ఏకాంతాల ఉరులు

  ఏకాంతాల ఉరులు                ఇప్పుడు నాకు నేను పరిచయం లేని జ్ఞాపకాన్ని            సముద్రం మీద ఎడారిలా రగులుతున్న ఒంటరిని            కన్నీటిని అలల్లా పొంగిస్తున్న చీకటి చితిని             నన్ను ఎవ్వరూ ఆపకండి....             నన్ను ఎవ్వరూ అంతం చేయకండి...            నా ప్రయాణపు రైలు నామీదే ప్రయాణించింది            తొలి అడుగే మడుగై ఊబిలో కుక్కేసింది            జీవితమంత సంతోషాన్ని ఒక్క లిప్తలో తాగేసింది            ఆనంద వాయువుల్లే అంతాన్ని శోధించుకోమంటుంది            అందుకే నన్ను ఎవ్వరూ ఆపకండి            నాకు నేనే అంతాన్ని...            నాకునేనే ఆరంభాన్ని కోల్పోతున్న క్షణాన్ని...             ప్రేమకు పిచ్చిపట్టినట్లు హృదయంలో ఘనీభవిస్తున్నాను.             క్షోభకు, ఛలనాని మధ్య             నిశ్చలంగా ఊపిరిని వదిలేస్తున్నాను.            నా చిటికెనేలును ఆత్మనుండి విడదీసేశాను             తిమిరాల కొసన గుండెను వ్రక్కలు చేసుకుంటున్నాను.             నాకు నేను పురుడు పోసుకోలేని స్వయం ఛలితాన్ని             దయచేసి నన్ను ఎవరూ ఆపకండి.              గతం భూతంలా, అనుభవాలు శ్మశానంలా,              జ్ఞాపకాలు  పిచాచాల్లా వెంటాడాయి, వేటాడాయి.             ఇంకేం మిగిలింది... నన్ను నేను ఉరి తీసుకోడానికి             కోల్పోయిన వనంలో చిగురించని పుష్పం నాది             దయచేసి జాలి, దయ, ప్రేమ అనే పదాలను            ఈ సమాజ యవనికపై సమాధి చేయండి...               నాకులా,,, నేనులా,,, నా అనుభూతుల్లా.,..                ఇప్పుడు మరోలోకం... మానవత కోల్పోని లోకం కోసం             వెతుకులాట... వెన్నెలాట... ప్రారంభించే ఓపికలేని...            ఆశలేమితో.... అడియాశల బడిలో ఓన మాలు            దిద్దుకుంటూ... దిద్దాలని శ్వాసించలేని భాషకోసం...   - రవీందర్

పెళ్లిచూపులు

  పెళ్లిచూపులు         ఆ చంద్ర  చంద్రార్కమే ఒకటైతే ఆ దీవులలొ మల్లెలు పాదము మోపితే రసరాజము విరిసిదంటే వెన్నెల వాలిదంటే వయ్యారపు వీణలలో యమునలు కురిసిదంటే సంగీత ఝరిలో సంద్రమే సాయంత్రపు గమ్మత్తులు విసురుతుంటే పొద్దుగూకిన వెన్నెల వచ్చి వాలుతుంటే ఆ దీవులలొ మల్లెలు పాదము మోపితే రసరాజము విరిసితుంటే వయ్యారపు వీణలలో యమునలు కురిసిదంటే సంగీత ఝరిలోసంద్రమే సాయంత్రపు గమ్మత్తులు విసురుతుంటే పొద్దుగూకిన వెన్నెల వచ్చి వాలుతుంటే జాజులు దండలుగా  కూరుతుంటే జడ సొంపులు నేలకి  తాకుతుంటే సిగ్గుల్లో  చేరిన  సిగ్గుల మొగ్గ కాళ్ళు  ముగ్గులేస్తుంటే తలుపు జాటున  రెప్పలు  గిటార్లు కొడుతుంటే ఆ  చంద్ర  చంద్రార్కమే ఒకటైతే ఆ దీవులలొ మల్లెలు పాదము మోపితే రసరాజము విరిసిదoటే వెన్నెల వాలిదoటే అరచేతి  అదృష్టం పెళ్లికూతురి పారాణితో తడిసిపోతే మూడుముళ్ల బంధం ముచ్చటగా ముగ్గురై పొయింది. మనోహర బోగ

