Top Stories

హాం ఫట్.. అధికారుల భూమ్ ఫట్

  అవినీతి అనగానే రాజకీయ నాయకులే గుర్తొస్తారు. అందులోనూ ప్రభుత్వ భూముల ఆక్రమణ,అంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అయ్యే పని కాదని అనుకుంటాము, కానీ, అది సంపూర్ణ సత్యం కాదు. రాజకీయ నాయకులలో ఎక్కడో అక్కడ ఒకరో ఇద్దరో నిజాయతీ పరులు ఉన్నట్లుగానే, ప్రభుత్వ అధికారులలోనూ, ప్రభుత్వ భూములను ఇతరత్రా భూమలను అక్రమంగా సొంత చేసుకోగల సమర్ధులు ఉంటారు.ఉన్నారు.అంతే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  అవినీతి గ్రాఫ్’ కు పార్లర్’గా అవినీతి అధికారుల గ్రాఫ్’కూడా పెరుగుతోందని’ అధికార వర్గాల్లోనే వినిపిస్తోంది.నిజానికి ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేరు అంటారు, కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సార్ల భూదందా, అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే వుంది. సంచలనం అవుతోంది.  ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం పరిధిలోని భూదాన్ భూములకు సంబంధించి సంచలనమ మారిన వివదాన్నే తీసుకుంటే, తెలంగాణ హై కోర్టు ఈ కేసులో చాలా కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈ కేసులో, ఆరోపణలు ఎదుర్కుంటున్న వారంతా, ఉన్నత స్థానాల్లో ఉన్న,ఉన్నతాదికారులని,అలాగే, వారిపై  రోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. రాష్ట్ర హై కోర్టు ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసిందంటే, పెద్ద సార్లు, భూదందాలో ఎంతటి సమర్ధులో  వేరే చెప్ప నక్కర లేదు. అంతే కాదు, రాష్ట్ర హై కోర్టు’ రాష్ర వ్యాప్తంగా భూదాన భూముల దురాక్రమణలు, అక్రమాల పై విచారణ జరిపి నిజాలను నిగు తేల్చేందుకు సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఇందుకు సంస్థ సంసిద్ధంగా ఉందా, లేదా తెలియచేయాలని సిబిఐకి నోటీసులు జారీ చేసింది.అంతే కాదు, ఈ భూముల్లో అక్రమాలు జరిగాయని, పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపవద్దని స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వంతో పాటు ఇడి, సిబిఐ, పిటిషన్‌లో పేర్కొన్న అధికారులు,వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. మహేశ్ అనే వ్యక్తి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,వారి కుటుంబసభ్యులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది.  పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, భూదాన్ బోర్డుకు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేలాలంటే సిబిఐ లేదా ఇడి వంటి స్వతం త్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ అం శంపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు.తదుపరి విచారణను హైకోర్టు జూన్ 26కు వాయిదా వేసింది. భూములకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగాయనే అభియోగాలపై విచారణకు ముగ్గు రు సభ్యులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, రఘునందన్‌రావు, శశాంక్‌లతో కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పింది.  నాగారం గ్రామంలోని సర్వే నెం.181,182లో 103.22 ఎకరాల భూదాన్ భూముల అక్రమాలపై కూడా అదే కమిటీ విచారిస్తున్నదని గతంలోనే హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది.అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అక్రమ సంపాదనతో, బినామీ పేర్లతో  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పెద్ద సార్లు ఐఎఎస్,ఐపీఎస్’లు,ఉన్నారని,అంటున్నారు. అవునుమ నలుపును తెలుపు చేసుకునేందుకు, కాకుంటే, గుట్టుచప్పుడు కాకుండా దోచిన సొమ్ములను దాచుకునేదుకు పెద్ద సార్లు,రియల్ వ్యాపారాన్ని నమ్ముకునారని అంటారు. నిజానికి బయటకు వస్తున్నది, చాలా తక్కువ అంటున్నారు. విశాఖ, విజయవాడ, హైదరాబద్’ సహా అనేక ప్రధాన నగరాలు, పట్టణాలలో, కొండకచో ఇతర రాష్ట్రాల్లోనూ, పెద్ద సార్లు రియల్’ దందాను దిగ్విజయంగా నడుపుతున్నారనే ఆరోపణలకు కొదవ లేదు. అయితే, అంతిమంగా ఏమి జరుగుతుంది, ఆవినీతికి సంకెళ్ళు పడతాయా అంత అనుమానమే అంటున్నారు
హాం ఫట్.. అధికారుల భూమ్ ఫట్ Publish Date: Apr 25, 2025 10:06PM

