జగన్ కు షాక్.. బెయిల్ కేసులో ట్విస్ట్.. రచ్చబండ రచ్చ.. టాప్ న్యూస్@7PM
Publish Date:Dec 27, 2021
Advertisement
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ కొనసాగించింది. సీఎం హోదాలో వైఎస్ జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు రఘురామ లాయర్. జగన్ కు నోటీసులు పంపాలని కోరారు. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ పై మీ వైఖరి ఏమిటి? అని సీబీఐని ప్రశ్నించింది ధర్మాసనం. గతంలో జగన్ కు బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిందని, అప్పటినుంచి ఇప్పటివరకు పరిస్థితి సాధారణంగానే ఉందని సీబీఐ జవాబిచ్చింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు ప్రకటించింది.
------
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 53, 54లను వ్యతిరేకిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు... ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల ఫీజులను మీరెలా నిర్ణయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిబంధనలు, చట్టాలకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చారని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ స్కూలు, జూనియర్ కాలేజీ అభిప్రాయాలను తీసుకున్నాకే ఫీజులు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
------
ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజలు వైసీపీ దరిద్రాన్ని తెచ్చి నెత్తినపెట్టుకున్నారని, అందుకే రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారైందని పేర్కొన్నారు. రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిన ఇలాంటి వేళ పరిస్థితులను చక్కదిద్దగలిగిన నేత చంద్రబాబు మాత్రమేనని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు వంటి సమర్థుడైన నేత ఇప్పుడెంతో అవసరం అని నొక్కిచెప్పారు.
------
సినిమా టికెట్లపై హీరో నాని చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలని నిర్మాత దిల్ రాజు అన్నారు. తన సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో నాని చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడిన తర్వాత రిలీజైన సినిమా తమదేనని... నాని, తన కాంబినేషన్లో వచ్చిన 'వి' సినిమా అని చెప్పారు. నాని ఏం చెప్పాడనేది అందరూ ఆయన మనసుల్లోకి వెళ్లి చూడాలని, అప్పుడే ఆయన బాధ ఏమిటో అర్థమవుతుందని అన్నారు.
-----
తన హత్యకు కుట్ర జరుగుతోందని, రెక్కీ కూడా నిర్వహించారని వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై రాధా పెదనాన్న కుమారుడు వంగవీటి నరేంద్ర తీవ్రంగా స్పందించారు. తన తమ్ముడి జోలికి వస్తే వాళ్ల అంతు చూస్తానని హెచ్చరించారు.విభేదాలు రాజకీయాల వరకేనని, కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని భావిస్తున్నానని తెలిపారు. రాధాకు వ్యతిరేకంగా ఎవరు కుట్ర పన్నినా మొదట తనను ఎదుర్కోవాల్సి ఉంటుందని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు.
-------
చివరి గింజ వరకు పంటను కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్‌ఎస్‌లు డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలకు బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల వైఖరే కారణమన్నారు. రైతుల వరి పంటను కొనుగోలు చేయబోమన్న సీఎం కేసీఆర్.. తన ఫామ్‌హౌస్‌లో వరి పంట ఎందుకు వేశారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
--------
2009లో కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన దీక్షపై ఖమ్మం డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్‌ను బయటపెడతానని, దీక్ష సమయంలో బాత్రూంలో ఇడ్లీలు తిన్న చరిత్ర సీఎం కేసీఆర్‌దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దీక్ష పేరుతో ఢిల్లీ పోయి తాగిపడుకున్నాడని దెప్పిపోడిశారు. దొంగ దీక్షలు ఎలా చెయ్యాలో.. కేటీఆర్ తన తండ్రిని అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ మోసగాడన్న విషయాన్ని మేధావివర్గం తెలుసుకోలేకపోయిందన్నారు
------
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను పిరికిపందతో ఈటల పోల్చారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ దీక్షలో ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దించటానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి కుప్పకూలితే టీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చే ఆసార్కం లేదని జోస్యం చెప్పారు. బియ్యం కొనమని చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదన్నారు.
---------
అమెరికా తెలుగు సమాజంలో తీవ్ర విషాదం నెలకొంది. లాస్ ఏంజెలిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ టీనేజర్లు మృతి చెందారు. మరణించిన వారిని అక్షరా రెడ్డి, అర్జిత్ రెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ తోబుట్టువులు. తెలంగాణలోని జనగామ జిల్లా బండ్లగూడెంకు చెందిన చెట్టిపెల్లి రామచంద్రారెడ్డి రెండు దశాబ్దాల కిందట మెరుగైన అవకాశాల కోసం అమెరికా వెళ్లారు. కుటుంబంతో కలిసి లాస్ ఏంజెలిస్ లోనే స్థిరపడ్డారు.
------
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి షాకిచ్చింది ఆప్. చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా జయకేతనం ఎగురవేసింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 35 స్థానాలు ఉండగా... అందులో 14 స్థానాలను ఆప్ కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఇప్పుడు 12 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లలో విజయం సాధించగా శిరోమణి అకాళీదల్ ఒక్క స్థానంలో గెలిచింది.
-----
అమెరికాలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు సగటున రోజుకు 1,90,000 నమోదయ్యాయి. న్యూయార్క్ లో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కోవిడ్ సంబంధిత కేసులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఆసుపత్రుల్లో చేరిన 18 ఏళ్ల లోపు వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. వీరిలో దాదాపు సగం మంది ఐదు సంవత్సరాలలోపు వారే.
---
http://www.teluguone.com/news/content/top-news-39-129170.html





