’అమ్మ’తనం అమ్మకానికి

’అమ్మ’తనం అమ్మకానికి               -కనకదుర్గ-   సృష్టికి మూలం స్త్రీ, ఒకపుడు ఇంటికే పరిమితమయిన స్త్రీ ఈనాడు చదువుల్లో అన్ని రంగాల్లోనూ స్త్రీ అంతరిక్షంలోకి అడుగు పెట్టింది ఈనాటి స్త్రీ ఎన్నో విజయాలను చవి చూసింది స్త్రీ కానీ ఇంకా.... బాలికలకు చదువుకోవాలని మంచి ఉద్యోగాలు చేయాలని కోరికలున్నా, పాచిపనులకు, ఇంట్లో తోబుట్టువులను చూసుకుంటూ, చిన్న వయసులోనే పెళ్ళి చేస్తే ఆడుకునే వయసులో తల్లవుతుంటే గర్భంలో పెరుగుతున్నది ఆడ శిశువని తెలిస్తే నిర్ధాక్షిణ్యంగా గర్భంలోనే శిశు హత్య చేసినా తల్లి మౌనంగా వుండాలి, వయసుకి మించిన భారాన్ని మోస్తూ, అనారోగ్యాల పాలవుతూ, బీదరికం బారినుండి బయట పడాలంటే శరీరంలో ఇతర భాగాలు అమ్ముకున్నట్టే తన గర్భకోశాన్నే అద్దెకిచ్చి అందులో పెరిగే బిడ్డతో మమకారం పెంచుకోకుండా, ’సర్రోగేట్ మామ్,’ పేరుతో మాతృత్వాన్ని పురుషుడు, వ్యాపారాత్మకంగా మార్చి అవహేళన చేస్తున్నా, పెళ్ళయ్యేవరకు భధ్రంగా దాచుకున్న శీలం, పరువు, మర్యాద అర్ధాలు అన్నీ తమ అవసరాలను బట్టి, మారిపోతున్నా, భర్తతోనే బిడ్డను కనాలి అనేవారు, కానీ డబ్భుకోసం తన గర్భాన్ని అద్దెకిచ్చి, తన కడుపులో పెరిగే బిడ్డ కాలితో తన్నినా, తిరుగుతున్నా సంతోషించకూడదు, అన్నీ భావాలను మర్చిపోవాలి,  తన రక్తం పంచుకుని నవ మాసాలు తనలో భాగం అయ్యి పెరిగిన శిశువుని తన చేతులతోనే బిడ్డలను కనలేని వారి చేతిలో పెట్టేసి భర్త డబ్బు తీసుకుని ఆనందపడ్తుంటే చనుబాలు గడ్డకట్టి నొప్పిపెట్టకుండా డాక్టర్ మందులిస్తే తీసుకొని, ఇంటికెళ్ళి తన పిల్లలను చూసుకుంటూ ఇంటిపనిలో పడిపోవాలి, మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఇంకో భేరం వస్తే మళ్ళీ ఆ కడుపు కోతకు తయారు కావాలి, ఇది ఒక దేశంలోనే కాదు అన్నీ దేశాలకు పాకుతూ స్త్రీని ఒక వస్తువుగా చేసి చూపిస్తుంటే మౌనంగా చూస్తూ వుండిపోతున్నది నేటి స్త్రీ!  

విశ్వప్రేమికుడు

విశ్వప్రేమికుడు డా. రాధాశ్రీ ఎవరి తరము ఎవరి తరము విశ్వఖ్యాతి నార్జించిన భవ్యప్రేమ విశారదుని కీర్తించగ నెవరి తరము ప్రేమ మయము భువి సకలము ప్రభుని మయము ప్రతి శకలము అని నమ్మిన కవివరేన్యు ప్రతిభనెంచ నెవరి తరము హృదయమనెడి దర్పణంపు నైర్మల్యము వైశ్యాలము ననుసరించి ప్రతిఫలించు విశ్వవ్యాప్త రవి తేజము విశ్వ మనుజు భ్రాతృత్వము కరుణారసమూర్తిత్వము భగవత్ప్రేమ కవిత్వము అదియె రవీంద్రుని తత్వము అతడు దృష్టి సారించగ కాలయముని భ్రుకుటియైన శతదళముల పద్మమ్ముగ తృటిలోనే వికసించును అతడు సృశియించినంత అతి భీకర తమశీలలు కరిగి వెలుగు వెల్లువలై ప్రవహించును విశ్వమంత ప్రేమయనెడి పెన్నిధికై అభవుని పద సన్నిధికై వెదకి వెదకి అణువణువున దర్శించెను భావనుని చీకటి లోయల తేజ శిఖర శేఖరమును గాంచె ఆ శిఖరము నధిష్టించె రసపతాక ప్రతిష్టించె ఎండి బీడు వారి నట్టి ఎదలను పండించునట్టి రసవహిని గీతాంజలి అతడొసగిన భక్త్యంజలి ! విశ్వశాంతి కేతనమ్ము అతని శాంతి నికేతనమ్ము అతడు విమల భావుకుడు ! అతడు విశ్వ ప్రేమికుడు!!