భయారణ్యం

  భయారణ్యం ఇదే నిజం ఇక్కడ మనుష్యులనుంచి మనుష్యులకే రక్షణ అవసరం వేల సంవత్సరాల పూర్వీకుల నుంచి మనల్ని మనమే  కాపాడుకోవలసిన విపరీత అడవిమార్గం! నలువైపులా సముద్రమున్నా మనుషుల్లో ఆవరించిన అరణ్యాల గురించే ఇన్ని రక్షణ వలయాలు ! 'బారాటాంగ్' అడవుల్లో పెద్ద పెద్ద వృక్షాల  మాటున ఆసక్తిగా చూసే ఆ కళ్ళకి కార్లు, రంగురంగుల బట్టలు అన్నీ భయం కల్గించే వింతలే! విల్లంబులతో ప్రాణాలు కాపాడుకునేవాళ్ళు తేనె పూసిన  కత్తులకేసి అడుగులేందుకు వేస్తారు! సునామీ వచ్చిపోయినంత వేగంగా మాయమైపోతున్న మానవత్వాన్ని వెదుకుంటున్న వెర్రివాళ్ళు తమ పేరు మీద ఏ పథకంలో ఎంతో ఎవరి జేబులో ఎంతో వాళ్ళకేం తెల్సు ఆ మన ఆదివాసీలు అండమాన్ అమ్మ ప్రకృతిలోఒదిగి పర్యావరణాన్ని మనకోసమే కాపాడుతున్నారు వాళ్ళ అడుగుజాడల్ని గుర్తుపట్టగలిగితే మనం ఇంకా మనుషులుగా మిగిలినట్టే భవానీదేవి

హెల్ టవర్

"హెల్" టవర్   పక్షుల్ని వేటాడే తుపాకీ లేకపోయినా జేబులో బుల్లి మారణాయుధంతో ఇప్పుడంతా హంతకులే!! హైవేల కోసం విశాల హృదయంతో చెరువులు, వ్రుక్షాల త్యాగాలు హెల్ టవర్ ప్రకంపనాలకు బుజ్జిపిట్టల హాహాకారాలు వినండి వందల వేల పిట్టల శవాలు చూడండి మానవ కాలుష్యానికి ముక్కులు బెదిరి రెక్కలు చాపి ఎగిరిపోయే వలస పక్షుల విలవిలలు వినండి.. మన చూర్లలో పిచ్చుకలు లేకపోతేనేం తలల మీద లోహ విహంగాలున్నాయి కదా !! అడవులు లేకపోతేనేం రోడ్ల సర్ప పరిష్వంగాలున్నాయి కదా!! ప్రకృతి పారిపోతేనేం వికృతంగా మనం బతికున్నాం కదా!! మనిషికి దూరంగా ప్రకృతి ఒడిలోకి పారిపోయి పరవశించే పిట్టల్ని హెల్ టవర్ నీడల్ని ఇంకా ఇంకా విస్తరిస్తూ తరుముదాం... తనదాకా వచ్చేదాకా... - సి. భావానీ దేవి

