భయారణ్యం
posted on Jul 14, 2014
భయారణ్యం
ఇదే నిజం
ఇక్కడ మనుష్యులనుంచి
మనుష్యులకే రక్షణ అవసరం
వేల సంవత్సరాల పూర్వీకుల నుంచి
మనల్ని మనమే కాపాడుకోవలసిన
విపరీత అడవిమార్గం!
నలువైపులా సముద్రమున్నా
మనుషుల్లో ఆవరించిన అరణ్యాల గురించే
ఇన్ని రక్షణ వలయాలు !
'బారాటాంగ్' అడవుల్లో
పెద్ద పెద్ద వృక్షాల మాటున
ఆసక్తిగా చూసే ఆ కళ్ళకి
కార్లు, రంగురంగుల బట్టలు
అన్నీ భయం కల్గించే వింతలే!
విల్లంబులతో ప్రాణాలు కాపాడుకునేవాళ్ళు
తేనె పూసిన కత్తులకేసి
అడుగులేందుకు వేస్తారు!
సునామీ వచ్చిపోయినంత వేగంగా
మాయమైపోతున్న మానవత్వాన్ని
వెదుకుంటున్న వెర్రివాళ్ళు
తమ పేరు మీద ఏ పథకంలో ఎంతో
ఎవరి జేబులో ఎంతో
వాళ్ళకేం తెల్సు
ఆ మన ఆదివాసీలు
అండమాన్ అమ్మ ప్రకృతిలోఒదిగి
పర్యావరణాన్ని మనకోసమే కాపాడుతున్నారు
వాళ్ళ అడుగుజాడల్ని గుర్తుపట్టగలిగితే
మనం ఇంకా మనుషులుగా మిగిలినట్టే
భవానీదేవి