Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సావిత్రి బాయి ఫూలే మరాఠీ




మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సావిత్రి బాయి ఫూలే మరాఠీ

 

 

సావిత్రి బాయి ఫూలే 1831 లో ఖండాలా, సతారా జిల్లా, మహారాష్ట్రాలో పుట్టింది. 9 ఏళ్ళ సావిత్రీ బాయిని 12 ఏళ్ళ జ్యొతీ రావ్ ఫూలే కిచ్చి వివాహం చేస్తారు. చదువులేని సావిత్రికి భర్తే మొదటి గురువయి, మరాఠీ, ఇంగ్లీష్ నేర్పిస్తాడు. 1847 లో ఆమె అధ్యాపకురాలిగా శిక్షణ పొందుతుంది. పూనే లో భిడే వాడా అనే చోట మొట్టమొదటి బాలికల పాఠశాల ఆరంభిస్తారు భార్యాభర్తలిద్దరూ కలిసి. అందులో మొట్టమొదటి మహళా అధ్యాపకురాలిగా సావిత్రి పని చేస్తుంది. ఆమె ఇచ్చే శిక్షణ ఇప్పుడు మనం కోరుకునే విధంగా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేదిగా ఉంటుంది. దళిత వర్గాల ఆడపిల్లలూ, అగ్రకులాల ఆడపిల్లలూ మెల్లి మెల్లిగా అందరూ ఆమె దగ్గర చదువు కోవడానికి వస్తారు. కాని దళితులు అందునా స్త్రీలు చదువుకోవడం పాపం, అనర్ధదాయకం అనే మూఢనమ్మకం బాగా ప్రచారం చేసి వారి మనసుల్లో ఒకరకమైన భయాన్ని నింపిన మనువాద బ్రాహ్మణ కుతంత్రాలు ఆమెకు అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తూనే వచ్చాయి. ఆమె పాఠశాలకి వెళ్ళేటప్పుడు ఇంకొక చీర పట్టుకుని వెళ్ళేదట. ఎందుకంటే, ఆమె మీద పేడ, చెప్పులు, కోడిగుడ్లు లాంటివి విసిరి, తిట్లూ శాపనార్ధాలూ పెట్టేవారట. పాఠశాలకెళ్ళాకా చీర మార్చుకునేదట.

పిల్లలకి కేవలం పాఠాలే కాకుండా, వాళ్ళకి కధలు, అవి కూడా, వారి జీవితాలకి సంబంధించి అంటే ఆడవారి జీవితానికి సంబంధించినవి వారికి ఆసక్తి కలిగేట్లుగా చెప్పేదట. వెళ్ళిపోయేటప్పుడు మిఠాయిలు పంచేదట. ఎవరికైన ఒంట్లో బాగోలేక స్కూలికి రాకపోతే స్వయంగా వారింటికి వెళ్ళి, అనారోగ్యం కారణమైతే, వైద్య సహాయం అందేట్లు చూసేదట. అందుకే ఆమంటే గౌరవం ఆమె పాఠశాలలకి ఆదరణ లభించాయి బడుగు వర్గాల నుండి.

1849 లో ఆమె వయోజనులకు స్కూల్ ప్రారంభించింది. అక్కడా ఆమే మొదటి అధ్యాపకురాలు. ఆతరవాత అంటరానివారికోసం ఇంకో స్కూలు అలాగే అనేక ఇతర చోట్ల కూడా విద్యాలయాలు స్థాపించి చదువు నేర్పుతుంది. జ్యోతీ రావ్ ఫూలే స్థాపించిన సత్య శోధక్ సమాజ్ లో ఆమెదే చురుకైన పాత్ర. వీరిద్దరూ మహారాస్ట్రా నుంచి తరవాత తారాబాయి షిండే, పండిత రమాబాయి సరస్వతి, ఆనందీ బాయి జోషీ లాంటి ఎందరో సంస్కర్తలకి స్పూర్తి, ప్రేరణ అయ్యారు.