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపండి : సీఎం రేవంత్ రెడ్డి

  పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రవాద చర్యలను ఖండించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారని ఆయన తెలిపారు.ఇందిరాగాంధీని వాజ్ పేయి దుర్గామాతతో పోల్చారని ఆయన పేర్కొన్నారు. దుర్గామాత భక్తుడైన ప్రధాని మోదీ ఉగ్రమూకలకు గట్టి జవాబు చెప్పాలని ముఖ్యమంత్రి కోరారు.ఈ శాంతి ప్రదర్శన పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ట్యాంక్‌బండ్‌పై ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో బాధితులకు సంఘీభావం తెలపాలని, ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్య నేతలు సమావేశమై చర్చించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో శాంతియుత నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపండి : సీఎం రేవంత్ రెడ్డి Publish Date: Apr 25, 2025 9:18PM

వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్‌ అఫిడవిట్‌

  వక్ఫ్‌ సవరణ చట్టంను సమర్థిస్తూ మోదీ సర్కార్  సుప్రీంకోర్టు లో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా కేంద్రం కౌంటర్‌ అఫిడవిట్‌ వేసింది. ఈ చట్టం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ చట్టంలో చేసిన పలు సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులను హరిస్తాయనే తప్పుడు ప్రాతిపదికపై పిటిషన్లు ఉన్నాయని ఆరోపించింది. ఆర్టికల్‌ 32 ప్రకారం ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు సమీక్షించవచ్చని తెలిపింది. కాకపోతే పార్లమెంటరీ ప్యానెల్ ద్వారా సమగ్రమైన, లోతైన, విశ్లేషణాత్మక అధ్యయనం అనంతరమే వక్ఫ్‌ చట్టానికి సవరణలు చేశామని తెలిపింది. గతంలో ఉన్న నిబంధనలతో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం జరిగిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.  ఈ మేరకు 1332 పేజీలతో దాఖలు చేసిన ప్రాథమిక కౌంటర్‌ అఫిడవిట్‌లో ఈ చట్ట సవరణలను సమర్థించుకుంది. 2013 తర్వాత ఆశ్చర్యకరంగా వక్ఫ్‌ భూమి భారీగా పెరిగిందని పేర్కొంటూ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ షేర్షా సీ షేక్ మొహిద్దీన్ అఫిడవిట్ దాఖలు చేశారు. వక్ఫ్‌ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ 72 పిటిషన్లు దాఖలు కాగా.. వాటిపై ఏప్రిల్‌ 17న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ముందు దీనిపై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం అయితే అప్పటివరకు వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది.  
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్‌ అఫిడవిట్‌ Publish Date: Apr 25, 2025 8:02PM

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..అమరావతి నిర్మాణ పనులపై చర్చ

  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. కేంద్ర నిర్ణయానికి కూటమి ప్రభుత్వం మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సుమారు రూ. లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌మ్యాప్‌ తయారు చేసింది.వెలగపూడి సచివాలయం వెనక అమరావతి పునఃప్రారంభ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అదే రోజు రోడ్‌షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దాదాపు 30 వేల మంది పాల్గొంటారని అంచనా. రూ.లక్ష కోట్ల పనుల ప్రారంభ సూచికగా ప్రధాని మోదీ.. పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ప్రధానితో భేటీ సమయంలో అమరావతి, ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.  వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా అమరావతి పునర్నిర్మాణానికి అవసరమైన తోడ్పాటును అందించాలని ప్రధానిని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సహకరించాలని ఆయన కోరారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యేందుకు అంగీకరించారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే రోజున దాదాపు 30 వేల మందితో ఒక రోడ్‌షో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..అమరావతి నిర్మాణ పనులపై చర్చ Publish Date: Apr 25, 2025 7:47PM

పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం

  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పిఠాపురంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిందని తమ ప్రభుత్వం మాట ఇస్తే నెరవేరుస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్  అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతు ప్రధాని మోదీ, సీఎంచంద్రబాబుల నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడం ఈ అభివృద్ధి ప్రస్థానంలో ఒక భాగమని పేర్కొన్నారు. స్వారత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. "అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నాం" అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.  పిఠాపురం మున్సిపాలిటీకి రూ.3 కోట్ల మంజూరైనట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న హామీల అమలును ముందుకు తీసుకెళ్లున్నట్లు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు.
పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి  డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం Publish Date: Apr 25, 2025 5:06PM

వంశీ, రాజ్ కసిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు.. ఒకే జైలు.. ఒకే బ్యారక్

వేర్వేరు కీలక కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు ప్రముఖులు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఒకే బ్యారక్‌లో  ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మద్యం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్మలానీని వేధించిన కేసులో అరెస్టయిన పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ జైలులోని ఒకే బ్యారక్‌లో వేర్వేరు సెల్స్‌లో రిమాండ్‌లో ఉన్నారు.  తెలుగుదేశం కార్యాలయ సిబ్బంది కిడ్నాప్ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ ఇప్పటికే  చాలా రోజులుగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. తాజాగా, మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన రాజ్ కసిరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఒకరి తర్వాత ఒకరు ఇదే జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చారు.  ఈ ముగ్గురినీ కూడా ఒకే బ్యారక్ లోని వేరువేరు సెల్స్ లో జైలు అధికారులు  ఉంచారు.   ముగ్గురు ప్రముఖులు ఒకే బ్యారక్‌లో ఉండటంతో జైలు అధికారులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. వారి కదలికలను పర్యవేక్షించేందుకు, భద్రతా కారణాల దృష్ట్యా ముగ్గురి సెల్స్‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వేర్వేరు కేసుల్లో అరెస్టయిన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే బ్యారక్‌లో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఉండగా వల్లభనేని వంశీ, పీఎస్సార్ ఆంజనేయులు మధ్య గతంలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉండేవని చెబుతారు. మొత్తం మీద జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ముగ్గురు ప్రముఖులు.. ఆ సమయంలో తాము చేసిన చర్యల కారణంగా అరెస్టై ఒకే జైలులో ఒకే బ్యారక్ లో ఉండటం కాకతాళీయమే అయినా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 
వంశీ, రాజ్ కసిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు.. ఒకే జైలు.. ఒకే బ్యారక్ Publish Date: Apr 25, 2025 4:50PM

అధికార లాంఛనాలతో ముగిసిన చంద్రమౌళి అంత్యక్రియలు

  జమ్ముకశ్మీర్‌‌లో పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన విశాఖ వాసి జేఎస్ చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. ఇవాళ చంద్రమౌళి పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయం పాండురంగాపురంలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర మొదలవగా.. భారీగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. కూటమి నేతలు కూడా చంద్రమౌళి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కశ్మీర్ లోని పహెల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి. ఈ రోజు చంద్ర మౌళి పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మృత దేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా ఆయన కుమార్తె తీవ్రంగా రోధించింది. బంధువులు, స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. అంతకుముందు చంద్రమౌళి నివాసం వద్ద హోంమంత్రి అనిత ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.  అలాగే మంత్రి సత్య కుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అంతిమయాత్రలో పాల్గొని చంద్రమౌళి పాడి మోసారు. అశృనయనాల నడుమ చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. జ్ఞానాపురం స్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రమౌళిని కడసారి చూసేందుకు బంధువులు, వేలాదిగా ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఉగ్రమూకల దాడిలో మృతి చెందిన నెల్లూరు వాసి మధుసూదన్‌ పార్థివ దేహానికి నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మధుసూదన్‌ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.          
అధికార లాంఛనాలతో ముగిసిన చంద్రమౌళి అంత్యక్రియలు Publish Date: Apr 25, 2025 4:34PM