నాన్న

॥ నాన్న॥        మలిబడికి తొలిమెట్టు 'నాన్న' బైటి ప్రపంచాన్ని చూపే దివ్య దృష్టి 'నాన్న'   కొడుకు బైక్ కోసం తన సైకిల్ జీవితాన్ని పొడిగిస్తాడు 'నాన్న' కూతురు చలువటద్దాల కోసం పగిలిన అద్దాలలోనుంచే  ఫైళ్ళు చూస్తాడు 'నాన్న' మేఘంలా గర్జిస్తూ కరుకుగా కనబడతాడు 'నాన్న'   తొలకరిజల్లు లాంటి ప్రేమను మదిలో  దాచుకుంటాడు 'నాన్న' పండుగలకి పుట్టినరోజులకి కొత్తబట్టలున్నాయంటాడు 'నాన్న' పిల్లల సంబరాల అంబరంతో మాసికల చొక్కాను కప్పేసుకుంటాడు 'నాన్న' తాను ముళ్ళబాటలో నడిచినా   పిల్లలకి పూలబాటౌతాడు 'నాన్న' అహర్నిశలూ కుటుంబశ్రేయస్సుకే తన జీవితాన్ని అర్పిస్తాడు  'నాన్న' నాన్నంటే నిస్వార్ధానికి మారుపేరని నమ్ముతాను నాన్నంటే 'విశ్వరూపమని' విశ్వానికి ఎలుగెత్తి చాటుతాను.   ...   - @శ్రీ (rvss srinivas)

ఎన్నాళ్ళయిందో లోపలికి ప్రయాణించి

    ఎన్నాళ్ళయిందో లోపలికి ప్రయాణించి రహి పుట్టించే రాగాత్మలో విహరించి టి.వి.లు రేడియోలు, సిస్టమ్స్,సెల్స్ బస్సులు ఆటోలు అన్ని చోట్లా  పాటలు మనోవేదికపై స్తరించేవేన్ని ? పాట వినటం ఒక ధ్యాన ప్రస్తారం ఆలోచన లోచనం విప్పకుండా పెదవి తలుపులకి గడియవేసి ఆసాంతం ఆస్వాదించటమేగా! పాటకీ నాకు కనపడని కంచెలెక్కడివి ? నడకలో శృతి తప్పినా గమకాల్నీ బంధాల్లో మాయమైన  జీవకళని వాణిజ్య గీతాల్లో వెదుక్కునే విఫలయత్నం తడి తపనలు లేని ఎడారిగదిలో పాటకి చోటే లేని ప్రయాణం మనసు పరవశించే పాట వినటానికి ఒకే ఒక ఏకాంతం కోసం లోలోపలికి ప్రయాణిస్తూ ఎన్నేళ్ళయినా ఇలా ఒంటరిగా

చేదుకొండ

చేదుకొండ సి.భవానీ గతం ఇంత బరువా? ఎప్పటి కష్టనష్టాల కుప్ప ఇది? ఆ జ్ఞాపకం బండరాయై గుదిబండ కొండగా నా వీపుమీంచి దిగటంలేదు చూడు? చేదుకొండను మోయటం ఎవరికీ మాత్రం ఇష్టం ? ములైయినా రాయైనా తీసేయాల్సిందే ! గాయాలు కన్నీళ్లు గతం దించిన గుణపాలే కదా! కాల గమనంలో ఇంకా ఇంకా లోతుగా పాతుకుపోతుంటే పెకలించటమెలా? నా గమ్యం ఆ శిఖరమైనపుడు ఇంత బరువును మోసుకుంటూ చేరేదెలా? కొండ అందాలు చూడాలంటే లోయలోంచే లోయలోకి దిగితే కొండ ఆకాశమే! ఏమైనా సరే ఆ కొండెక్కాలి ఉదయించే సూర్యున్ని మొదటగా నేనే చూడాలి కొత్త వెలుగుని కళ్ళనిండా శ్వాసించాలి విషాద కఠినాత్ములు కత్తిరించిన నా బలహీనపు రెక్కల్ని విదిలించుకొని సరికొత్త బలంతో నింగికెగరాలి నాకు నేనే మోపుకున్న నన్ను లాగేస్తున్న ఈ బరువును దింపుకోవటానికి దిక్కుల కెదగాలి.

ఇదెక్కడి న్యాయం?

