” అన్నింటిలోనూ ఆమె ఆడవారిని పరదా వెనక ఇంట్లో కూడా దాచి, వారిని విద్యకి దూరం చెయ్యడాన్ని నిరసిస్తుంది. ఒక గృహిణిగా వారి పాత్రను ప్రశ్నిస్తుంది. వారికి విద్య ఉంటే అది వారిని భార్యగా, అమ్మగా వారి పాత్రల్లో ఎలా ఉన్నతంగా మారుస్తుందో రాస్తుంది.

రొకెయ్యా వ్యక్తిగత జీవితంలో చాలా దుఖం ఉంది కాని దాన్ని ఆమె, ఆమె భర్త ఆశయమైన విద్య ద్వారా స్త్రీల జీవితాలు మెరుగుపరచడం, వారి కొక గుర్తింపు, గౌరవం తీసుకురావడమనే దానికి అడ్డు రానియ్యలేదు. ఆమెకు పాతికేళ్ళ వయసులో భర్త చనిపోయాడు. ఇద్దరు ఆడపైల్లలు కూడా చంటిపిల్లలుగానే చనిపోయారు.

భర్త పోయిన 5 నెలల్లోనే ఆమె అతని గుర్తుగా షెఖావత్ గల్స్ హై స్కూల్ బీహార్లో భాగల్పూర్లో 5 గురు స్టూడెంట్స్తో మొదలుపెడుతుంది పదివేల రూపాయల పెట్టుబడితో. కానీ ఆమె స్కూల్ పెట్టిన ప్రాపర్టీ మీద భర్త తరపు బంధువులు వివాదం రేపడంతో ఆ స్కూల్ మూతబడి ఆమె కొల్కట్టాలో మళ్ళి 1911 లో స్కూల్ మొదలు పెడుతుంది 8 మంది విద్యార్ధులతో. నాల్గేళ్ళలో ఆ సంఖ్య మెల్లిగా 84 కి చేరుతుంది. స్కూల్లో మొదట, ఉర్దూ రాయటం, చదవటం, మొక్కల పెంపకం, కుట్టుపని, వ్యాయామం, ముస్లిం సంస్కృతి పద్ధతులూ నేర్పుతుంది. తరవాత బంగాలి, ఇంగ్లీష్ కూడా నేర్పుతుంది. మిగిలిన స్కూల్స్లో బోధనా పద్ధతులూ ఏయే విషయాల్లో శిక్షణ ఇస్తున్నారన్న విషయాలు ఆమె స్వయంగా అన్ని స్కూల్స్కి వెళ్ళి తెలుసుకుని మరీ తన స్కూల్లో అమలు పరిచేదట. పరదాకి తను వ్యతిరేకమయినా, పరదా వేసుకునే వారిని ఆమె ఎన్నడూ కాదనలేదు. ఇందువల్ల ఉన్నత ముస్లింస్ కుటుంబాలు తమ ఆడపిల్లలను ఈ స్కూల్కి పంపడానికి అభ్యంతరపెట్టలేదు. వారిని పరదాలో ఇంటినుండి స్కూల్కి మళ్ళా ఇంటికి దింపడానికి ఆమె గుర్రపు బళ్ళు ఏర్పాటు చేసిందట. పిల్లలను స్కూల్లో చేర్చమని ఇంటింటికీ వెళ్ళి ప్రాధేయపడేదట. అప్పట్లో ఆడపిల్లలకి కొరాన్ మాత్రం నేర్పేవారు అది కూడా ఎటువంటి తాత్పర్యం లేకుండా, ఒక ఆడవాళ్ళు ప్రవర్తించాల్సిన పద్ధతుల మీద తప్పించి.

పరదాను వ్యతిరేకించినందుకు ఆమె చాలా విమర్శను ఎదుర్కొంది. కాని చిత్రం ఏమిటంటే ఆమె కూడా పబ్లిక్ ప్లేసెస్ లో బురఖాలోనే ఉండేదట. తన స్కూల్లోనూ స్నేహితులూ బంధువుల వద్ద మాత్రం బురఖా వేస్కునేది కాదట. మనుషులందరూ ఏదో ఒకరకమైన ముసుగులు వేస్కుంటేనే ఉంటాము వేరే వేరే సందర్భాలలో, వేరే వేరే మనుషుల వద్ద. అయితే అది కంపల్సరీ కాదు. మనిష్టం. ఏ ముసుగూ లేకుండా కూడా ఉండచ్చు. కానీ ఇలా ఎల్లప్పుడూ ముసుగులో ఉండాలంటే, ఇంట్లో బయటా ఏదో తప్పు చేస్తున్నట్టు, ఒక శరీరం కలిగి ఉండటమే పాపమయినట్లు, ఎంత కష్టం. ముస్లింస్లో ఇంత తక్కువమంది మాత్రమే దీన్ని వ్యతిరేకించడం కూడా కొంచం ఆశ్చర్యమే.

విద్య ఒక్కటే సరిపోదనీ ఆర్ధిక స్వావలంబన కూడా అవసరమని గుర్తించిన ఆమె ఆడవారికి ఇంటినుంచే చేసుకునే కొన్ని చేతిపనుల్లో శిక్షణ ఇచ్చింది. ఎన్నో ఎన్ జీ ఓస్ స్థాపనను కూడా ఆమె ప్రోత్సహించింది. ఎన్నో స్త్రీల హక్కులు, సమస్యలమీద పోరాడే, పనిచేసే సంస్థలకి ఆమె నేతృత్వం వహించింది. ఆమె 22 ఏళ్ళ పాటు నడిపిన స్కూల్ని తరవాత గవర్నమెంట్ చేపట్టింది.

