Facebook Twitter
సర్వే దేవుళ్ళు!!

సర్వే దేవుళ్ళు!!

ఓటరు దేవుళ్ళు 

భక్తులైన బరిలోని అభ్యర్థుల 

వాగ్దానాల దీపధూపాలో 

పథకాల పప్పుబెల్లాలో  

అమ్యామ్యాల లిక్కరు తీర్థమో 

చదివింపుల రొక్కపు నైవేద్యమో

మైమరచి పుచ్చేసుకొని

చూపుడువేలితో గెలుపురాతనిచ్చి

ఫలితాన్ని పండుగరోజుకై దాచేస్తే!!

ఆరోజుకై ఆగలేని భక్తులు

ఆత్రంతో నరాలు తెంచుకొంటూ

గెలుపోటములను ఊహిస్తూ పందాలుకాసే 

జూదరులకోసం కొత్తదేవుళ్ళొచ్చారు!

ఓటరుదేవుళ్లతో సత్సంబంధాలున్నాయనీ 

ఇచ్చేసిన వరాలగుట్టు మాదగ్గరుందనీ

వివరాలు ఇవేనని గుట్టునిప్పేస్తూ

అభయహస్తాన్నిస్తూ సర్వేదేవుళ్లు!

నమ్మి సర్వస్వమూ పందెంలోపెట్టి

నెత్తిన భస్మాసురహస్తం పెట్టించుకొని 

బ్రతుకుల్ని బజారుకీడ్చుకొంటూ

సర్వేదేవుళ్లకు బలవుతూ పందెంరాయుళ్లు

గెలుపుభ్రమలోబడి అభ్యర్థులు వారి భక్తులు!

- రవి కిషొర్ పెంట్రాల