అక్షరం - నేను

అక్షరం - నేను - డా. ఎ. రవీంద్రబాబు      అక్షరం ముందు నేనెప్పుడూ           ఓడిపోతూనే ఉంటాను. అక్షరం వెలుగులో           కాలిపోతూనే ఉంటాను. అక్షరమే నేనై మరణానికి           దగ్గరవుతూ ఉంటాను.               అయినా... అక్షరాన్ని ప్రేమగా లాలిస్తాను. ఆలోచనల అన్నం పెట్టి భావాలతో బుజ్జగిస్తాను. స్నేహంగా నడిపించి ప్రవాహంలా పరిగెత్తిస్తాను. ఒడిలో పడుకోబెట్టుకుని లాలనగా స్పరిస్తాను. ఊహల దుస్తులు తొడిగి భ్రమల లోకాల్లో విహరింపజేస్తాను. వాస్తవంగా నేలపై ఆటలాడిస్తాను. చివరకు అక్షరాన్ని ఆప్యాయంగా అక్కున జేర్చుకుంటాను.                అయినా అక్షరం.... నాపై దాడిచేస్తుంది. నిస్సహాయుడిని చేసి నవ్వేస్తుంది. స్వైర విహారం చేస్తూ తెగ సంబరపడిపోతుంది దహించేస్తూ... దగాచేస్తూ... దాదాగిరి చేస్తూ... దర్జాగా బతికేస్తుంది. ఏ అర్థరాత్రో తటిల్లతా కౌగిలించుకుంటుంది. నగ్నంగా... నిర్భయంగా... భయంకరంగా... ఉక్కిరి బిక్కిర చేసి ఊపిరి తీయాలనుకుంటుంది. అప్పుడు నేను నిట్టూర్పులు విడుస్తూ... అర్థ నిమీలిత నేత్రాల కాంతులతో కాలి బూడిదై పోతాను. చివరకు నేనే అక్షరాన్నై... ఆవిష్కృతమవుతాను. అక్షరమే నేనై... ఆనంద తత్త్వాన్ని పొందుతాను. అలా... అలా... అలా... సంతోషంలో... నేను. నా... అక్షరం.                అందుకే... అక్షరం ముందు మళ్లీ మళ్లీ ఓడిపోవాలనుకుంటాను ఆ ఆకృతిలో లీనమై కరిపోవాలనుకుంటాను. ఆ రస రమ్య లోకాల్లో రాలిపోవాలనుకుంటాను. అసలు... అక్షరమంటే...! అక్షరమంటే...!! క్షరమంటే...!!! రమంటే...!!! మంటే...!!!! టే...!!!! ?                                  

హెచ్చరిక

హెచ్చరిక - డా. సి భావనీదేవి   అది యాసిడో,కత్తో ఏదైనా ' ప్రేమ, అని భ్రమించకు చెల్లి లైలా మజ్నూప్రేమ దేవదాస్ పారుల త్యాగం శ్రీలక్ష్మి,మీనాకుమారి హింస బలి ఎవరైనా ' ప్రేమ  అంటే దిక్కరించాల్సిందే ఏ గుండెలో ఏ మారణాయుధముందో నిలువునా స్కానింగ్ చేయాల్సిందే ఆడపిల్లై పుట్టినందుకు వడ్లగింజ నుంచి పసుపుతాడు దాకా చావు ద్వారమేదో ఎలా తెలుస్తుంది! అందం,చదువు,ఉద్యోగం పాతమాట ఇప్పుడు 'అమ్మాయి' అయితే మాత్రం ప్రేమికుడొస్తున్నాడంటే అందనంత దూరానికి పారిపోవల్సిందే విదేశంలో కూడా మృత్యు నీడల్లాంటి కసాయి ప్రేమికుడికోసం కత్తి పడతారో డాలు సిద్దం చేసుకుంటారో మరి అమ్మాయిలు జాగ్రత్త ప్రేమికుడొస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త!    

లోపలి నది

లోపలి నది   - డా .సి.భవానీదేవి ఇంకా ఎంతదూరం పారిపోగలం ? చుట్టూ సమూహాలే నా అన్నవారి కోసం వెతుకులాట చుట్టూ సముద్రాలే! దాహానికి చుక్క నీటికోసం వెంపర్లాట లోపల్నించి మింగేస్తున్న ఏకాకితనానికి జీవితాన్నిపణంగాపెట్టాలా! ఆరాటాల వెల్లువలో కోల్పోతున్న సహజాతాల మాటేంటి ? ఒంటరితనం తప్ప ఎవరు నీవారు ? ఈ చీకటి దుఃఖాల సుడులమధ్య నిబ్బరాన్ని ఇంకెంతకాలం నటిస్తావ్ ? లోపలి నదుల్ని బయటకి ప్రవహించనీయక పోతే నిన్నే నిలువునా ముంచేయవూ! నలుగురు కాకపోయినా ఒక్కరినైనా మిగుల్చుకోవాలి కదా! అది మాత్రం డబ్బు సంపాదించినట్లు కాదు అసలు నీకేం కావాలో తెల్సా ? పరుగు ఆపి క్షణం ఆలోచించు లోపలి ప్రవాహం ఇంకే లోపు!