ఖాకీ వెనుక ఓ సామాజిక యోధుడు..హైదరాబాద్ కొత్త సీపీ మహేష్ భగవత్ ప్రస్థానం.!
Publish Date:Nov 13, 2026
Advertisement
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఐపీఎస్ అధికారి..పోలీస్ అంటే కేవలం నేరస్తులను పట్టుకోవడం, శాంతిభద్రతలను కాపాడటమే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం.. అణగారిన వర్గాలకు భరోసా కల్పించడం కూడా పోలీస్ బాధ్యతేనని తన సేవలతో నిరూపించిన అధికారి మహేష్ మురళీధర్ భగవత్. మానవ అక్రమ రవాణాపై పోరాటం నుంచి బాల కార్మికుల విముక్తి వరకు.. అంతర్జాతీయ అవార్డుల నుంచి భావితరాల సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం వరకు ఆయన ప్రస్థానం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. ఇప్పుడు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన జీవిత ప్రయాణం ఆసక్తికరంగా మారింది. రాచకొండ తొలి సీపీగా ప్రత్యేక ముద్ర..! 1995 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ పోలీస్ శాఖలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాచకొండ తొలి పోలీస్ కమిషనర్‌గా సుమారు ఆరున్నరేళ్ల పాటు పనిచేసి తనదైన ముద్ర వేశారు. అనంతరం అదనపు డీజీపీ హోదాలో సీఐడీ, రైల్వే, రోడ్డు భద్రత విభాగాల్లో సేవలందించారు. 2024 జూలై 10 నుంచి డీజీపీ, లా అండ్ ఆర్డర్ బాధ్యతలు నిర్వహించిన ఆయన.. తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.! మహేష్ భగవత్ పోలీస్ ప్రస్థానంలో అత్యంత కీలకమైన అధ్యాయం మానవ అక్రమ రవాణా నిరోధం. మహిళలు, చిన్నారులను అక్రమంగా తరలించే ముఠాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2004 నుంచి 2022 వరకు 2 వేల మందికి పైగా మహిళలు, చిన్నారులను అక్రమ రవాణా ముఠాల చెర నుంచి విడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇది కూడా చదవండి: మీ తాత గ్రేట్.. మా తాత గ్రేట్: విశాఖ వేదికగా లోకేష్, ఉపాసనల ఆసక్తికర సంభాషణ.! ఇటుక బట్టీలు, ప్రమాదకర పరిశ్రమల్లో వెట్టి చాకిరీకి గురవుతున్న 7 వేల మందికి పైగా బాల కార్మికులు, బాధితులకు విముక్తి కల్పించడంలోనూ విశేష కృషి చేశారు. బాధితుల కన్నీళ్లు తుడవడమే కాకుండా.. నిందితులకు శిక్ష పడేలా పోరాడటం ఆయన సేవల్లో ప్రత్యేకత. రాష్ట్రపతి నుంచి అమెరికా ప్రభుత్వం వరకు అవార్డులు.! మహేష్ భగవత్ సేవలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు లభించాయి. 2004లో రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీస్ మెడల్‌తో పాటు అమెరికాలోని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ నుంచి కమ్యూనిటీ పోలీసింగ్ అవార్డును అందుకున్నారు. 2006లో వెబర్ సావీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ రైట్స్ అవార్డులు దక్కాయి. 2011లో రాష్ట్రపతి మెరిటోరియస్ సర్వీస్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 2016లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచి ప్రశంసా పత్రం అందుకున్నారు. 2017లో అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించే ప్రతిష్ఠాత్మక 'ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ హీరో అవార్డు'కు ఎంపికయ్యారు. 2018లో IACP సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ అవార్డు, 2022లో FICCI స్మార్ట్ పోలీసింగ్ అవార్డుతో పాటు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ మెడల్ అందుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత పోలీస్‌కు గుర్తింపు.! 2017లో అమెరికా ప్రభుత్వం అందించే 'ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ హీరో అవార్డు' మహేష్ భగవత్‌కు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. మానవ అక్రమ రవాణా నిరోధంలో ప్రపంచవ్యాప్తంగా విశేష కృషి చేసిన నాయకుల్లో ఒకరిగా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ అవార్డు అందుకున్న తొలి మరాఠీ ఐపీఎస్ అధికారిగా, మూడో భారతీయుడిగా ఆయన ప్రత్యేకత సాధించారు. 