Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? లలితాంబికా అంతర్జనం

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? లలితాంబికా అంతర్జనం

 

 

లలితాంబికా అంతర్జనం కొల్లాం డిస్ట్రిక్ట్ కేరళలో పుట్టింది. చాలా ఛాందసవాద నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం. ఆమె రాసిన ఒకే ఒక నవల "అగ్నిసాక్షి" కేంద్రీయ సాహిత్య అకాడమీ ఎవార్డ్ కి ఎంపికయ్యింది 1977లో. అదే నవలని సినిమా కూడా తీసారు. ఆమె చేసిన ఇతర రచనలు 9 కధా సంకలనాలు, 6 కవితా సంకలనాలూ, ఒక ఆత్మ కధ. ఈ "అత్మకధాక్కొరు అనుఖం" అనే ఆత్మకధ చాలా చాలా ముఖ్యమైన రచనగా పరిగణిస్తారు. మహాత్మా గాంధీ వల్ల ఆమె చాలా ప్రభావితమైంది. స్వాతంత్రొద్యమంలో పాల్గొనాలని ఆమె కోరిక, కాని స్వాతంత్రోద్యమంలో కాకున్నా తరవాత తీరింది. ఆమె కాంగ్రెస్ పార్టీలో పనిచేసి తరవాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేసింది. ఆమె రచనలన్నీ అప్పటి సమాజంలోని ఆడవారి దైన్య స్తితికి సానుభూతి వ్యక్తం చేస్తూ, వారి పరిస్తితులను బాగు చెయ్యడానికి ప్రయత్నించినవే.

ఒక రచయిత్రిగానే కాకుండా తనున్న సమాజాన్ని సంస్కరించడానికి చేసిన ప్రయత్నం కొనియాడదగ్గది. ఎందుకంటే ఆమె పుట్టిన, పెరిగిన వాతావరణం ఆడవారిని నాలుగు గోడలమధ్య అత్యంత కఠినంగా బంధించింది. కనీసం బయటి ప్రపంచాన్ని ఇంట్లోని కిటికీ లోంచి తొంగి చూడటం కూడా శిక్షార్హమైన నేరం. ఆమె పుట్టినపుడున్న సమాజం గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.

నంబూద్రి కుటుంబాల్లో మొదటి మగపిల్లవాడు మాత్రమే వాళ్ళ కులంలో పెళ్ళి చేసుకోడానికి అర్హుడు. మిగతా మగపిల్లలు బయట కులాల్లో సంబంధాలు చేసుకోవాల్సిందే. అంటే బయట సంబంధాలు చేసుకున్న మగపిల్లల నుంచి వారి భార్యలకుగానీ వారి పిల్లలకు కానీ ఆస్తి సంక్రమించదు. అందువల్ల నంబూద్రి కుటుంబాల్లో ఆడపిల్లలు పెళ్ళి సంబంధాలు దొరకక అవివాహితులుగానే ఉండిపోయేవారట. ఇక వీరి పరిస్తితి ఎంత ఘోరమంటే, వీరు చాలా కఠిన పరదాల వెనక ఉండేవారు. బయటికి వెళ్ళకూడదు. బయటికి తొంగికూడా చూడకూడదు. ఆఖరికి వారిపై సూర్యరశ్మి కూడా సోకకుండా తమ శరీరాల్ని కాపాడుకుంటూ నాల్గు గోడల మధ్య ఇంటి చాకిరీలోనే వారి జీవితమంతా గడపాలి. ఒకవేళ బయటికి వెళ్ళక తప్పని పరిస్తితే వస్తే వళ్ళంతా కప్పుకుని ఆకులతో చేసిన గొడుగు ఒకటి వేస్కొని, పైగా ఆ గొడుగు వారిని తలపైనుంచి నడుము వరకూ కప్పేస్తే, వారు తమ పాదాలను మాత్రమే చూసుకుంటూ నడవాలి. అలా వెళ్ళాలి, అగ్ర కులస్తుల స్త్రీలు . ఇందుకు భిన్నంగా నిమ్న కులాల స్త్రీలు మాత్రం తమ నడుము పైభాగంలో ఎటువంటి బట్టలూ ధరించకూడదు అగ్రకులాల మగవారి ముందు. ఈ నియమం ఉల్లంఘిస్తే కఠిన శిక్షలే. ఎటువంటి అనుమానాస్పద పరిస్తితులలోనైనా పట్టుబడ్డ ఆడవారిని మగ వారు వారి కోర్ట్లో విచారించి, సంఘ బహిష్కరణ, వెలివేత లాంటి శిక్షలు వేస్తే వారు తిండికి కూడా దిక్కూ మొక్కూ లేక అలమటించి చావాల్సిందే. ఇందువల్ల స్త్రీలని బ్లౌసు ధరించే వరకూ సంస్కరించడానికి సంఘ సంస్కర్తలూ, క్రైస్తవ మిషనరీలూ చాలా కష్టపడ్డాయట 19వ శతాబ్దం మొదటి వరకూ. మొదటగా క్షత్రియులైన రాజ వంశీకులు తమ ఆడవారిని బ్లౌసు వేస్కునేందుకు అనుమతించారట.