జలాస్త్రమే.. బ్రహ్మాస్త్రం

పాక్ పని అవుట్ ! భారత,పాకిస్థాన్ దేశాల మధ్య ఎప్పుడో 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందానికి చాలా చరిత్ర వుంది. నిజానికి ఉభయ దేశాల మధ్య యుద్దాలు, ఉద్రిక్తలు , సరిహద్దు ఘర్షణలు వంటి అనేక ఆటు పోట్లను ఎదుర్కుని ఇంతవరకూ సజీవంగా నిలిచిన ఒప్పందం ఏదైనా ఉందంటే  అది 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందం ఒక్కటే. అయితే ఇప్పడు ఆ  పవిత్ర  బంధం కూడా పుటుక్కుమంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముష్కరులు, జమ్మూకశ్మీర్‌లో అత్యంత హేయమైన ఉగ్ర దాడికి పాల్పడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో మన దేశం సింధూ జలాల ఒప్పందానికి  చెల్లు చీటి రాసింది. నిజానికి గతంలోనూ అనేక సందర్భాలలో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలనే డిమాండ్ వుంది. నిజానికి దేశాల మధ్యనే కాదు, రాష్ట్రాల మధ్య కుదిరిన నదీ జలాల ఒప్పందాలు నిత్య కలహాలకు కారణం అవుతున్న తీరును చూస్తున్నాం. ఎక్కడి దాకానో ఎందుకు, నిన్న మొన్నటి వరకు కలిసున్న ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరీ జలాల పంపకాలకు సంబంధించిన ఒప్పందాల  ఉల్లంఘనలు, ట్రిబ్యునల్ తీర్పులు, అనేకం ఉన్నాయి. రైతులు, రాజకీయ పార్టీలు కత్తులు దూసుకున్న సందర్భాలూ  ఉన్నాయి.   అలాగే..  ఇంకా అనేక ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య కూడా జల జగడాలు సాగుతున్నాయి. అయితే.. భారత ,పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన సింధూ జలాల ఒప్పందం ఒక చారిత్రిక ఒప్పందంగా చరిత్రలో మిగిలి పోయింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నదీ జలాల పంపిణీ ఒప్పందాలలో ఒకటిగా  నిలిచింది.  చరిత్రలోకి వెళితే.. 1960లో ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిత్వంతో భారత్‌-పాక్‌ ఈ ఒప్పందం పై సంతకాలు చేసాయి. ఈ ఒప్పందం ప్రకారం ఆరు నదుల నీటిని ఇరుదేశాలు పంచుకొన్నాయి. దీని కింద సింధూ, జీలమ్‌, చీనాబ్‌ నదుల నీరు పాకిస్థాన్‌కు దక్కింది. ఇవి కాకుండా బియాస్‌, సట్లెజ్‌ జలాలు కూడా వెడుతుంటాయి. ఇక మన దేశం భూభాగంలో ప్రవహించే నదీ జలాలను  ప్రవహించే నీటిని మనం వాడుకోవచ్చును. కానీ, జల విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే వాడుకుని..  మళ్ళీ పాక్ కు వదిలేయాలే కానీ..  ఆ నీటిని నీటిని సాగు, తాగు ప్రయోజనాలకు వాడుకోరాదు.  నిజానికి ఎగువన ఉన్న దేశంగా మనం ప్రాజెక్టులు కట్టుకుని, నీటిని నిల్వ చేసుకున్నా.. మళ్ళించి మన అవసరాలకు వాడుకున్నా..  పాకిస్థాన్ గొంతు తడవదు. పంట పొలాలు నీరు  అందదు.  పాకిస్థాన్ నీటి అవసరాలకు 80 శాతం వరకూ  ఈ ఒప్పంద పరిధిలో అందుతున్న నీరే  ఆధారం. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే..  