Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సరస్వతి బాయి రాజ్వాడే

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?

సరస్వతి బాయి రాజ్వాడే

 

సరస్వతి బాయి ఉడిపి దగ్గర బాలాంజలా అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఈమె మొట్టమొదట కన్నడ రచయిత్రుల్లో ఒకరు. ఈమె మూకీ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పటి వాళ్ళకు ఈమె తెలియక పోయినా, ఈమెను చాలా గౌరవంతో గుర్తుచేసుకుంటారట ఆమె తరం వాళ్ళు. ఈమె గిరిబాలె అనే కలం పేరుతో రచనలు చేసింది. ఉడిపిలో జరిగిన ఒక సాహిత్య సమ్మేళనంకి ఆమె అధ్యక్షత వహిస్తే జ్ఞానపీఠ్ గ్రహీత కోట శివరామ కరంత్ వోట్ అఫ్ థాంక్స్ చెప్పారట. ఆమె కున్న గుర్తింపు అటువంటిది.


ఆమె పదవ తరగతి ఆమె 25వ ఏట పాస్ అయ్యింది, అదీ ఆమె రచనలు అచ్చవ్వటం మొదలియిన పదేళ్ళకు. మహారాష్ట్రా నుండి ఉడిపి వచ్చి స్థిరపడింది ఆమె కుటుంబం. ఇక్కడ ఆమె రెండేళ్ళు స్కూల్ కెళ్ళింది. ఈ రెండేళ్ళలో ఆమె ఎంత కన్నడ నేర్చుకుందంటే, అది ఆమె రచనన్లు చెయ్యగలిగేంత. పేదరికం కారణంగా 15 ఏళ్ళ సరస్వతిని 51 ఏళ్ళ వ్యక్తికిచ్చి పెళ్ళి చేసారు. పేద కుటుంబంలో పుట్టినా డబ్బున్న వ్యక్తితో వివాహం జరగటంవల్ల ఆమె రెండూ అనుభవించింది. అత్తవారింట జీవితం చాలా కష్టంగా ఉండేదట. కఠినమైన నియమ నిబంధనలు. కొన్నేళ్ళకే భర్త చనిపోయాడు. జీవితం ఇంకా నరక ప్రాయమైపోయింది. ఈరకమైన జీవితానుభవాలే ఆమె రచనల్లో, వాదననీ, తిరుగుబాటు ధోరణినీ, ఆడవారి సమస్యల గురించి ఆలోచించి, ఆకాలంలో వివాదాస్పద మైన సమాధా నాల్ని వెతికేట్టుగా చేసాయి ఆమెను.

ఆమె ఒక 70 కధలు, వ్యాసాలు, కవితలూ, విమర్సలూ రాసింది. అంతే కాకుండా, మరాఠీ,హిందీ, తమిల్ నుంచి కన్నడకి అనువాద రచనలు కూడా చేసింది. పేరుపొందిన కధల్లో, బాదవర కన్నిర కతె, కులవధు, కాలి అనేవి. సుప్రభాత అనే పత్రికకు ఎడిటర్ గా పనిచేసింది కొన్నాళ్ళు. అందులో ఆడవారిని కధలు రాయడానికి ప్రోత్సహిస్తుంది. కథావళి, నిసర్గ అనే పత్రికల్లో రెగ్యులర్ కాలమిస్ట్ గా పని చేసింది. ఆమె కధలు ఎంతో వైవిధ్యంతో కూడుకున్నవి. మగవారు చేసే మోసాల్ని వాటిని ఎదుర్కొన్న స్త్రీ పాత్రలు చేసే తిరుగుబాటుని చిత్రించే ప్రయత్నం ఎంత సాహసవంతంగా ఉంటుందో ఈ కధలో తెలుస్తుంది. ఒక కపట సన్యాసి తన కామ తృష్ణ తీర్చుకోవడం కోసం రహస్యంగా అతని భక్తుల్లో ఒకామెను పెళ్ళిచేసుకుంటాడు. ఈ స్త్రీ పాత్ర పేరు సీత. సీత తను ఒక్కతే ఈ సన్యాసి భార్య అనుకొని చాలా గుంభనంగా బయటి ప్రపంచానికి తెలియకుండా అతనితో సంసారం చేస్తుంటుంది. కాని ఒకరోజు ఆమెకు అతని మీద అనుమానం వచ్చి చూస్తే అతనికి తన లాగే ఇంకో ఐదారుగురు భార్యలున్నట్లు తెలియడం, పైగా వాళ్ళు కూడా తామొక్కరే సన్యాసి భార్యనన్న భ్రమలో ఉండటం తెలుస్తుంది. అతన్ని రెడ్ హేండెడ్ గా పట్టుకుని నిలదీస్తే, నీకు సమాధానం చెప్పే అవసరం నాకు లేదు, నీకు నన్నడిగే హక్కు లేదని తృణీకరిస్తాడు. దాంతో మోసపోయామని తెలిసిన ఆమె ప్రతీకారం తీర్చుకోవడం కోసం అతన్ని చంపేస్తుంది. అయితే ఈ కధ అక్కడ ఆగదు. పొలీస్ విచారణ, ఆ సన్యాసి నడిపే ఆశ్రమానికి వారసుడిని వెతకటం, అతని శిష్యులంతా ఈమెను పిచ్చిదని సాక్ష్యం ఇవ్వడం ఇలా నడుస్తుంది. నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారని నీకు బాధగా ఉంటే, నాకెంత బాధగా ఉండాలి, నా గుండె కూడా ముక్కలయ్యింది అంటూ ఆమె చివరికి తనను తాను కత్తితో పొడుచుకుని చనిపోతుంది. ఎలాగైనా చావు తప్పని పరిస్తితుల్లో, బ్రతికినా అది చావు కంటే హీనమైనదైనపుడు, చనిపోయేముందు ప్రతీకారం తీర్చుకోవడం అనేది అలాటి మగవారికి ఒక భయంకరమైన గుణపాఠం. చివరికి విచారణలో ఇంకా ఎనిమిది మంది సీత లాంటి వారే ఆశ్రమంలో ఉన్నారని తేలుతుంది. ప్రతీకారం తీర్చుకోవడంతో కధ ముగించకుండా, తిరుగుబాటు చేస్తే మొత్తం సమాజం మగవాడి పక్షం ఎలా తీసుకుంటుందో, ఆడవారికి రక్షణ కాదు కదా సానుభూతి కూడా ఎలా ఉండదో చూపిస్తుంది.

