Facebook Twitter
బ్రతుకు సేద్యం!

ఏపుగా నింగినంటుతూ
ఫలపుష్పాలతో విరాజిల్లుతూ కొన్ని
కాలానికి ఎదురీదుతూ
కొన ఊపిరితో బ్రతుకీడుస్తూ కొన్ని
ఓనాడెపుడో నాటిన కలల మొక్కలు
వాటి స్థితిగతుల తలుస్తూ నడుస్తూ..

పున్నమి పండువెన్నెల్తో తలంటుకొన్నట్టు
వెండివన్నెల ఉంగరాల జుత్తుతో ఓ తాత
బొత్తిగా దాపరికంలేదని ఎత్తిపొడుస్తూ
అమవాస్య రేతిర్ని తలపాగా చుట్టుకొన్నట్టు
నిగనిగలాడే నల్లటి సిగతో ఓ బామ్మ!

ఊహల వ్యవసాయంజేస్తూ
ఎవరికో సాకారమైన పంటనుజూస్తూ
భూమికి జానెడు పైన నడుస్తూ
గాల్లో గీతలుగీస్తూ ఓ యువకుడు
ఎదురురాళ్ళని జూపి ముకుతాడేస్తూ భార్య!

ఆశలవిత్తులు సంచులనిండా భుజాన్నేసుకొని
నేలేదైనా నెలేదైనా విత్తేస్తామంటూ
ప్రపంచ గమనం సాంతం మారుస్తామంటూ
అకాశమంత స్థైర్యంతో ఓ కుర్రదీకుర్రాడు!

బ్రతుకు సేద్యానికి జంటకై వెదుకు బ్రహ్మచారులు
సహచరి వియోగాన కాడి దించేసి జ్ఞానయోగులు
ఆనందాల సిరుల పంటలు పండిస్తూ పిల్లలు
అమ్మచంకన అన్నీ గమనిస్తూ మా వూరి పార్కులో
నవ్వులు పూయిస్తూ కేరింతలతో పసిపాపలు!