Facebook Twitter
సాటిలేని రచయిత – ఆరుద్ర!

సాటిలేని రచయిత – ఆరుద్ర!

రచయిత అన్నాక అక్షరం మీద పట్టు ఉండటం సహజమే! అందుకే కొందరు రచయితలు సాహిత్యానికి సంబంధించిన చాలా ప్రక్రియలలో అడుగుపెడుతూ ఉంటారు. కొండొకచో విజయాన్నీ సాధిస్తుంటారు. కానీ సాహిత్యంలో సవ్యసాచిలా ఎడాపెడా తన ప్రాభవాన్ని చూపగలిగే ప్రతిభ అతికొద్దిమందికే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో అలాంటివారి గురించి చెప్పుకునే సందర్భం వస్తే బహుశా ఆరుద్రతోనే ఆరంభించాలేమో!

ఆరుద్ర శ్రీశ్రీతో పోటీపడుతూ విప్లవకవితలు రాశాడు; ‘త్వమేవాహం’తో దాశరథికి దీటుగా నిజాం అకృత్యాలను ఎండగట్టాడు; తాపీ ధర్మారావుని తలపిస్తూ ‘గుడిలో సెక్స్‌?’ అనే హేతువాద రచన చేశాడు; ఆత్రేయకు పోటీగా మనసుని కరిగించే సినీగీతాలు రాశాడు. ఆరుద్ర ఏం రాశాడు అన్నదానికి ఓ చాంతాడంత జాబితా కనిపిస్తుంది-

గేయాలు, నాటికలు, కథలు, కవితలు, నవలలు, సాహిత్య పరిశోధన, సినీగీతాలు, సంభాషణలు, డిటెక్టివ్‌ సాహిత్యం, అనువాదం, విమర్శ, సంపాదకత్వం... ఇలా సాహిత్యంలోని ప్రతి రంగం మీదా, తన కలంతో అరుదైన విన్యాసాలు చేశాడు.

ఆరుద్ర 1925లో విశాఖపట్నంలో జన్మించారు. ‘భాగవతుల సదాశివశంకర శాస్త్రి’ అన్నది వీరి అసలు పేరు. కాకపోతే జన్మనక్షత్రమైన ఆరుద్ర అనే కలంపేరుతోనే ప్రసిద్ధులయ్యారు. ఆరుద్ర విద్యాభ్యాసం సాధారణంగానే సాగింది. క్విట్‌ ఇండియా ఉద్యమంతో అది అర్థంతరంగా ముగిసింది కూడా! కానీ చదువుకునే సమయంలో రోణంకి అప్పలస్వామి, చాగంటి సోమయాజుల వంటి సాహితీమూర్తులు పరిచయం ఆయనను సాహిత్యం వైపుగా నడిపింది. 1947లో చెన్నైలోని ‘ఆనందవాణి’లో ఉపసంపాదకునిగా చేరడంతో ఆరుద్ర జీవితం పూర్తిగా సాహిత్యం దిశగా సాగింది.

మొదట్లో ఆరుద్ర తన బతుకుబండిని లాగడం కోసం విస్తృతంగా రాసేవారు. ఒకానొక సందర్భంలో నెలకి ఒక డిటెక్టివ్‌ నవల రాసితీరుతాను అని ‘ఆరుద్ర శపథం’ పట్టారని చెబతారు. క్రమేపీ సినీరంగంలో అవకాశాలు దక్కడంతో ఆయన ప్రభకి తిరుగులేకుండా పోయింది. ఒక అంచనా ప్రకారం ఆరుద్ర నాలుగువేలకు పైగానే సినిమాపాటలు రాశారు. కొండగాలి తిరిగింది (ఉయ్యాల జంపాల), వేదంలా ప్రవహించే గోదావరి (ఆంధ్ర కేసరి), ఎదగడానికెందుకురా తొందర (అందాల రాముడు), రాయినయినా కాకపోతిని (గోరంత దీపం), శ్రీరస్తు శుభమస్తు (పెళ్లి పుస్తకం) లాంటి పాటలు వింటే చాలు... ఆరుద్ర ప్రతిభ ఏపాటిదో అర్థమైపోతుంది. ఇప్పటి కుర్రకారు కూడా విని ఉద్రేకపడిపోయే ‘మసక మసక చీకటిలో’ పాట రాసింది ఆరుద్రే అంటే ఆశ్చర్యం కలగక మానదు. కేవలం పాటలే కాదు, ఆరుద్ర కథ అందించిన గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు లాంటి సినిమాలు తెలుగు చిత్రచరిత్రలోనే అద్భుతాలుగా నిలిచాయి.

