Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? గీతా సానే


మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? గీతా సానే - మరాఠీ

గీతా సానే ఆమ్రవతి జిల్లా, మహారాష్ట్రలో పుట్టింది. తల్లితండ్రులిద్దరూ అభ్యుదయ భావాలున్నవారే. అందువల్ల చదువుకి ఏ ఆటంకమూ లేదు. తండ్రి స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆరోజుల్లో ఆమే మొట్టమొదటి సైన్స్ పట్టభద్రురాలు. తల్లితండ్రులెంత అభ్యుదయ భావాలున్నవారంటే ఆరోజుల్లో వారు ఇద్దరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎంతో నిరాడంబరంగా చేసారట. వారి వివాహాలకి ఒక రూపాయి కూడా ఖర్చయుండదని ఆమె తరవాత చెప్తుంది ఒకసారి. కాలేజీ రోజుల్లోనే ఆమె మార్క్సిస్మ్ పట్ల ఆకర్షితురాలైంది. ఆమె కాలేజీలో ఒక ముస్లిం యువకుడు, హిందు యువతి ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవడం పెద్ద దుమారం లేపుతుంది. ఆఖరుకి పత్రికలు కూడా ఈ వివాహాన్ని ఖండిస్తాయి. ఆ దుమారానికి వ్యతిరేకంగా, ఆ మతాంతర వివాహాన్ని సమర్ధిస్తూ ఆమె ఆ పత్రిక ఎడిటర్ కి ఒక ఉత్తరం రాస్తుంది. అదే ఆమె మొదటి రచన.

ఒక స్త్రీవాదిగా ఆమె మాతృస్వామ్యాన్ని సమర్ధించింది. పెళ్ళయ్యాక పేరు మార్చుకోవడాన్ని, బొట్టూ, నుదుటి మీద సింధూరం పెట్టుకోవడాన్ని, తాళి బొట్టూ, నల్లపూసలు వేస్కోవడాన్ని కూడా పురుషాధిక్యతకి తలవంచడమే అంటుంది. ఆమె భర్త నరసిమ్హ ధగంవర్ కూడా స్వాతంత్రోద్యంలో పాల్గొంటూ, జైలు శిక్ష అనుభవించాడు

ఆమె ఏడు నవలలు రాసింది. అన్నీ కూడా స్త్రీవాద రచనలే. ఆమె రచనలు చాలా వైవిధ్యంతో, అప్పటి రాజకీయ వాతావరణంతో స్త్రీల సమస్యలను, వారి జీవితాలనూ ముడిపెడుతూ రాసిన అద్భుత రచనలైనా, ఈమెకు అంతగా పేరు రాలేదు.

ఆమె ఉద్దేశ్యంలో వ్యక్తిత్వ వికాసం, జీవన సాఫల్యం, జీవిత పరమార్ధ సాధన ఇవన్నీ ఆడవారి జీవితాలకి ఆమడ దూరంలో ఉండిపోయిన విషయాలు. ఆడవారికి పంతొమ్మిదో శతాబ్దం మొదాల్లోనే కాదు ఈ ఇరవయ్యో శతాబ్దపు మొదల్లో కూడా వారి సమయాన్ని వారి అభిరుచుల కోసం వెచ్చించాలంటే అంత తేలిగ్గా కుదర లేదు, ఇప్పుడు కూడా కుదరట్లేదు. అలా చేయాలనుకున్న పక్షంలో ఆమె వివాహానికీ కుటుంబానికీ దూరంగా ఉండాల్సిందే. నిజానికి స్త్రీకి ఏడవటానికీ, చావటానికీ ఉన్న స్వేఛ్చ తనకిష్టమైనట్టు బ్రతకటానికి లేదు. ఇష్టం లేని పెళ్ళి, పెళ్ళాం అంటే తన కోరికను తీర్చుకునేందుకు, ఆమె ఇష్టాఇష్టాలతో పనిలేకుండా వాడుకునే వస్తువే తప్పించి, మనసున్న మనిషిగా చూడలేని మొరటు భర్త. గర్భం వస్తే, మాతృత్వం కూడా తనమీద రుద్దబడిందనే భావన తప్ప, పుట్టబోయే బిడ్డ మీద కూడా ఎటువంటి ఇష్టం కలగని ఒక స్త్రీ పాత్ర. చివరికి ఆ పుట్టిన బిడ్డ చనిపోయి డిప్రెస్ అయినపుడు, ఆమె కోరుకునే సానుభూతి ఆమెకు కానుపు చేసిన నర్స్ ద్వారా పొందుతుంది. ఆ పరిస్తితిలో ఆమె ఒక నిర్ణయం తీసుకొని తన భర్తకు ఇంకో భార్యని తనే వెదికి వేరే వెళ్ళి చదువుకుంటుంది. పట్టుదలతో మాస్టర్ డిగ్రీ చేసాకా ఆమెకు అసలు షాక్ తగులుతుంది. భర్త నుంచి విడిపోయిన ఆడది బరితెగించిన ఆడది కాబట్టి, ఆమెకి ఉద్యోగం దొరకదు ఎంత ప్రయత్నించినా. ఆ నిరాశతోటి ఆమె పిచ్చిదయి చివరికి చనిపోతుంది. ఈ ముగింపు నిరాశాజనకంగా ఉన్నా అప్పటి సమాజ వాస్తవికతకు అద్దం పడుతుంది.