లలితాంబికకు ఎటువంటి ప్రాధమిక విద్యా లేదు. ఆమె తనంతట తను కష్టపడి నేర్చుకున్నది రాయటం చదవటం. ఆరోజుల్లో అదే చాలా గొప్ప విషయం. పైగా ఇది బాహాటంగా చేసే పని కాదు. రహస్యంగా చెయ్యాలి. నంబూద్రీలు ధనిక భూస్వామ్య వర్గానికి చెందినవారే. కానీ ఆడవారిపట్ల ద్వంద్వ నీతి, దౌర్జన్యం, హింస, అణగదొక్కడమే చేసారు. బయటికి వెళ్ళి చదువుకోవడం ఆడవారికి నిషిద్ధం. కేవలం ఆమెకున్న ఆసక్తితో, బయట జరిగే విషయాల్ని ఇంట్లోని మగవారిని అడిగి తెలుసుకునేదట. 1926 లో ఆమెకు వివాహం అవుతుంది. పెళ్ళితో ఉన్న ఆ కాస్తమాత్రం స్వేఛ్చ కూడా పోతుంది. రోజంతా ఇంటి పని, వంటపనితోనే సరిపోతుంది. దీనికి తోడు, ఇంట్లోని ఆడవారిమధ్య సహజంగా ఉండే రాజకీయాలు, ఈర్ష్యాసూయలూ, అభద్రతా భావాలు. నాల్గు గోడల మధ్య, సూర్య రశ్మి కూడా సోకని చిత్తడి పెరళ్ళలోనే జీవితం. వంట పొయ్యి ఊది ఊది పొగలో పనిచేయడం వల్ల కళ్ళు కూడా దెబ్బ తింటాయి. తెల్లవారుఝాము నుంచి రాత్రి దాకా పని అయ్యాక, పిల్లల్ని నిద్రపుచ్చాకా, చిన్న గుడ్డి దీపం వెలుగులోనే ఆమె రాసేదట. కళ్ళు నీరుకారిపోతూ చూడలేకపోతే కళ్ళు మూసుకుని రాసేదట. సహజమైన ప్రోత్సాహకరమైన వాతావరణం లేకుండా, స్వంతంగా రాయటం చదవటం నేర్చుకుని తను చెప్పదల్చుకున్నది ప్రపంచానికి తన కవితల, కధల రూపంలో పెట్టి చెప్పడానికి ఇంత కష్టపడే పట్టుదల ఎంత మందికి ఉంటుంది? లలితాంబిక రచనల్లోని ముఖ్యాంశం కూడా స్త్రీల లైంగిక స్వేఛ్చే. ఈమె తరవాత అదేరకమైన సమాజంలో పుట్టిన కమలాదాస్ స్త్రీ లైంగిక స్వేఛ్చ గురించి అంత నిర్భీతిగా రాసిందంటే ఎంతో ఆశ్చర్యమే కలుగుతుంది.

ఇటువంటి సామాజిక నేపధ్యంలో స్త్రీల బ్రతుకుల్ని బాగుచెయ్యడానికి ఆమె నిశితంగా పరిశీలించిన, అనుభవించిన స్త్రీ జీవితాన్ని ప్రపంచం ముందుపెట్టి నిలదీసింది.