 ఇదెక్కడి న్యాయం?          -కనకదుర్గ- మహాకవీ! శ్రీ శ్రీ ! మీ జయంతులు, వర్ధంతులు గుర్తు పెట్టుకుని మరీ చేసుకుంటున్నాము. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న వారు మీలాంటి మహాకవులు మళ్ళీ పుట్టాలంటారు, మీరు జీవితకాలం మార్పు కోసం పోరాటం జరిపిన వారే కదా! మీరు రాసిన కవితా సంకలనాలు, మాకోసం ఇచ్చిన గొప్ప ఆయుధాలు, మీ జీవితం ప్రేరణతో,  ఈ ఆయుధాలతో నేటి యువతరం మార్పు కోసం ముందుకు దూకలేదా? సోంబేరి బ్రతుకులకు స్వస్తి చెప్పి పోరాటం చేయలేదా? చదువు చెప్పే ఫ్యాక్టరీలలో తయారయిన గ్రాడ్యుయేట్లు పెద్ద కార్పోరేట్ వుద్యోగాలో, విదేశాలలో సెటిల్ కావడానికో తహ తహ లాడే వారికి, కల్సి కట్టుగా వుండి సమస్యల్ని ఎదిరించి ధైర్యంగా పోరాడడం చేతగాక, అప్పుడు పోరాటం జరిపిన నాయకులు, రచయితలు, మీ లాంటి కవులు, మళ్ళీ పుడితే కానీ ఏ మార్పు సాధ్యం కాదని వాపోతుంటారు. తను, తన చదువు, వుద్యోగం, పెళ్ళి, సంసారం, జీవితంలో పేరు ప్రతిష్టలు సంపాదించడం, పక్కవారికన్నా మన దగ్గర అన్నీ ఎక్కువ వుండాలి అనే తత్వం వున్న వారికి, మీ కవిత్వం వారి ఆలోచనావిధానాన్ని మార్చే చర్నాకోలా కావాలి, ప్రేరణ, స్ఫూర్తి కావాలి, మీరు చూపించిన బాటలో నడవడానికి నడుం కట్టాలి అంతే కానీ మళ్ళీ మిమ్మల్ని పుట్టమనడం ఇదెక్కడి న్యాయం!

కల - నిజం - అబద్దం

  కల - నిజం - అబద్దం (కవిత)                                                    - డా. ఎ. రవీంద్రబాబు    కల... ఓ చేతన ప్రక్రియ  నిత్యం గమ్యం చేర్చలేని అంతఃసంఘర్షణ కావ్యం రచనలోనే కార్యం పుడుతుంది. రాత్రిలోనే ఎప్పుడూ పొద్దుపొడుస్తూ వుంటుంది. ఆకాశం పైన మాత్రమే కాదు అలల ఒడిలో కూడా... ఆరంభం ఎప్పుడూ గుణపాఠాన్నేే వల్లెవేసుకుంటుంది నిర్వచనం జీవితాన్ని అన్వేషించుకుంటుంది వినిర్మాణం చుట్టూఉన్న ప్రాకారాన్ని బద్దులుకొడుతుంది ఏకశిల నదిలో నర్మగర్భితంగా నిదురబోతుంది. ఎడతెగని పుటలు నిత్యం ద్రవిస్తూనే వుంటాయి. ఆకృతులన్నీ మళ్లీ మళ్లీ పురుడు పోసుకుంటూనే వుంటాయి ఎదంతా హాయిగా విరక్తితో నవ్వుకుంటుంది నింగినేల పులకించే వేళ హృదయం మరోసారి జన్మిస్తుంది వెన్నెలను దగ్గరకు తీసుకొని కథన కుతూహల రాగాన్ని ఆలపిస్తంది ఎవ్వరూ పలకరు, ఏ ఆశ్వాదనా దరిచేరదు ఏకాంతాన్ని సైతం జ్ఞాపకం స్పర్శిస్తూనే వికటాట్టహాసం చేస్తుంది అప్పుడిక ఎవరికివారే ఒంటరిగా యుద్ధానికి సిధ్దం కావాలి నిశీధిలో నిట్టూర్పులను ఆరగిస్తూ అలా... అలా... నడుచుకుంటూనే సాగాలి ఎంత దూరమైనా సరే... అప్పుడిక ప్రపంచం తనను తాను పునర్లిఖించుకుంటుంది.                            పుర్లిఖించుకుంటూనే ఉంటుంది.