TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తెలుగుభాషకు కొత్త అడుగు - గిడుగు రామమూర్తి
ఒక వంద సంవత్సరాల క్రితం ప్రచురించిన పుస్తకం ఏదన్నా తీసుకోండి. దాన్ని చదివేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాగొలా చదివినా... అందులోని చాలా పదాలకు మనకు అర్థమే స్ఫురించదు. మొత్తంగా ఆ పుస్తకాన్ని పూర్తిచేసిన తర్వాత, అందులో ఓ పదోశాతం మనకు బుర్రకు ఎక్కుతుందేమో! ఎందుకంటే అప్పట్లో పుస్తకం రాయాలంటే గ్రాంథిక భాషలోనే రాయాలి అనే అలిఖిత నిబంధన ఉండేది. ఆ నియమాన్ని మార్చి, తేట తెలుగుని నలుచెరగులా ప్రచారం చేసిన వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు. రామమూర్తిగారు 1863, ఆగస్టు 29న శ్రీకాకుళం దగ్గర ఉన్న ఓ చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో విజయనగరంలో ఉన్న మేనమామ దగ్గరకు చేరారు. అక్కడే మెట్రికులేషన్ పూర్తిచేశారు. ఆ తర్వాత పెద్ద దిక్కు లేని తన కుటుంబాన్ని పోషించే బాధ్యతను చేపట్టారు. ఒక పక్క తన కుటుంబాన్ని పోషించేందుకు ఉపాధ్యాయ వృత్తిని సాగిస్తూనే, మరోపక్క ఉన్నత విద్యను పూర్తిచేసి లెక్చరర్గా పదోన్నతిని పొందారు.
గిడుగు గురించి వినగానే మనకు వ్యవహారిక భాషోద్యమం గుర్తుకువస్తుంది. అప్పట్లో పాఠ్యపుస్తకాలు, గ్రంథాలు అన్నీ కూడా గ్రాంథిక భాషలోనే ఉండేవి. అంటే రోజువారీ ప్రజలు మాట్లాడుకునే భాషలో కాకుండా, వందల ఏళ్లనాటి రాచరికపు భాషను తలపించేవన్నమాట. దీని వల్ల అటు పాఠ్యపుస్తకాలలో ఉండే విజ్ఞానం కానీ, గ్రంథాలలో ఉండే విషయ పరిజ్ఞానం కానీ సామాన్యులకు అందుబాటులో ఉండేవి కాదు.
ఈ పద్ధతిని మార్చాలనుకున్నాడు గిడుగు. మాట్లాడే భాష, రాసే భాష ఒకటి కావాలనుకున్నాడు. అందుకోసం వ్యవహారిక భాషోద్యమాన్ని ఆరంభించాడు. పత్రికలు నడుపుతూ, సమితులు ఏర్పాటు చేస్తూ, ప్రసంగాలు సాగిస్తూ... వ్యవహారిక భాష గురించి విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆయన సమకాలికులైన వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, తాపీధర్మారావు వంటి ప్రముఖులు కూడా గిడుగులు అండగా నిలబడటంతో, క్రమంగా ఆయన ఉద్యమం సత్ఫలితాలను ఇవ్వసాగింది.
వ్యవహారిక భాషోద్యమం ఏమంత తేలికగా సాగలేదు. ఆనాటి పండితులు చాలామంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా జయంతి రామయ్యపంతులు, వావిలికొలను సుబ్బారావు లాంటి పండితుల ఆధ్వర్యంలో ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ పేరుతో ఒక సంఘాన్నే నెలకొల్పారు. అయితే ఇలాంటి ప్రతిఘటనలకి వెరవకుండా దాదాపు నాలుగు దశాబ్దాలపాటు వ్యవహారిక భాష కోసం పోరాడారు గిడుగు. ఆ ఫలితం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. గిడుగు జీవించిన విజయనగరం జిల్లాలో సవర అనే ఒక భాష వినిపిస్తుంది. సవరులు అనే ఒక ప్రాచీన తెగ వారు ఈ భాషని మాట్లాడుకుంటూ ఉంటారు. ఉత్తరాంధ్ర, ఒడిషాలలో నివసించే ఈ సవరులు తమ భాషను కాపాడుకోవడంలో నానాతంటాలు పడటాన్ని గిడుగు గమనించారు. సవర భాషకి ఎలాంటి లిపి లేదు. అంటే మాట్లాడుకోవడం తప్ప రాసుకోవడానికి వీల్లేదన్నమాట! దాంతో సవర భాషకి ఎలాంటి సాహిత్యమూ లేకుండా పోయింది. పైగా అటు ఒడిషా, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల మధ్య దాని ప్రాభవం క్షీణించిపోసాగింది.
సవరులను గమనించిన గిడుగు రామమూర్తి పంతులుగారు, ఎలాగైనా వారి భాషను కాపాడాలనుకున్నారు. సవరభాష తెలిసినవారి సాయంతో స్వయంగా ఆ భాషని నేర్చుకున్నారు. పర్లాకిమిడి కొండల్లో తిరుగుతూ వారి సాహిత్యాన్ని సేకరించారు. సవరలో ఉండే పదాలను, జానపద గేయాలను పోగుచేశారు. వాటిని తెలుగు లిపిలో పుస్తకాలుగా ప్రచురించారు. అలా ప్రచురించిన A Manual of the Savara Language, Savara – English dictionary వంటి పుస్తకాలు ఇప్పటికీ ఆ భాష నిలిచి ఉండేందుకు సాయపడుతున్నాయి. సవరుల పదాలను, పాటలను సేకరించేందుకు గిడుగు పర్లాకిమిడి కొండలలో ఎండనకా, వాననకా తెగ తిరిగేవారు. ఆ సమయంలో తరచూ దోమకాట్ల బారినపడి మలేరియాకు గురయ్యేవారు. దానికి విరుగుడుగా క్వినైన్ అనే ఔషధాన్ని వాడుతూ ఉండాల్సి వచ్చేది. ఈ క్వినైన్తో ఆయన మలేరియా కుదురుకున్నా, గిడుగు వినికిడి మాత్రం శాశ్వతంగా దెబ్బతిన్నది. తన ఆరోగ్యాన్ని కూడా ఖాతరు చేయకుండా ఇటు తెలుగుకీ, అటు సవర భాషకీ గిడుగు చేసిన కృషికిగాను ఆయనకు ‘రావు బహదూర్’ మొదలుకొని ‘కళాప్రపూర్ణ’ వరకు అనేక బిరుదులు లభించాయి. కానీ ప్రజల మనసులో ఆయనకి ఉన్న స్థానం... వేలాది బిరుదులను మించినది. గిడుగు పుట్టినరోజైన ఆగస్టు 29ని జనం ‘తెలుగు భాషా దినోత్సవం’గా జరుపుకోవడమే ఇందుకు గొప్ప ఉదాహరణ! తెలుగు ఉన్నంతవరకూ, గిడుగు ఉంటాడని చెప్పే ఓ సూచన.
- నిర్జర.