ఆమె రాసిన కాలంస్ లో ఆమె రాయని విషయమoటూ లేదట. స్త్రీ విద్య, వరకట్నం, విధవ స్త్రీల పరిస్తితులు , జుట్టు తియ్యడం గురించి, ఆరోగ్యం, అందానికి చిట్కాలు ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే. మఠాధిపతులని విమర్శించడానికి కూడా ఆమె వెనుకాడలేదు. అయితే ఒక విషయంలో ఆమెను అంతా విమర్శించారట. అదేంటంటే ఆడవారి నగ్న చిత్రాలు వేసే ఒక పత్రికకి ఆమె రాసినందుకు. అయితే ఆమె ఆ విమర్శని కూడా ధైర్యంగా ఎదుర్కొంది. ప్రకృతి ఇచ్చిన శరీరం గురించి సిగ్గుపడటానికేముందని ప్రశ్నించిందట. అయితే రచయితలకే ఆమెను, ఆమె పూర్తి వ్యక్తిత్వాన్నీ అర్ధం చేసుకోవడం కొంచం కష్టమయ్యింది. ఆమె వ్యక్తిత్వ వికాసం భిన్న దిశల్లో జరిగింది. సాహిత్యం, జర్నలిజం , సమాజ సేవ, యువతకి మార్గ నిర్దేశం ఇలా.

నిజానికి 19వ శతాబ్దం ఆరంభంలో స్త్రీలు పేరు ప్రతిష్టల కోసమో, డబ్బు కోసమో రాయలేదు. తమ జీవితాల్లో ఉన్న దుఖం, అంతంలేని చాకిరీ, అణిచివేతల నుంచి, పురుషాధిపత్యమ్నుంచి స్వేఛ్చ కోరుతూ, తమను తాము రక్షించుకోవడం కోసం చేసిన భావ ప్రకటన ఇలా ఎన్నో రకాలుగా బయటపడింది. తమ జీవితాల్లో ఉన్న ప్రేమ రాహిత్యం, లేని ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం, అర్ధం లేకుండా సాగే తమ జీవితాలకొక సార్ధకతనివ్వడం కోసం, వ్యధాభరిత జీవితాన్నుంచి పారిపోయేందుకు చేసిన ఒక ప్రయత్నమే రచన. అది రోజులో కొంచం సేపయనా సరే. చాలా మంది రచయిత్రులు తమ జీవితాల్లో లేని దాని గురించి రాయ లేదు. ఉన్నదాని గురించే రాసారు. తమ జీవితాల్లో ఉన్నదే అందరు స్త్రీల జీవితాల్లో కనపడితే బాధతో రాసారు. 

 

-Sharada Sivapurapu