Facebook Twitter
సుప్రభాత శోభ


తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌విత‌ల పోటీలో తృతీయ బ‌హుమ‌తి రూ. 1,116 పొందిన క‌విత‌

 

రేయి కప్పుకున్న
చీకటి దుప్పటిని చించి
పసిడి పూతను పూస్తున్నాడు సూర్యుడు
రాత్రంతా వెన్నెల ధారల్లో తడిసి
చిరు చలికి ముకుళించిన
పూమొగ్గలు ఉలిక్కిపడి మేల్కొని
అర్థనిమీలిత నేత్రాలతో
జగతిని చూస్తున్నాయి....!

గుక్కెడు నిశ్శబ్దం త్రాగి
నిశి గుండెల్లోనిదురించిన కమలం
ప్రొద్దున్నే గోరువెచ్చని కిరణాలతో
తానమాడి
కోనేటిని కమనీయ స్మృతులతో
పరిమళలభరితం చేసింది...!!!

భూమి బుగ్గల మీద
ఉషస్సు తమకంతో
చుంబనాల సంతకాలు చేస్తుంది..!
తూరుపు తెరల్లోంచి
తళుక్కుమన్న అరుణకాంతులు
నా హృదయ కాగితం మీద
కవితా చరణాలను రచిస్తున్నాయి...!

పన్నీటితో కడిగిన ఆ మధుర క్షణాలు
నేనెప్పుడో పారేసుకున్న ఆనందాన్ని
కనుల ముందు నిలుపుతున్నాయి...
మధుర భావాల సుమమాలలతో
నా కంఠసీమను అలంకరిస్తున్నాయి...!

ఒక్కో ప్రభాతకిరణం
తన సుతిమెత్తని వేళ్ళతో
నా మానస వీణను శృతి చేస్తూ...
కమ్మని రాగాల జల్లులతో
ఎదక్షేత్రాన్ని....
సస్యశ్యామలం చేస్తుంది....!

అంతా అనురాగ మయం
సమతా మమతల శుభోదయం...!!

ర‌చ‌న‌: కాసర లక్ష్మీ సరోజా రెడ్డి