సింధూ జలాల ఒప్పందమే పాకిస్థాన్  ను బతికిస్తున్నది. ఆదే  ఆ దేశానికి జీవాధారం, జీవనాధారం. పాకిస్థాన్ నీటి సరఫరా అత్యధికంగా ఈ నదుల పైనే ఆధారపడింది.  ఆ దేశంలో 23.7 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడతారు. కరాచీ, లాహోర్‌, ముల్తాన్‌ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తున్నాయి. పాక్‌ వ్యవసాయానికి వాడే నీటిలో  80శాతం ఈ ఒప్పందం కింద లభించేదే.  16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి. ఆ దేశ జీడీపీలో 23 శాతం వ్యవసాయం నుంచే లభిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 68 శాతం ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు. సింధూ బేసిన్‌ నుంచి పాక్‌కు 154.3 మిలియన్ ఎకరాల అడుగుల (ఎమ్‌ఏఎఫ్‌) నీటిని ఏటా సరఫరా చేస్తోంది. ఆ దేశ ఆహార భద్రతకు ఇది చాలా కీలకం. పాకిస్థాన్‌ ఇప్పటికే తీవ్రమైన నీటి కరవులో ఉంది. ఆ దేశ ఇరిగేషన్‌ మేనేజ్‌మెంట్‌ అధ్వాన స్థితికి చేరింది. భూగర్భజలాలు పడిపోతున్నాయి.  పాకిస్థాన్‌ విద్యుత్ కు కీలకమైన మంగల డ్యామ్‌ను జీలమ్‌ నదిపై నిర్మించారు.  ఏటా ఆ దేశ విద్యుత్తు ఉత్పత్తిలో 8 శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక సింధూ నదిపై నిర్మించిన తర్బెల డ్యామ్‌ పాక్‌ వినియోగంలో 16 శాతానికి సమానమైన విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. తాజాగా సింధూ జలాల ఒప్పందంతో పాక్‌లో 24శాతం జల విద్యుత్ పై ప్రతికూల ప్రభావం పడనుంది. పాకిస్థాన్‌ జీడీపీలో 25శాతం ఈ నదుల నుంచే లభిస్తోందంటే.. భారత నిర్ణయం ఆ దేశాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేయనుందో అర్థం చేసుకోవచ్చును.  అయితే మన దేశం ఒప్పందం నిలిపివేసినా.. పాకిస్థాన్ పై తక్షణ ప్రభావం పెద్దగా ఉండదని..  గతంలో సింధూజలాల కమిషనర్‌గా పనిచేసిన ప్రదీప్‌కుమార్‌ సక్సెనా  వంటి నిపుణులు అంటున్నారు. అవును. మన దేశం తీసుకున్న కఠిన  నిర్ణయం ప్రభావం  పాక్‌పై తక్షణమే పడకపోవచ్చు. నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాంకేతికంగా సాధ్యం కాదు. సింధూ జలాలను నిల్వ చేయడానికి.. మళ్లించడానికి తగిన వసతులు లేవు.  అయిత డ్యాముల నిర్మాణానికి ఇంతవరకు ఉన్న అవరోధాలు   ఈ నిర్ణయంతో తొలిగి పోతాయి. కానీ..  తక్షణం నిర్మాణాలు చేపట్టినా, అవి పూర్తయ్యే సరికి ఎంత కాలం పడుతుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు.  అలాగే..  ప్రస్తుత ఉద్రిక్తలు కొంత సర్డుమణిగిన  తర్వాత,  ప్రపంచ బ్యాంకు,  లేదా ఎ అమెరికానో పట్టుకుని ఒప్పందాన్ని పునరుద్దరించుకో వచ్చనే ఆలోచనతో పాక్ నేతలు ఉన్నారని అంటున్నారు. మరోవంక భారత ప్రభుత్వం దీన్నొక అవకాశంగా తీసుకుని, పాకిస్థాన్  ఉగ్ర చర్యలకు జలాస్త్రంతో సమాధానం చెప్పాలని కృత నిశ్చయంతో ఉందని అంటున్నారు.
జలాస్త్రమే.. బ్రహ్మాస్త్రం Publish Date: Apr 25, 2025 4:30PM

