Facebook Twitter
తెలుగుకి పెద్ద దిక్కు - చిన్నయసూరి

 

తెలుగుకి పెద్ద దిక్కు - చిన్నయసూరి

 

పరవస్తు చిన్నయసూరి. ఈ పేరు వినగానే బాలవ్యాకరణం పుస్తకమే గుర్తుకువస్తుంది. ఈ పుస్తకాన్ని చదవని తెలుగు పండితులు ఉండరేమో! ఆ మాటకి వస్తే ఈ పుస్తకాన్ని చదవకుండా తెలుగుభాష మీద పూర్తిగా పట్టు సాదించడం అసాధ్యం. ఇంతకీ ఈ చిన్నయసూరి ఎవరు. ఆయన రాసిన ‘బాలవ్యాకరణం’ పుస్తకం ఎందుకంత ప్రత్యేకం...

చిన్నయసూరి 1809లో తమిళనాడులోని శ్రీపెరంబూరులో జన్మించారు. పుట్టిపెరిగింది అంతా తమిళనాడులోనే అయినా.... వీరి పూర్వీకులు తెలుగువారే! చిన్నయసూరి తన 16వ ఏట వరకూ చదువుకోనేలేదని అంటారు. ఆ తర్వాత చదవడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన పాండిత్యానికి తిరుగే లేకుండా పోయింది. తెలుగులో ఉన్న ఆ పాండిత్యంతోనే భాషకి సంబంధించిన అనేక వృత్తులను చేపట్టారు. అనువాదకునిగా, అధ్యాపకునిగా జీవనం సాగించారు. కొన్నాళ్లు బ్రౌన్ దొర దగ్గర కూడా ఉద్యోగం చేసినట్లు కూడా తెలుస్తోంది.

 

తెలుగు భాషే ఆలంబనగా సాగిపోతున్న ఆయన జీవితం ఈస్ట్‌ ఇండియా కంపెనీలో కొలువుతో మలుపు తిరిగింది. మద్రాసులోని సెయింట్‌ జార్జ్‌ కోటలో ఆంగ్లేయ విద్యార్థులకు తెలుగు బోధించేందుకు ఆయనకు ఆ ఉద్యోగం లభించింది. ఆ సమయంలోనే ఆయనకు సూరి అనే బిరుదు లభించింది. చిన్నయ వైష్ణవారాధకుడు అయినా బ్రాహ్మణుడు కాడు. కానీ పాండిత్యంలో ఎవ్వరికీ తీసిపోనివాడు. అందుకని అతని పేరు చివర కూడా ‘శాస్త్రి’ తరహాలో ఏదో ఒక బిరుదుని తగిలించుకొమ్మని ఆంగ్లేయులు సూచించారు. దాంతో పండితుడు అన్న అర్థం వచ్చే ‘సూరి’ అన్న పేరుని జోడించి చిన్నయసూరిగా మారాడు.

చిన్నయసూరి గొప్ప పండితుడే కాదు, అద్భుతమైన రచనాశక్తి కలిగినవాడు కూడా! ఆయన 20కి పైగా గ్రంథాలు రాసినట్లు తెలుస్తోంది. కానీ వాటిలో బాలవ్యాకరణం, నీతిచంద్రిక మాత్రం తల్చుకుని తీరాల్సిన పుస్తకాలు. పంచతంత్రంలోని మిత్రలాభం, మిత్రబేధం అనే విభాగాల అనువాదమే నీతిచంద్రిక పుస్తకం. ఇక బాలవ్యాకరణం సంగతి సరేసరి. పేరుకి పిల్లల కోసం రాసిన వ్యాకరణమే అయినా... ఇది తెలుగు వ్యాకరణం మీద పూర్తి అవగాహన కలిగించే గ్రంథం.

బాలవ్యాకరణం ముందు తెలుగులో వ్యాకరణ గ్రంథాలు లేవని కావు. కానీ అవేవీ ప్రజాదరణ పొందలేదు. తెలుగులో ఫలానా గ్రంథం వ్యాకరణానికి దిక్సూచి అని చెప్పుకోవడానికే లేదు. పండితులు తాము చిన్నప్పుడు విన్న వ్యాకరణ సూత్రాల ఆధారంగానే పద్యాలు, కావ్యాలు రచించేవారు. సంస్కృతంలో పాణిని రాసిన అష్టాధ్యాయిలాగా తెలుగులో వ్యాకరణ గ్రంథం కరువైంది.

ఇలాంటి పరిస్థితులలోనే ఆంగ్లేయుల పాలన ఉచ్ఛదశకు చేరుకుంది. తెలుగుదేశంలో నిదానంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాలన్న వ్యూహాలు మొదలయ్యాయి. పండితులు కూడా తెలుగుని ఆశ్రయించాలా, సంస్కృతంలో రచనలు చేయాలా అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. అలాంటి కీలక దశలో వచ్చిన గ్రంథమే ‘బాలవ్యాకరణం’. తెలుగు వర్ణమాల దగ్గర నుంచి, సంధులుసమాసాల వరకూ ప్రాథమిక సూత్రాలు అన్నింటితోనూ చిన్నయసూరి ఈ గ్రంథరచన చేశారు.

చిన్నయసూరి గ్రాంథిక భాషనే ఇష్టపడేవారు. అయినా ఆయన రాసిన వ్యాకరణ గ్రంథం, తెలుగు భాష ప్రజలకు మరింత చేరువ కావడానికి ఉపయోగపడింది. సామాన్యులు సైతం మహా కావ్యాలను ఆకళింపు చేసుకునేందుకు సాయపడింది. చిన్నయసూరి ప్రభావంతో బహుజనపల్లి సీతారామాచార్యులవారు ‘శబ్దరత్నాకరం’ పేరుతో ఒక నిఘంటువుని రూపొందించారు. ఇక కందుకూరి వీరేశలింగం పంతులు వంటి ప్రముఖుల మీద సైతం చిన్నయసూరి ప్రభావం కనిపిస్తుంది. వ్యక్తుల సంగతి అలా ఉంచితే... తెలుగుజాతి మీద, భాష మీద ఆయన ప్రభావం అసమాన్యం.

- నిర్జర.