ఆరుద్ర సినీగీతాల సంగతి అలా ఉంచితే ‘కూనలమ్మ పదాలు’ పేరుతో సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ‘కూనలమ్మ పదాలు’తో నాలుగంటే నాలుగు వాక్యాలలో ఏ అంశం మీదైనా తనదైన స్పష్టతని ఇచ్చేవారు ఆరుద్ర. సగము కమ్యూనిస్ట్/ సగము కాపిటలిస్ట్/ ఎందుకొచ్చిన రొస్టు/ ఓ కూనలమ్మ ! అంటూ గోడమీద పిల్లులను వెక్కిరించినా,  కొంటెబొమ్మల బాపు/ కొన్ని తరముల సేపు/ గుండె ఊయలలూపు/ ఓ కూనలమ్మా! అంటూ తన సమకాలికుని ప్రతిభను మెచ్చుకొన్నా ఆరుద్ర కూనలమ్మ పదాలకే చెల్లింది.

ఆరుద్ర విస్తృతంగా రాసి ఉండవచ్చు. కానీ సాదాసీదాగా మాత్రం రాసిపారేయలేదు. ఏ అంశం గురించి రాసినా దాని మీద ఒక సాధికారితతో రాసేవారు. ‘రాముడికి సీత ఏమవుతుంది?’ అన్న పుస్తకం చదివితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రామాయణాలని రచయిత చదివి రాసినట్లు స్పష్టం అవుతుంది. ‘కాటమరాజు కథ’ నాటకాన్ని చదివితే అందుకోసం అప్పటివరకూ కాటమరాజు ఇతివృత్తం మీద అప్పటివరకూ ప్రచారంలో ఉన్న గాథలన్నింటినీ క్రోడీకరించి రాసినట్లు తెలుస్తుంది. బహుశా ఆ పరిశీలనా శక్తితోనే ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్య’ రచనకి పూనుకొని ఉంటారు.

ఆరుద్ర సాహిత్యమంతా ఒక ఎత్తయితే ఆయన వెలువరించిన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ మరొక ఎత్తుగా భావిస్తూ ఉంటారు. ఏ అకాడెమీలో ప్రభుత్వాలో మాత్రమే పూనుకొని పదులకొద్దీ పండితుల చేత దశాబ్దాలపాటు పని చేయించి రాయించగలిగే పుస్తకాలు ఇవి. ఈ 12 సంపుటాలనీ ఆరుద్ర ఒక్కరే రాశారంటే నమ్మశక్యం కాదు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించినా, ఆర్థిక వనరులు మందగించినా వెనుకడుగు వేయనేలేదు. ఈ 12 సంపుటాలలోనూ ఆరుద్ర వెయ్యి సంవత్సరాలకు పైగా ఉన్న తెలుగు సాహితీ ప్రస్థానాన్ని నమోదు చేశారు. ఆయన కృషి అసమాన్యం కాబట్టే ఆ సంపుటాలు వెలువడి దాదాపు 50 ఏళ్లు కావస్తున్నా... ఇప్పటికీ తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించి ప్రామాణికంగా ఉన్నాయి.

 

ఆరుద్ర గురించి ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అభ్యుదయ రచయితల సంఘాన్ని (అరసం) స్థాపించడంలో ఆయన కృషి దగ్గర్నుంచీ శ్రీశ్రీతో చెలరేగిన వివాదాల వరకూ ఆరుద్ర జీవితంలో చాలా రసకందాయమైన ఘట్టాలున్నాయి. అవి ఎప్పుడైనా మరోసారి!!!

- నిర్జర