అప్పట్లో బాల్యవివాహాలవల్ల విధవలైన బాలికలు ఎక్కువగా ఉండేవారు. సహజంగానే వీరు, వారి బంధువర్గంలోని మగవారికి లైంగికంగా బలైపోయేవారు. గర్భనిరోధక పద్ధతులు లేకపోవటం వల్ల గర్భం తీయించుకునే అశాస్త్రీయ పద్ధతులవల్ల ప్రాణాలు పోగొట్టుకునే వారు, లేదా పుట్టిన బిడ్డల్ని చంపేసే వారు. ఇలాంటి వారి కోసం ఆమె ఒక శిశుహత్యా నిరోధ గృహమొకటి స్థాపించి అక్కడ ప్రసవించిన పిల్లల్ని అక్కడే వదిలి వెళ్ళే ఏర్పాటు చేసి వారి సమ్రక్షణ భారాన్ని తను తీసుకుంది. అటువంటి పిల్లల్లో ఒకరైన, ఒక బ్రాహ్మణ విధవకి పుట్టిన ఒక బాబుని తను పెంచుకుంది. అతనే తర్వాత వైద్యుడైన యశ్వంత్రావ్. ఇతనికి కులాంతర వివాహం చేస్తుంది. 1897 లో వచ్చిన భయంకరమైన ప్లేగు వ్యాధి బాధితులకి తన కొడుకు ఆసుపత్రి లోనే వైద్యం చేయిస్తుంది. ఒక వ్యాధిగ్రస్తుని సేవలోనే తను కూడా ప్లేగు వ్యాధి సోకి 1897 లో మరణిస్తుంది.

మహారాష్ట్రలో స్త్రీలకు ముఖ్యంగా అట్టడుగు వర్గాల స్త్రీలకు, అంటరానివారి జీవితాల్లో విద్యా జ్యోతి వెలిగించిన మొదటి మహిళా అధ్యాపకురాలు ఆమె. కానీ ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళు ఆమెకు ఎటువంటి గుర్తింపు, గౌరవాలూ దక్కలేదు. తరవాత కూడా ఆమెకు ఆమెకు రావల్సినంత గుర్తింపు రాలేదు. లింగ వివక్షకి, కుల వివక్షకీ వ్యతిరేంగా ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. మంచినీటి కోసం అగ్రవర్ణాల బావులవద్ద వారి అనుమతి కోసం పడిగాపులు పడుతూ, నానా అగచాట్లూ పడే దళిత స్త్రీలను ఆమె తన ఇంటి బావి నుంచి, ఎప్పుడైనా, ఎంతయినా నీటిని తోడుకోమని ఆహ్వానిస్తుంది. విధవలైన బాలికల, స్త్రీల తలలు గొరగకూడదంటూ మంగలి వారిని ఒప్పించి, పురుషవాద చాందసవాదుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటుంది. అలాగే వరకట్న సమస్య పరిష్కరించడానికి సామూహిక వివాహాల ఏర్పాటు చేయడమూ సంఘ వ్యతిరేకతని రేపుతుంది.

సంఘ సేవలో ఇంత నిర్విరామంగా కృషి చేస్తున్నా ఆమె కవితలు కూడా రాసింది. అందులో కూడా ఆధునిక కవిత్వం మరాఠీలో రాసిన మొదటి మహిళ ఆమే. ఆమె కవితలు మొదట తన విద్యార్ధుల కోసం రాసినా, తరవాత అందులోఅ అనేక సామాజిక అంశాలు వస్తువులయ్యాయి. ఆమె రాసిన రెండు ఇంగ్లీష్ అనువాదాలకు, నేను చేసిన తెలుగు అనువాదం మీకోసం కింద ఇస్తున్నాను.


Rise, to learn and act
Weak and oppressed! Rise my brother
Come out of living in slavery.
Manu-follower Peshwas are dead and gone
Manu’s the one who barred us from education.
Givers of knowledge– the English have come
Learn, you’ve had no chance in a millennium.
We’ll teach our children and ourselves to learn
Receive knowledge, become wise to discern.
An upsurge of jealousy in my soul
Crying out for knowledge to be whole.
This festering wound, mark of caste
I’ll blot out from my life at last.
In Baliraja’s kingdom, let’s beware
Our glorious mast, unfurl and flare.
Let all say, “Misery go and kingdom come!”
Awake, arise and educate
Smash traditions-liberate!
We’ll come together and learn
Policy-righteousness-religion.
Slumber not but blow the trumpet
O Brahman, dare not you upset.
Give a war cry, rise fast
Rise, to learn and act.


మేల్కొని, నేర్చుకొని, వ్యవహరించు.


