ఎన్నాళ్ళయిందో లోపలికి ప్రయాణించి

 

 

ఎన్నాళ్ళయిందో లోపలికి ప్రయాణించి
రహి పుట్టించే రాగాత్మలో విహరించి
టి.వి.లు రేడియోలు, సిస్టమ్స్,సెల్స్
బస్సులు ఆటోలు అన్ని చోట్లా  పాటలు
మనోవేదికపై స్తరించేవేన్ని ?

పాట వినటం ఒక ధ్యాన ప్రస్తారం
ఆలోచన లోచనం విప్పకుండా
పెదవి తలుపులకి గడియవేసి
ఆసాంతం ఆస్వాదించటమేగా!

పాటకీ నాకు కనపడని కంచెలెక్కడివి ?
నడకలో శృతి తప్పినా గమకాల్నీ
బంధాల్లో మాయమైన  జీవకళని
వాణిజ్య గీతాల్లో వెదుక్కునే విఫలయత్నం

తడి తపనలు లేని ఎడారిగదిలో
పాటకి చోటే లేని ప్రయాణం
మనసు పరవశించే పాట వినటానికి
ఒకే ఒక ఏకాంతం కోసం
లోలోపలికి ప్రయాణిస్తూ
ఎన్నేళ్ళయినా ఇలా ఒంటరిగా