2017 జూన్ 27న వాషింగ్టన్‌లో ఈ అవార్డును ప్రకటించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సమక్షంలో జరిగిన కార్యక్రమం ఈ గుర్తింపునకు మరింత ప్రాధాన్యత తెచ్చింది. రచయితగా.. పరిశోధకుడిగా మరో కోణం.! పోలీసు అధికారిగా క్షేత్రస్థాయిలో పనిచేయడమే కాకుండా.. మానవ అక్రమ రవాణా నిరోధంపై అధ్యయనం, పరిశోధన రంగాల్లోనూ మహేష్ భగవత్ తనదైన పాత్ర పోషించారు. ఐక్యరాజ్యసమితికి చెందిన UNODC, కేంద్ర హోంశాఖ ప్రచురించిన ఎనిమిది పుస్తకాల రూపకల్పనలో సహకరించారు. ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన 'సినర్జీ బిట్వీన్ స్టేక్‌హోల్డర్స్' పుస్తకం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)లో మానవ అక్రమ రవాణా నిరోధక సర్టిఫికెట్ డిప్లొమా కోర్సుకు రిఫరెన్స్ మెటీరియల్‌గా ఉపయోగపడుతోంది. వియన్నాలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సదస్సులో పాల్గొనడంతో పాటు, అమెరికాలో ఉగ్రవాద నిరోధక అంశాలపై శిక్షణ పొందారు. జాతీయ పోలీస్ అకాడమీతో పాటు వివిధ రాష్ట్రాల్లో పోలీస్ అధికారులకు శిక్షణ అందించారు. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శి.! మహేష్ భగవత్‌లో మరో ప్రత్యేక కోణం ఉంది. పోలీస్ అధికారిగా తన విధులకే పరిమితం కాకుండా.. భావితరాల పరిపాలనా అధికారులను తీర్చిదిద్దడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. గత పదేళ్లుగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఇప్పటివరకు 2 వేల మందికి పైగా IAS, IPS, IFS, ఫారెస్ట్ సర్వీస్, CAPF అధికారులుగా ఎంపిక కావడంలో ఆయన మార్గదర్శకత్వం ఉపయోగపడింది. UPSC 2023లో AIR-1 సాధించిన ఇషితా కిషోర్, 2024లో AIR-3 సాధించిన దోనూరు అనన్యారెడ్డి వంటి ప్రతిభావంతులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. 2025లో AIR-2 సాధించిన హర్షిత్ గోయల్‌తో పాటు మరో 220 మందికి ఇంటర్వ్యూ శిక్షణ అందించారు. 2026 UPSC ఫలితాల్లో AIR-3, 4, 6, 7 ర్యాంకర్లు సహా మొత్తం 960 మంది ఎంపికైన అభ్యర్థుల్లో 320 మందికి తాను, తన బృందం మార్గదర్శకత్వం అందించినట్లు వివరించారు. హైదరాబాద్ పోలీసింగ్‌పై కొత్త బాధ్యతలు.! హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా డాక్టర్ మహేష్ మురళీధర్ భగవత్, ఐపీఎస్ ఈరోజు (13.11.2026) ఉదయం 11:00 గంటలకు బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TG ICCC) భవనంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మానవ అక్రమ రవాణా నిరోధం, మహిళలు, చిన్నారుల భద్రత, నేర నియంత్రణ, కమ్యూనిటీ పోలీసింగ్.. ఇలా విభిన్న రంగాల్లో అనుభవం సంపాదించిన మహేష్ భగవత్ ఇప్పుడు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన అధికారి నగర పోలీస్ బాస్‌గా రావడంతో ఆయన అనుభవం, నాయకత్వంపై ఆసక్తి నెలకొంది. ఖాకీ దుస్తుల వెనుక కఠినమైన పోలీస్ అధికారి మాత్రమే కాదు.. బాధితులకు అండగా నిలిచే మానవతావాది, యువతకు దిశానిర్దేశం చేసే గురువు, సామాజిక మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి కూడా ఉన్నారు. నేరాలపై పోరాటంతో పాటు సమాజానికి సేవ చేయడమే పోలీస్ బాధ్యతలో భాగమని మహేష్ భగవత్ ప్రస్థానం చాటిచెబుతోంది. మీకు నచ్చవచ్చు: హైదరాబాద్ పోలీస్ బాస్ మార్పు.. సజ్జనార్ స్థానంలో మహేశ్ భగవత్.! మీకు నచ్చవచ్చు: సజ్జనార్ యూనిఫామ్‌లో ఉన్న క్రిమినల్..సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.! [ CP Mahesh Bhagwat, Hyderabad Police Commissioner, Human Trafficking, Anti Human Trafficking, Rachakonda Police, UPSC Mentorship ]
కేవలం బాధితులను రక్షించడంతోనే ఆయన బాధ్యత ముగియలేదు. వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడం, పునరావాసం కల్పించడం, అక్రమ రవాణా ముఠాలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేయడం వంటి అంశాలపైనా ప్రత్యేక శ్రద్ధ చూపారు.
http://www.teluguone.com/news/content/cp-mahesh-bhagwat-24-237018.html




