హరికథకు గురువు - నారాయణదాసు
ఏదైనా ఒక ప్రక్రియకు ఆద్యుడు అన్న పేరు సాధించడం తేలిక కాదు! చరిత్ర నిలిచినంతకాలం జనులు తల్చుకునే బిరుదు అది. అలా హరికథా పితామహునిగా వినుతికెక్కిన ఆదిభట్ల నారాయణదాసు గురించి స్మరించుకు తీరాల్సిందే!
ఆదిభట్ల నారాయణదాసు 1864లో విజయనగరం జిల్లా బొబ్బిలికి సమీపంలోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఏకసంథాగ్రాహిగా పేరుతెచ్చుకున్నారు. చదువుకొనే స్తోమత లేకపోయినా, ఏ పద్యం విన్నా కూడా ఆ పద్యాన్ని కంఠతా పట్టేసేవారట. నారాయణదాసుగారి ప్రతిభను గమనించిన వారి తాతగారు అతన్ని తన దగ్గరే ఉంచుకుని సంగీత శిక్షణా, విద్యాభ్యాసం చేసే అవకాశం కల్పించారు. ఆ ఒక్క ఆసరాతో నారాయణదాసుగారి జీవితమే మారిపోయింది.
నారాయణదాసు సాహిత్యంలో అపారమైన ప్రతిభను కనబరచడం మొదలుపెట్టారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కృతం... సహా తొమ్మిది భాషల మీద ఆయనకు పట్టు ఉండేదట. తెలుగులో అశువుగా కవిత్వం చెప్పడం, వెనువెంటనే ఆ కవిత్వాన్ని ఇంగ్లిష్‌లోకి కూడా అనువదించేయడం చేసేవారట. ఇటు సంస్కృతంలో కాళిదాసు రచనలనీ, అటు ఆంగ్లంలో షేక్సియర్ రచనలనీ దాసుగారు అరాయించేసుకున్నారు. ‘నవరస తరంగిణి’ పేరుతో ఆ ఇద్దరి రచనల మధ్యా ఉన్న సారూప్యతల గురించి ఏకంగా ఓ గ్రంథాన్నే రాసేశారు.
కేవలం గ్రంథరచనే కాదు అనువాదాలలోనూ ఆయన ఆరితేరినవాడు. అనువాదంలో ఎలాంటి లోటూ రాకుండా ఉండేందుకు ఆయన మూల గ్రంథం మీదే ఆధారపడేవారు. ఉమర్ ఖయ్యాం రుబాయితులు, ఏసఫ్ రాసిన నీతికథలను తెలుగులోకి అనువదించి... తెలుగునాట అనువాద సాహిత్యానికి శ్రీకారం చుట్టారు. సాహిత్యమే కాదు, సంగీతంలో కూడా నారాయణదాసుగారు అపారమైన ప్రతిభను కనబరిచేవారు. సంగీత స్వరాలను ఆలపించడంలోనూ, వీణ వాయించడంలోనూ ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకొనేవారు.
రుగ్వేదంలోని రుక్కులను సైతం సంగీతరూపంలోకి మార్చిన ఘనుడాయన. కర్నాటక సంగీతంలో ఉన్న రాగాలు అన్నింటిలోనూ కృతులను రాసిన సంగీతజ్ఞాని. అందుకనే విజయనగర రాజులు ఆయనను ఆస్థానవిద్వాసునిగా ఎన్నుకొన్నారు. 1919లో విజయనగరరాజులు సంగీతకళాశాలను ఏర్పాటు చేసినప్పుడు, నారాయణదాసుగారినే తొలి ప్రధానోపాధ్యాయునిగా ఎన్నుకొన్నారు.
నారాయణదాసు అసలు పేరు సూర్యనారాయణ. ఓసారి కన్నమనాయుడు అనే వ్యక్తి హరికథ చెప్పడం చూసి, తాను కూడా ఆ రంగంలో అడుగుపెట్టాలనుకున్నారు. క్రమంగా హరికథాగానంలో ఆరితేరడంతో ఆయనని నారాయణదాసుగా పిలవడం మొదలుపెట్టారు. నిజానికి హరికథలు తెలుగువారికి కొత్తేమీ కాదు! అయితే దానికి ఒక ఆకర్షణను తీసుకువచ్చిన వ్యక్తి మాత్రం నారాయణదాసే. సాదాసీదాగా సాగిపోయే కథకు, సంగీతం, ఆలాపన, నృత్యం అన్నింటినీ జోడించి జనాలను రంజింపచేసేవారు. ఒకో సందర్భంలో ఏకబిగిన ఆరేడుగంటల పాటు హరికథను ఆలపించేవారట. ఎలాంటి మైకులూ, ఆర్భాటాలూ లేని ఆ రోజుల్లో ఆజానుబాహుడైన నారాయణదాసు, తన రూపంతోనూ, కంఠంతోనూ, ఆలాపనతోనూ జనాన్ని ఉర్రూతలూగించేవారు. తన తర్వాత వచ్చిన గాయకులందరికీ ఒక మార్గదర్శిగా నిలిచారు. అందుకనే ఆయనను హరికథా పితామహుడు అని పిలుస్తారు.
కవిత్వం, హరికథలు, శతకాలు, తాత్విక... ఇలా ఎన్నో రంగాల మీద నారాయణదాసుగారు వందకుపైగా గ్రంథాలను రాశారని చెబుతారు. వీటితో పాటుగా ‘నా ఎఱుక’ పేరుతో తన ఆత్మకథను కూడా రాసుకున్నారు. అందులో తన భావాలను, అనుభవాలను ఎలాంటి దాపరికమూ లేకుండా పంచుకున్నారు. నారాయణదాసుగారి గురించి విని ఆయనను ఆరాధించేవారికి, ఆయన ఆత్మకథ కాస్త కష్టం కలిగిస్తుంది.
‘నా ఎఱుక’లో తను నల్లమందు తినేవాడిననీ, మద్యపానం చేసేవాడిననీ, వేశ్యల వెంట తిరిగేవాడిననీ నారాయణదాసుగారు నిర్మొహమాటంగా చెప్పుకొన్నారు. డబ్బు కోసం, కీర్తి కోసం తాను జిమ్మిక్కులు చేసినట్లుగా కూడా ఇందులో స్పష్టం అవుతుంది. పైగా వితంతు వివాహాలు, స్త్రీ విద్య వంటి విషయాలలో నారాయణదాసుగారికి వ్యతిరేక భావనలు ఉన్నట్లు స్పష్టం అవుతుంది. నారాయణదాసుగారి వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెడితే, ఆయన పాండితీ ప్రకర్షను ఏమాత్రం తక్కువచేసి చూడలేం. అందుకే ఆయన చనిపోయి 60 ఏళ్లు దాటిపోతున్నా.... ఇప్పటికీ నారాయణదాసుగారిని తెలుగువారంతా తల్చుకుంటూనే ఉన్నారు.
- నిర్జర
