మేడారం జాతర..సీఎం తో చిరంజీవి
Publish Date:Feb 1, 2012
Advertisement
వరంగల్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కనబడుతోంది. వరంగల్ జిల్లా మేడారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్, మంత్రి రామచంద్రయ్యతోపాటు చిరంజీవిని కూడా వెంటబెట్టుకెళ్లారు. ఈ వ్యవహారం చూస్తుంటే చిరంజీవికి సీఎం కిరణ్ ప్రాధాన్యతనిస్తూ, చిరు వర్గానికి మరింత చేరువై, బొత్సను డమ్మీ చేయాలన్న వ్యూహరచన చేస్తున్నట్లు కనబడుతోంది. ఇటీవలే చిరంజీవి కోరిక మేరకు ఎంతటి వ్యతిరేకత ఎదురైనప్పటికీ చిరు వర్గంలోని ఇద్దరికి మంత్రి పదవులను కట్టబెట్టారు. అదేవిధంగా నిన్న సమాచార హక్కు కమిషనర్ల నియామకంలో కూడా చిరంజీవి చెప్పిన విజయనిర్మలకు పదవి ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవిల మధ్య గ్యాప్ తగ్గి మెల్లగా పీసీసి చీఫ్ బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టేలా కనిపిస్తోంది. నిజానికి తమ మధ్య ఎటువంటి గ్రూపులు లేవని అటు బొత్స ఇటు కిరణ్ కుమార్ రెడ్డి చెపుతున్నప్పటికీ, ఇరువురి మధ్య కొంత గ్యాప్ ఉన్నదనీ, చిరు వర్గం బొత్సతో సఖ్యతగా ఉంటుందన్న వాదనలున్నాయి.
కాగా, ముఖ్యమంత్రి తులాభారంతో అమ్మవార్లకు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. 78 కిలోలు తూగిన ముఖ్యమంత్రి అంత బంగారాన్ని అమ్మవారికి సమర్పించారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి 81.5 కిలోలు తూగారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనలో మేడారంలో అపశృతి చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం కిరణ్ పట్టుకు వెళుతున్న పట్టు వస్త్రాలు ఆయన చేతిలో నుండి జారి కింద పడ్డాయి. అయితే సిఎం చేతిలో నుండి కాకుండా అధికారుల చేతిలో నుండి పడ్డాయని మరికొందరు చెబుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య సారలమ్మలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కాగా అంతకుముందు మేడారం బయలుదేరే ముందు ముఖ్యమంత్రి జైళ్ల శాఖ డ్యూటీ మీట్లో మాట్లాడారు. ఈ మీట్‌కు పదహారు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ... శిక్షార్హులు అందరూ తప్పు చేసిన వారు కాదన్నారు. కొందరు క్షణికావేశంలో తప్పులు చేసిన వారు కూడా ఉన్నారన్నారు.
http://www.teluguone.com/news/content/warangal-24-11515.html





