మీసేవ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
Publish Date:Apr 15, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. ముఖ్యంగా నగరంలోని ఖైరతాబాద్, అంబర్పేట, అల్వాల్ ప్రాంతాల్లో ఉన్న మీసేవ కేంద్రాల్లో ఈరోజు ఉదయం నుంచే ఏసీబీ అధికారుల తనిఖీలు ప్రారంభమయ్యాయి. పౌర సేవలకు సంబంధించిన ముఖ్య పత్రాల జారీ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఏసీబీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. మీసేవ కేంద్రాలకు వచ్చే ప్రజల నుంచి దళారుల ద్వారా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నా రనే ఫిర్యాదులు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. సాధారణంగా తక్కువ ఫీజుతో అందాల్సిన సేవలకు అనవసరంగా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే పలు కేంద్రాల్లో పత్రాలు, కంప్యూటర్ రికార్డులు, నగదు లావాదేవీల వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. తనిఖీల సమయంలో అనుమానాస్పద లావా దేవీలకు సంబంధించిన పత్రాలు, రసీదులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కొన్ని కేంద్రాల్లో మధ్యవర్తుల పాత్రపై ప్రత్యేకంగా దృష్టి సారించిన అధికారులు, సిబ్బంది నుంచి వివరణలు కూడా తీసుకుంటున్నారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందేలా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ఈ సోదాలు రాష్ట్రంలోని ఇతర మీసేవ కేంద్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/acb-checks-at-meeseva-offices-36-217440.html