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారం స్వాధీనం

  ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ క్రమంలో నిందితులు వాడిన స్కూటీ లభ్యమైంది. చీమకుర్తి బైపాస్ రోడ్డులోని ఓ దాబా వద్ద స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంతనూతలపాడు, చీమకుర్తి వైపు పరారీ అయినట్లు గుర్తించారు. కానీ నిందితులు ఎవరనేది ఇప్పటి వరకూ స్పష్టంగా కనిపెట్టలేకపోయారు. నిందితులను పట్టుకునేందుకు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో పోలీసులు గాలిస్తున్నారు.  పోలీసులు క్లూస్ టీం ద్వారా విచారణ వేగవంతం చేశారు. ప్రకాశంలోని తన కార్యాలయంలో ఉండగా మాస్కులు ధరించి రెండు బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. వీరయ్య చౌదరి ఛాతీ, గొంతు, పొట్లపై పదిహేను కత్తి పోట్లు పొడిచారు. అనంతరం పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.   
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారం స్వాధీనం Publish Date: Apr 25, 2025 3:36PM

జగన్ అరెస్ట్ ఫిక్స్?.. అప్పగింతలు అందుకేనా?

వైసీపీ కీలక నాయకులు, వారి సన్నిహితులు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై వరుసగా కేసులు, అరెస్టుల పర్వం మొదలైంది. ఎన్నికలు ముగియగానే మాచర్ల మాజీ  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం తాజాగా రాజ్ కసిరెడ్డి, సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయుల వరకూ సాగింది. ఈ అరెస్టుల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. కాగా లిక్కర్‌ స్కామ్‌ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్  కసిరెడ్డి అరెస్టుతో ఈ అరెస్టుల ఎపిసోడ్‌కి సీక్వెల్   ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే లిక్కర్ స్కాంపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో కర్త-కర్మ-క్రియ అన్నీ రాజ్ కసిరెడ్డే అని చెప్పి కలకలం రేపారు.  వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డిని జగన్ ఏరికోరి తెచ్చుకున్నారు. విదేశాల్లో కసిరెడ్డికి పలు వ్యాపారాలు, ముఖ్యంగా లిక్కర్ కంపెనీలు ఉన్నాయంట. ఆ అనుభవంతో  రాజ్ కసిరెడ్డి జగన్ కు బాగా దగ్గరై, లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలున్నాయి. విజయసాయి రెడ్డి నోటి వెంట కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు రావడంతో ఆయన సడన్‌గా ఫోకస్ అయ్యాడు  ఐటీ సలహాదారుగా ఉంటూనే కసిరెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితో కలిసి లిక్కర్ అక్రమ దందా నడిపించారని అధికారుల విచారణలో తేలింది.  ప్రభుత్వం నడిపే మద్యం అవుట్‌లెట్‌లకు ఊరుపేరు లేని మద్యం బ్రాండ్ల సరఫరాను రాజ్ కసిరెడ్డి నియంత్రించారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రత్యేక కార్యాలయం నుండి ఎంపి మిధున్‌రెడ్డితో కలిసి మొత్తం కిక్‌బ్యాక్ నెట్‌వర్క్‌ను నడిపించిన కసిరెడ్డి ఇప్పుడు జైలుపాలయ్యారు. దాదాపు 3,000 కోట్ల రూపాయల ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి , అప్పటి ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవ రెడ్డిలకు సిట్ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది.  ఈ కేసులో జగన్‌కు అత్యంత ఆప్తుడైన మిధున్‌రెడ్డి ఏ4 నిందితుడిగా బుక్ అయ్యారు. దాంతో ఇక నెక్ట్స్ జగన్ వంతే అన్న టాక్ వినిపిస్తోంది. మద్యం తయారీదారుల నుంచి నెలనెలా కసిరెడ్డి వసూలు చేసిన రూ.60 కోట్ల కమీషన్లు మిథున్‌రెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలోని జనగ్  ప్యాలెస్‌కు చేరేవన్న ఆరోపణలున్నాయి. విచారణలో కసిరెడ్డి ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉండటంతో జగన్‌కు అరెస్ట్ భయం పట్టుకుందంట. అందుకే  గత పదేళ్ళలో ఎన్నడూ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించని జగన్ తాజాగా ఇటీవల 33 మందితో  వైసీపీకి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని నియమించారు.  జగన్ జైలుకెళ్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన  భార్య భారతి పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించాలి. జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల రాజకీయంగా ఆయనకు ఎప్పుడో దూరమయ్యాయి. ఇక పార్టీలో నెంబర్2 అనిపించుకుని వైసీపీ ఆవిర్భావం నుంచి అన్ని వ్యవహారాలు తానై చక్కబెట్టిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకుని జగన్‌కి గుడ్‌బై చెప్పేశారు.  విజయసాయిరెడ్డి ఎఫెక్ట్‌తో అసలే అక్రమఆస్తుల కేసుల టెన్షన్‌లో ఉన్న జగన్‌ మెడకు ఇప్పుడు లిక్కర్ స్కాం ఉచ్చు బిగుస్తోంది. జగన్ జైలుకెళ్తే బయటవారికి పార్టీ పగ్గాలు అప్పజెప్పే ప్రసక్తే  ఉండదు. ఎందుకంటే ఆయన సొంత చెల్లెల్నే నమ్మరు. కాబట్టి రాజకీయ అనుభవం లేకపోయినా భారతే ఆయనకు దిక్కవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను పొలిటికల్‌గా గైడ్ చేయడం కోసం పార్టీలో ఉన్న సీనియర్లందరితో కలిసి పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీతో వరుస మీటింగులు కూడా నిర్వహిస్తున్నారంట. ఆ పీఏసీకి తనకు అత్యంత నమ్మకస్తుడైన సజ్జల రామకృష్ణారెడ్డినే కన్వీనర్‌గా పెట్టుకున్నారు. సొంత మీడియాలో కూడా భారతికి చేదోడువాదోడుగా ఉంటున్న సజ్జలే రేపు జగన్ జైలుకి వెళ్లాక భారతికి రాజకీయ సహయకుడిగా కూడా కొనసాగుతారని జగన్ నమ్మకంతో ఉన్నారంట.
జగన్ అరెస్ట్ ఫిక్స్?.. అప్పగింతలు అందుకేనా? Publish Date: Apr 25, 2025 3:34PM

