క్రోధినామ ఉగాది ఉత్సవం!!
క్రొత్త పాత కోరికల్ని కలబోసి
మస్తిష్కపు బస్తాల్లో ఉబ్బేట్టుగా నింపి
చిరుకోర్కెనైనా విడువనిష్టపడక
బలమైన ఆశలబంధంతో కుట్లువేసి
కాలం రథమ్మీద ప్రయాణిస్తూ
శోభకృత్ పొలిమేర దాటుకుంటూ
క్రోధి గ్రామం చేరుకుంటూ
సగటు ఓటరు మహాశయులు!
ఆ మస్తిష్కపు కోర్కెల బస్తాలు
మా దగ్గర విప్పాలనీ
వాంఛల విత్తుల్ని మొలకెత్తిస్తామనీ
ఆకాశాన్నంటగా వృద్ధిజేసి
వాటికి వసంతోత్సవం జరిపిస్తామనీ
అధికార స్వరంతో.. వాగ్దాన వర్షాలతో..
కుర్చీలనొదల ఇష్టపడని నాయకులు!
ఆ మాటకొస్తే
ఆ కోరికలన్నీ మాకెరుకేననీ
వాటిని మేమిప్పటికే
ఇంకుబేటర్లోపెట్టి పెంచుతున్నామనీ
మీమీ ఓట్లు మాకేసి గెలిపిస్తే
కోర్కెల ఫలపుష్పాలు మీకిచ్చేస్తామనీ
కుర్చీనెక్క కాచుకొన్న నాయకులు!
క్రోధిగ్రామం పొలిమేరల్లోనే
ఓటర్లకీ పొలిటికల్ లీడర్లకీ
కోర్కెలుతీర్చే ఉత్సవాలనిస్తోందనీ..
మాకు మాత్రం
కమ్మని లేలేత చిగుర్లు
మామిడిపూతలమేసి కూసే కోయిలలు
విరగబూచిన తరుల సొబగులు
హాయైన మలయ మారుతాలు
వెరసి మధుమాసపు సిరులోత్సవాలనీ
మెండు మోదంతో.. కించిత్ క్రోధంతో…
ఓటు హక్కుకు నోచుకోని జీవులు!
- రవి కిషోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్
