ఏపీలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల ప్రణాళిక : మంత్రి లోకేష్
Publish Date:Apr 15, 2026
Advertisement
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై తిరుపతి స్పోర్ట్స్ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 3,132 కి.మీల మేర యువగళం పాదయాత్ర చేపట్టినపుడు యువత ఆశలు, ఆకాంక్షలు తెలిశాయన్నారు. రాయలసీమను స్పోర్ట్స్ హబ్ గా చేస్తానని ఇచ్చిన హామీ త్వరలో కార్యరూపం దాల్చుతుందన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏం చేయాలనే విషయమై గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద 421మందికి పైగా ఉద్యోగాలు సాధించారని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నుంచి వచ్చిన ఉపాధ్యాయుల ప్రతిభను క్రీడారంగ అభివృద్ధికి ఉపయోగించుకుంటామన్నారు. సీఎం చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్‌లో స్పోర్ట్ విలేజ్ ఏర్పాటైందన్నారు. ఇక్కడ నుంచే జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు వచ్చారని తెలిపారు. 90రోజుల యాక్షన్ ప్లాన్ లో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి వరల్డ్ క్లాస్ బెస్ట్ మెకానిజం తయారుచేద్దామని పిలుపునిచ్చారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలియజేశారు. తిరుపతిలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో శాప్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన క్రికెట్ మైదానం చాలా బాగుందని, దీని నిర్వహణకు కార్పొరేట్ కంపెనీల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని తమ ప్రతిభతో రాణిస్తోన్న జ్యోతి యర్రాజీ, శ్రీచరణి వంటి మహిళా క్రీడాకారిణులకు చేయూత నందిస్తామని తెలిపారు. ఫిట్నెస్ మెరుగుపరిచే చర్యలు చేపడతాం రాష్ట్రంలోని బాలలకు ఫిట్ నెస్ లేకపోవడం క్రీడల్లో వెనుకబాటుకు ప్రధాన కారణంగా గుర్తించామన్నారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ చర్యలతోపాటు తల్లిదండ్రుల సహకారం అవసరం అన్నారు. వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థీకృతంగా క్రీడాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి గ్రోత్ కారిడార్ల పరిధిలో క్రీడారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారుచేస్తున్నామని వెల్లడించారు. క్రీడాకారులకు ఉద్యోగాల భర్తీలో న్యాయం జరిగేలా పారదర్శకత పాటిస్తున్నామన్నారు. క్రీడాకారులు అభిప్రాయాలన్నింటినీ డాక్యుమెంటేషన్ చేసి, 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ భేటీలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, షట్లర్ పివి సింధు, అర్జున అవార్డు గ్రహీత కరణం మల్లీశ్వరి, అథ్లెట్ యర్రాజీ జ్యోతి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ నమ్మాళ్వార్, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్), పంగి కరుణ కుమారి (బ్లైండ్ క్రికెట్), ముసునూరి రోహిత్ లలిత్ బాబు (చెస్), షేక్ అర్షద్ (పారా సైక్లింగ్), కిల్లాక లలిత (పారా అథ్లెటిక్స్), తమిరి సూర్య చరిష్మ (బ్యాడ్మింటన్), తిరుమూరి గణేష్ మణిరత్నం (ఆర్చరీ), దండు పూజ (బ్యాడ్మింటన్), పి.శివారెడ్డి (ఖోఖో), ఇ. రజని (హాకీ), నవ్య కండేరి (బ్యాడ్మింటన్), కె.ద్వారకనాథ్ రెడ్డి (బాస్కెట్ బాల్), శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/tirupati-sports-stadium-36-217427.html