ఇక ఆమె నవల అగ్నిసాక్షి కొస్తే పెళ్ళయిన తర్వాత స్త్రీలని కట్టిపడేసే కట్టుబాట్లూ, ఆచారాలు, వారి భౌతిక ప్రపంచాన్నే కాక, వారి పుట్టింటి తరపు మానవ సంబంధాల్ని నిర్లక్ష్యం చెయ్యాల్సిన పరిస్తితి కల్పించడాన్నీ, వారి ఆధ్యాత్మిక తాత్విక అలోచనలకి పరిధుల్ని విధించే కట్టుబాట్లనీ వ్యతిరేకించే క్రమంలో ఒక భార్య భర్త మధ్య జరిగే సంఘర్షణని అద్భుతంగా చిత్రించింది. సినిమా తీయబడిన ఈ నవల ఎన్నో ఎవార్డులనీ, పురస్కారాలనీ అందుకుంది. దేవకీ, ఉన్నిలు పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకునే భార్యా భర్తలు. కానీ వీరిద్దరి ప్రేమకీ అడుగడుగునా కుటుంబంలోని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లూ, సంప్రదాయాలు, అడ్డొస్తూ ఉంటాయి. ఉన్ని దేవకి ఆశించే భర్తగా ఉండాలన్నా మిగిలిన కుటుంబ సభ్యులని వ్యతిరేకించలేక, అలా ఉండలేక పోతుంటాడు. అదే సమయంలో, బయట స్వాతంత్ర పోరాటం జోరుగా సాగుతుంటుంది. ఎన్నో రకాల మార్పులు వస్తుంటాయి. కానీ ఉన్ని కుటుంబం మాత్రం ఒక పెద్ద సంప్రదాయాల కోట గోడ కట్టుకుని లోపల ఎటువంటి మార్పులనూ రానివ్వకుండా జాగ్రత్త పడుతుంటుంది. ఈ వాతావరణంలో ఇమడలేక ఎంతో అభ్యుదయ భావాలున్న దేవకి నలిగిపోతుంటుంది. ఆమె తల్లి మంచం మీదుంటే కుటుంబం ఒప్పుకోకపోయినా చూడటానికి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈ తప్పుకి క్షమాపణ చెప్పే పక్షంలోనే తిరిగి రావచ్చంటారు ఉన్ని కుటుంబం వాళ్ళు. కానీ దానికి ఇష్టపడక ఆమె పుట్టింట్లోనే ఉండిపోతుంది. భార్య మీద ఎంత ప్రేమ ఉన్నా ఉన్ని ఆమెను తీసుకు రావటానికి వెళ్ళడు. అదే సమయంలో ఆమె పూర్తిగా స్వాతంత్రొద్యమంలోకి దిగిపోతుంది. ఆమె మరిది కూడా ఉద్యమంలో పాల్గొంటాడు కానీ, డబ్బు, పదవీ కాంక్షతో పెడదారులు పడతాడు. ఇవన్నీ దేవకిని ఉన్ని కుటుంబానికి ఇంకా దూరం చేస్తాయి. ఉన్ని సవతి చెల్లెలు దేవకితో చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటుంది. ఉన్ని ముసలివాడయి దేవాలయాల్లోనే తన సమయం గడుపుతుంటాడు. చివరికి అతను చనిపోయినపుడు, అతని అస్తికలు గంగలో కలపడానికి అతని చెల్లెలు హరిద్వార్ వెళుతుంది. అక్కడ ఆమె దేవకిని ఒక సన్యాసిని రూపంలో చూస్తుంది. మొత్తం కధ అంతా వీరిద్దరి మధ్య సంభాషణల్లో ఫ్లాష్ బ్యాక్లో నడుస్తుంది. ఈనవల ఆరోజుల్లో కేరళలో సంచలనమే సృష్టించిందట. స్త్రీలుగానీ, స్త్రీలు సృష్టించిన స్త్రీ పాత్రలు గానీ స్వేఛ్చని కోరుకుంటే సంచలనమే మరి.

 

-Sharada Sivapurapu