పీడితులూ, బలహీనులూ అయిన నా తమ్ములారా లేవండి
బానిస బ్రతుకులనుండి బయటపడండి.
మనువు అనుయాయిలైన పీష్వాలు మరణించారు, ఇపుడు లేరు
విద్యనుంచి మనను వెలివేసినవాడు మనువు.
జ్ఞానం పంచే ఆంగ్లేయులు వచ్చారు.
నేర్చుకో, యుగాలుగా లేని అవకాశం.
మనం నేర్చుకుందాం, మన పిల్లలకూ నేర్పుదాం
పొందిన జ్ఞానంతో శోధిద్దాం.
నా ఆత్మలో ఉప్పొంగిన అసూయ ఒకటి
సంపూర్ణ జ్ఞానం కోసం ఆక్రోశిస్తున్నది
ఈ సలుపుతున్న గాయాన్ని, కులం మచ్చనీ
చివరిగా నా జీవితం నుంచి చెరిపేస్తాను.
ఈ బలికోరే రాజ్యంలో మనం జాగరూకులమై ఉందాం
మన ఘనమైన స్థంబంపై జెండా వికసించనీ, ప్రకాశించనీ
మనమందరం మన దీనావస్థ పోయి మన రాజ్యం రానీ అందాం!
లేవండి లేవండి చదువుకోండి
సంప్రదాయాలను బద్దలు కొట్టి స్వేఛ్చ పొందండి!
మనమందరం ఒకటయి నేర్చుకుందాం
న్యాయబద్ధమైన విధానాలూ, మతమూ.
మత్తులో తూగకు, ఢంకా బజాయించు
ఓ బ్రాహ్మణుడా, నువ్వడ్డుకుంటే చూడు...
త్వరగా లేచి యుద్ధ భేరీ మ్రోగించు
మేల్కొని, నేర్చుకొని, వ్యవహరించు.


So says Manu…
“Dumb are they
who plough the land,
Dumb are the ones
who cultivate it”,
So says Manu.
Through religious diktats,
The Manusmriti to the Brahmin tells,
“Do not your energy, on agriculture, waste!”
“Those born as Shudras,
All these Shudras!,
Are paying in this life,
For the sins of their past lives”
Thus they create
A society based on inequality,
This being the inhuman ploy,
Of these cunning beings.


మనువిలా అంటాడు


"నేలను దున్నే వారు
మూగవారు
పొలం పండించే వారు
మూగవారు"
అని మనువంటాడు.
మత గ్రంధ నిబంధనల ద్వారా
మనుస్మృతి బ్రాహ్మలకి చెప్తుంది,
"వ్యవసాయం మీద నీ శక్తి వృధా చేయకు”,
శూద్రులుగా పుట్టినవారున్నారు!
"ఈ శూద్రులంతా
ఈ జన్మలో వారి
గతజన్మ పాపాలకు పరిహారం చెల్లిస్తున్నారు".
అంటూ
ఒక అసమానతల సమాజాన్ని
సృష్టిస్తున్నారు.
ఈ కుత్సిత మనుషుల
అమానుష కుతంత్రం ఇది.
Xxxx


కుల వివక్ష చూపడానికైనా, భరించడానికైనా స్త్రీలు అతీతులు కారు. ఇది గమనించే ఆమె ఒక మహిళా మండలి ఏర్పాటు చేస్తుంది. స్త్రీలందరూ అక్కడ కూడి మాట్లాడుకోవటానికి. కానీ కేవలం మాటల వల్ల ఏమీ జరగదని, స్త్రీల దుస్తితినీ పురుషాధిక్యతనూ ఎదుర్కోవాలంటే వీరిని సంఘటిత పరిచి కలిసికట్టుగా పోరాటం చెయ్యడానికి కావల్సిన గ్రహింపు వారికి కలగాలని తెలుసుకుంటుంది. ఈ దిశగా ఆమె నాయకత్వం వహించి ఎన్నో సామాజిక కార్యక్రమాలను పితృస్వామ్యాన్నీ, బ్రాహ్మణ ఆధిపత్యాన్నీ వివరిస్తూ, నిరసిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. నిజానికి ఒక రచయిత్రిగా కన్నా ఒక సంఘ సంస్కర్తగా, స్త్రీ విద్య కోసం, స్త్రీ స్వేఛ్చ కోసం, పురుషుడి బానిసత్వం నుంచి స్త్రీని రక్షించేందుకు ఆమె నడుంకట్టుకున్న అభ్యుదయవాదిగా ఆమెకు ఎక్కువ గుర్తింపు. ఏమైనా, ఈ వంకనైనా ఈమె పరిచయం అందరూ మరొక్కమారు చేసుకుంటే, అది స్త్రీలకు ఆమె చేసిన సేవలకి ఒక చక్కని నివాళి అనిపించింది. ఆమె దగ్గర విద్యనభ్యసించిన ఎందరో మహిళల వల్ల ఈరోజున మహిళల పరిస్తితి మెరుగ్గా ఉందనటానికి ఎటువంటి సందేహం అక్కరలేదు. ఒక చక్కని అవగాహనతో, నిబద్ధతతో, కార్యశీలతతో, తన ఆశయాల సాధనకే తన జీవితాన్ని అర్పించిన త్యాగ మూర్తి ఆమె. ఈ పరిచయం చెయ్యడం నాకెంతొ గర్వంగా కూడా ఉంది.


ఇంకొక రచయిత్రి పరిచయంతో మళ్ళీ కలుసుకుందాము.

-Sharada Sivapurapu