Facebook Twitter
కరోనా చాలా నేర్పింది

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌విత‌ల పోటీలో తృతీయ బ‌హుమ‌తి రూ. 1,116 పొందిన క‌విత‌

 

కలివిడిగా ఉంటూనే విడిగా ఉండడం నేర్పింది.
విడిగా ఉంటూనే మనసులు కలుపుకోవడం నేర్పింది
ఇల్లంటే ఏమిటో నేర్పింది.
అమ్మా నాన్న అక్కా అన్నా తమ్ముడూ చెల్లాయి –
ఇల్లూ అంటే ఈ బాంధవ్యాలే - ఇటుకా సిమెంటూ కాదని నేర్పింది

అన్నీ ఉన్నా ఏదో లేదని ఏడ్చే స్థాయి నుంచీ
ఏది లేకపోయినా హాయి ఎటూ పోదన్న విషయం నేర్పింది
ఎంజాయ్ చేయడమంటే,

క్లబ్బులు, పబ్బులు – చాటింగులు, టిక్ టాక్ లూ
మాల్స్ లో షాపింగులూ స్విగ్గీ వంటకాల దిగుమతులూ
ఇవేమీ కానక్కర్లేదని ఘంట బజాయించి మరీ నేర్పింది.

అవ్వా తాతలతో క్యారం బోర్డూ, అచ్చంగాయలూ ఆడించి మురిపించింది
అమ్మా నాన్నలకి విశ్వనాథ వారూ, శ్రీపాదవారూ గుర్తుకు వచ్చేలా చేసింది.
పరుగుల జీవితం వైపు పరీక్షగా చూసుకునే సమయాన్నిచ్చింది

అమ్మకిప్పుడు వచ్చింది వేడిగా రుచిగా అన్నం పెట్టే చాన్స్
నాన్నమ్మ తో తీరిగ్గా కూర్చుని పాత విషయాలు తెలుసుకునే ఛాన్స్
నాన్న కూడా ఒకప్పుడు చాలా హ్యాండ్ సం అనిపించే ఆల్బం చూసే ఛాన్స్
అమ్మమ్మా వాళ్ళింటి గ్రూప్ ఫోటోలో వాళ్ళని పలకరించే ఛాన్స్

పదోతరగతి ఫోటో లోని మిత్రుల్ని గుర్తించే ఛాన్స్
అవసరం ఉన్నవాళ్ళని ఆదుకోవడంలో ఆనందం పంచే ఛాన్స్
అందరం కలిసి పాత బంగారు సీరియళ్ళ లో మునిగిపోయే ఛాన్స్
‘ఎంజాయ్ కరోనా ‘ అంటూ కరోనా సెలవలిచ్చి కూర్చోబెట్టింది

కరోనా చాలా విషయాలు తెలిసేలా చేసింది.
నేతల్లోనూ మంచి వాళ్లున్నారని తేల్చి చెప్పింది
డబ్బున్నోళ్ళకి కూడా మంచి మనసుందని తెలిపింది.
బళ్ళోకి వెళ్లకపోయినా చదువువొస్తుందనీ
గుళ్ళోకి వెళ్లకపోయినా పుణ్యమొస్తుందనీ నిర్ధారణ చేసింది
ఎవరి పని వాళ్ళు చేసుకోగలం అన్న ధీమా కల్గించింది
ఎవరు లేకపోయినా కాలమేమీ ఆగదని రూడీగా చెప్పేసింది

కరోనా ఇంకా చాలానే చెప్పింది
శుచి శుభ్రత ఆరోగ్యం కోసమే, ఆచారం మాత్రమే కాదు పొమ్మంది
చేతులారా నమస్కరించడమనే సంస్కారం మనదని గుర్తు చేసింది
అనవసరంగా రాసుకు పూసుకు తిరగడం,
మోడరన్ ఫ్యాషన్ అంటూ ఎంగిలి తిండి తినడం
లేని ప్రేమ వ్యక్తీకరించే కపట కౌగిళ్ళు, మోసపు ముద్దులూ
పనీ పాటా లేకుండా బలాదూరు తిరగడాలూ లాంటివి

ప్రమోదాలు కాదురా బడుద్దాయిలూ, పరమ ప్రమాదాలని హెచ్చరించింది.
ఏతా వాతా భారతీయం ఇదే…
మహమ్మారిని అడ్డుకునే ఆయుధం ఇదే….
కలివిడిగా ఉంటూనే విడిగా ఉండడం
విడిగా ఉంటూనే మనసులు కలుపుకోవడం

ర‌చ‌న‌:  నందిరాజు ప‌ద్మ‌ల‌తా జ‌య‌రామ్‌