రొకెయ్యా గౌరవార్ధం చాలానే జ్ఞాపక చిహ్నాలున్నాయి.
ఢాకా వుమెన్స్ యూనివర్సిటీ హాల్ ని రొకెయ్యా హాల్గా పేరు మార్చి పెట్టారు.
ధాకా పార్లమెంట్ దగ్గర ముఖ్య రహదారికి ఆమె పేరు పెట్టారు.
స్త్రీజనోద్ధరణకి పాటుబడిన స్త్రీల సేవలకి గుర్తింపుగా రొకెయ్య పదక్ ఎవార్డు ప్రభుత్వం ప్రకటించింది.
రంగ్పూర్ లోని కాలేజీకి 1963 బేగం రొకెయ్య కాలేజ్ అని పేరు పెట్టారు.
అక్కడ ఒక యూనివర్సిటీకి బేగుం రొకెయ్యా యూనివర్సిటీ అని పిలుస్తారు.
The Department of Women and Gender Studies, Dhaka University బేగం రొకెయ్య లెక్చర్స్ ప్రతి డిసెంబర్ 9 వ తారీకునా ఏర్పాటు చేస్తారు. ఆ రోజును రొకెయ్యా దివస్ గా జరుపుతారు. 1994 నుంచి Bangladesh ప్రభుత్వం కూడా రొకెయ్యా దివస్ గా 9th డిసెంబర్ను జరుపుతోంది.

ఇక ఆమె రచనల సంగతి చూద్దాం. పరదా మీద ఆమె రాసిన వ్యాసాలు ఎన్నో ఇంగ్లీష్లోకి అనువదించబడ్డాయి.
ఆడవారి ఆలోచనా పరిధిని విస్తరించే దిశగా ఆమె ఎన్నో వ్యాసాలు, కధలూ నవాలలూ బెంగాలిలో రాసింది. ఆమె రాతల్లో హాస్యం, విమర్శ, వ్యంగ్యం ఉండి, చదువరులను ఆలోచింపచేసేవిధంగా ఉండేవట. ఇస్లాం అర్ధాలని వక్రీకరించి ఆడవారిని అణగదొక్కడానికి వాడుకునేకన్నా వారి సామర్ధ్యాన్ని పూర్తిగా వాడుకోగల్గే సుహృద్భావ వాతావరణం సమాజంలో సృష్టించడమే అల్లా సందేశాన్ని అమలు చేయడం అంటుంది. శ్రమ విభజన లింగ భేదం మీద ఆధారపడి ఉండకూడదని ఆమె వాదించింది. ఆడవారు లింగ వివక్షని బయట ప్రపంచంలో తిప్పి కొట్టాలంటే, వారు చేసె వృత్తిని వారు సమర్ధవంతంగా నిర్వహించగలిగేట్లు ఎదగడానికి కృషి చేయడమే మార్గం అంటుంది. అది మాత్రమే వారికి బయట గౌరవం, గుర్తింపు ఇస్తాయని అంటుంది. మతం పేరిట ఆడవారికి విద్య లేకుండా చెయ్యటం అన్యాయమని వాదిస్తుంది.

ఆమె రాసిన నవలల ఇతర రచనల లిస్ట్ ఇది.

    Pipasha ("Thirst", 1902).
    Motichur (essays, 1st vol 1904, 2nd Vol. 1922). The second volume of Matichur includes stories and fairy tales such as Saurajagat (The Solar System), Delicia Hatya (translation of the Murder of Delicia, by Mary Corelli), Jvan-phal (The Fruit of Knowledge), Nari-Sristi (Creation of Women), Nurse Nelly, Mukti-phal (The Fruit of Emancipation), etc.
    Sultana's Dream, (satire, 1908) a notable early work of feminist science fiction involving a utopian male/female role-reversal. It is a satirical piece, a feminist utopia, set in a place called Lady Land, a world ruled by women. Later translated as Sultanar Swopno.[4]
    Saogat (1918, poetry). Her poem titled ‘Saogat’ was published on the first page of the first issue of the Saogat in Agrahayan.
    Padmarag ("Essence of the Lotus", novel, 1924). A feminist utopia.
    Oborodhbashini ("The Secluded Women", 1931)
    Boligarto (short story).
    Narir Adhikar ("The Rights of Women"), an unfinished essay for the Islamic Women's Association
    God Gives, Man Robs, 1927, republished in God gives, man robs and other writings, Dhaka, Narigrantha Prabartana, 2002
    Education Ideals for the Modern Indian Girl, 1931, republished in Rokeya Rachanabali, Abdul Quadir (editor), Dhaka, Bangla Academy, 2006


సుల్తానా'స్ డ్రీం లో ఇప్పుడున్న ప్రపంచం తిరగబడినట్టు ఒక ఊహా చిత్రం. లేడీస్ లేండ్ అనే కల్పిత ప్రపంచంలో ఆడవారే అధిపతులు, మగవారిమీద ఆధిపత్యం చెలాయిస్తూ, ఆడవారు చేసే పనులన్నీ మగవారు చేస్తున్నట్టుగా సాగే హాస్యభరిత వ్యంగ్య రచన. ఎంతో పాప్యులర్ అయిన రచన. ఆమె తన 52వ ఏట చనిపోయంది. మరొక రచయిత్రి పరిచయం వచ్చే వారం చేసుకుందాం

 

-Sharada Sivapurapu