దాడిని ఖండించకుండా యూట్యూబ్ చానెళ్లపై నిందలా! అల్లం నారాయణపై జర్నలిస్టుల గుస్సా..
Publish Date:Dec 27, 2021
Advertisement
యూట్యూబ్ చానెళ్ల గురించి ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ ఇచ్చిన స్టేట్ మెంట్ రచ్చ రాజేస్తోంది. జర్నలిస్టు సంఘాల నుంచి అల్లం ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చానెల్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించకుండా.. జర్నలిస్టులను తప్పుపడుతూ ప్రకటన చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జర్నలిస్టుగా సుదీర్ఘ కాలం పని చేసిన అల్లం.. ఇప్పుడు జర్నలిస్టులను టార్గెట్ చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ పేరిట వాడుతున్న భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైందని, దీనిని ఎవరూ అంగీకరించరంటూ అల్లం నారాయణ వీడియో సందేశం ఇచ్చారు. రాజకీయ విధానాల మీద కాకుండా కుటుంబ సభ్యులను వివాదాలకు లాగుతున్న ప్రయత్నాలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. అసలు ఇది జర్నలిజమే కాదని నిప్పులు చెరిగారు. ఈ భాష జర్నలిస్టులు వాడదగినది కాదని.. పత్రికా స్వేచ్ఛ పేరిట ఇదొక అన్యాయమైన అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. యూట్యూబ్ ఛానళ్ల పేరిట సోషల్ మీడియాలో చలామణి అవుతున్న చాలామంది ప్రాథమికంగా జర్నలిస్టులు కాదని అల్లం తెలిపారు. యూ ట్యూబ్ ఛానెళ్ల గురించి అల్లం నారాయణ చేసిన ఈ కామెంట్లే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. జర్నలిస్టుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. జర్నలిస్ట్ సంఘం నేతగా పని చేసిన అల్లం నారాయణ.. జర్నలిస్టును కించపరిచేలా మాట్లాడారనే విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ మీడియా కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఆ సమయంలో మీడియా సంస్థలకు అండగా నిలిచాయి జర్నలిస్ట్ సంఘాలు. అల్లం నారాయణ కూడా దాడులను ఖండించారు. నిరసనల్లో కూడా పాల్గొన్నారు. కొన్ని సార్లు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. గతంలో మీడియాపైనా, జర్నలిస్టులపైనా ఎక్కడా దాడి జరిగినా.. వాళ్లకు అండగా పోరాడేవారు అల్లం నారాయణ. గతంలో జర్నలిస్టుల కోసం ప్రశ్నించిన అల్లం నారాయణ.. ఇప్పుడు యూట్యాబ్ చానెల్ జర్నలిస్టులను కించపరిచేలా మాట్లాడటంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మీడియా కమ్యూనిటీ తీవ్ర ఆగ్రహం వ్వక్తం చేస్తోంది. జర్నలిస్ట్ నేతగా పని చేసిన అల్లం.. యూట్యూబ్ చానెళ్లపై ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు. ప్రభుత్వ పెద్ల మెప్పు కోసం జర్నలిస్టులను అవమానించేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. యూట్యూబ్ ఛానెళ్లు, జర్నలిస్టుల గురించి తాను మాట్లాడిన మాటలను వెంటనే అల్లం నారాయణ వెనక్కి తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులు కోరుతున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెబుతున్నారు. జర్నలిస్టులను బద్నాం చేసే కంటే.. వాళ్ల సంక్షేమంపై దృష్టి పెడితే ప్రెస్ అకాడమీ చైర్మెన్ గా అల్లం నారాయణకు మంచి పేరు వస్తుందని సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/journalists-fire-on-allam-narayana-over-his-comments-on-youtube-channels-39-129165.html