Mist and Due Drops (1942) అనే నవలలో స్త్రీలకి సంబంధించిన ప్రశ్నలు, అప్పటి రాజకీయ వాతావరణానికి సంబంధించిన ప్రశ్నలు ఎలా ముడిపడి ఉన్నాయో చెప్తుంది. ఈ నవల 1942 లో అంటే కాంగ్రెస్ నేతృత్వంలో జరుగుతున్న పోరాటాలు జోరుగా ఉన్నా, వివిధ సిద్ధాంతాలను అనుసరించి జరుగుతున్న పోరాటాల బలా బలాలను ఆమె విశ్లేషిస్తుంది, ముఖ్యంగా గాంధీ గారి అహింసావాదం, కమ్యూనిజం . ఈ నవలలోని ముఖ్యపాత్ర తన కాలేజీ రోజుల్లో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడాలని అనుకుంటుంది. కాని అతను ఆమెను సమాజ సేవ చెయ్యడానికి ప్రోత్సహిస్తాడు. ఆ ప్రేరణతో ఆమె ఒక కేర్ సెంటర్ మొదలు పెడుతుంది. ఆ క్రమంలో ఆమె ఒక మార్క్సిస్ట్ భావాలున్న డాక్టర్తో స్నేహం చేస్తుంది. అతని ద్వారా కేవలం దానాలు ఔదార్యం చూపటం వల్లనే సమాజాన్ని ఉద్ధరించలేమని దానికి ఒక శాస్త్రీయమైన పరిష్కారం కమ్మ్యూనిజం ద్వారా చూపచ్చని నమ్ముతుంది. ఆ సమయంలో అక్కడ బీడీ కార్మికులు సమ్మె చేస్తారు. అయితే అహింసతో స్వాతంత్రం సాధిస్తామనే గాంధియన్ వాదులు ఆ సమ్మెని ఎంత హింసాత్మకంగా అణిచివేస్తారో చూసాకా ఆమెకు గాంధీగారి అహింసావాదం మీద అనుమానాలు కలుగుతాయి. ఒకరకంగా ఈ నవల అప్పటి సామాజిక రాజకీయ అంశాలు స్త్రీల సమస్యలని ఎలా ప్రభావితం చేస్తున్నాయన్న విషయంపై నిశితంగా చేసిన ఒక పరిశీలన.

అసలు పేరు పొందిన రచయిత్రులంతా తమ రచనల్లో స్త్రీలు ఎదుర్కొనే వివక్ష, వారి జీవితాలు, బాధలు, స్త్రీల పట్ల సమాజం యొక్క నిర్లక్ష్యం, నిర్దయ తప్పించి వేరే అంశాలని ఎక్కువగా రాయలేకపోయారంటేనే అర్ధం చేసుకోవాలి ఈ అంశం యొక్క పరిధి, విస్తృతి దాని విశ్వరూపమూనూ. ఈ వివక్ష జీవితాన్ని ఇంతగా ఆక్రమించాకా, ఇంక ఏమైన ఎలా కనిపిస్తుంది, ఎందుకు కనిపించాలి, అందులోనూ స్త్రీలకి ? అందుకని ఎంతమంది రచయిత్రుల గురించి రాసినా ఒకేలాగా ఉన్నాయని మీరనుకుంటే, చదవడానికి విసుగుగా అనిపిస్తే అది రచయిత్రుల తప్పు, నా తప్పూ మాత్రం కాదు. పురుషస్వామ్య, పురుషాధిక్య సమాజం ఇంతలా వేళ్ళూనుకునేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల ఏళ్ళుగా తోడ్పడిన, తోడ్పడుతున్న అందరిదీ తప్పు.

Under the grass in a green lawn అనే నవలలో ఒక సంభాషణ ఇలా జరుగుతుంది.
"స్వేఛ్చ అనే దాంతో నాకెప్పుడూ పరిచయం లేదు. ఇంట్లో ఎవరికీ ఒక ఆడపిల్ల గురించి పట్టదు, ఇంట్లోని ఆవు గురించి పట్టినంతగా. అదైనా దాని బోజనం దాని హక్కులా అడుగుతుంది. ఒక ఆవుని చంపితే ఇప్పటికీ గొడవలే జరిగిపోతాయి. మరి అమ్మాయి? అమ్మాయికేమైనా అయితే అసలెవరైనా పట్టించుకుంటారా? బ్రహ్మని కూడా తన అందంతో వశం చేసుకున్న మాయలాడి ఆడదంటే . ఆడపిల్ల పుట్టి ఇంకా కళ్ళైనా తెరవక ముందే ఆ పిల్ల పెళ్ళెలా చేయాలా అని తల్లితండ్రుల బాధ పడటం మొదలు పెడతారు. ఆ పిల్ల ఎప్పుడు, ఎక్కడ ఎలా నవ్వకూడదో, నడవకూడదో, ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో అనే దాని మీద ఆ పిల్ల ఇంకా పెరగకుండానే పెద్ద పెద్ద గొడవలే అవుతుంటాయి ఇంట్లో. పుట్టిన ఇంట్లో బేవార్సుగా తినేసి, పెళ్ళయ్యాకా వేరే ఇంట్లో తన సేవలందిచ్చే అమ్మాయి ఆ ఇంటికి ఒక భారమే, పీడే ఉన్నంతవరకూ. పనికిరాని పశువుల్ల్లాగా పెరుగుతారు ఆడపిల్లలు.”

గీతా సానే కేవలం స్త్రీ సమస్యల మీదే రాయలేదు. అన్ని సామాజిక సమస్యల మీదా ఆమె వ్యాసాలు రాసింది. అసలు స్త్రీల సమస్యలు అప్పటి, సామాజిక, రాజకీయ పరిస్తితులతో ఎలా అల్లుకుని ఉన్నాయో ఎత్తి చూపడమే ఆమె రచనల్లోని ప్రత్యేకత. రచనలతో పాటుగా చురుకైన సామాజిక కార్యకర్తగా రాజకీయ చైతన్యం నిండి ఉండడం ఆమె ప్రత్యేకత.

 

-Sharada Sivapurapu