చిన్నారి ఉసురు తీసిన మూఢనమ్మకం.. విశాఖలో దారుణం

మూఢ నమ్మకం ఓ చిన్నారి ఉసురు తీసింది. 11 ఏళ్ల బాలిక  పూర్ణ చంద్రిక సొంత అమ్మ, అమ్మమ్మల మూఢ నమ్మకానికి బలైంది. ఈ సంఘటన విశాఖపట్నంలో గురువారం (ఏప్రిల్ 24) చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న   ఆ బాలికకు దయ్యం పట్టిందంటూ విశాఖ జ్ఞానపురం వద్ద దయ్యాన్ని వదిలించే శక్తులు ఉన్న వారు ఉన్నారన్న నమ్మకంతో తీసుకువచ్చారు. సెయింట్ పీటర్స్ చర్చి వద్ద ఆ బాలికకు గుడ్డ కప్పి, దేవుడి చిత్రపటం వద్ద ఉంచారు. అంతకు ముందే ఆమె కరుస్తోందంటూ ఇంటి వద్దే నోట్లో గుడ్డలు కుక్కి తీసుకు వచ్చారు.  ఈ క్రమంలో ఆ చిన్నారి ఊపిరాడక మరణించింది. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఉత్తరాంధ్రలో చేతబడి, దయ్యాన్ని వదిలిస్తామనే నెపంతో ఇటువంటి సంఘటనలు జరిగాయి.   అరకు నియోజకవర్గం టోకూరు పంచాయతీ బగ్మారవలస గ్రామంలో చేతబడి అనుమానంతో జరిగిన దాడిలో ముగ్గరు మరణించారు. అలాగే 2015లో డుంబ్రిగుడ మండలం  రంగిసింగిగూడ గ్రామంలో  మంత్రాలు చేస్తున్నాడన్నఅనుమానంతో ఒకరిని సజీవదహనం చేసిన ఘటన జరిగింది. ఇప్పుడు తాజాగా దెయ్యం పట్టిందన్న మూఢనమ్మకంతో చిన్నారి ఉసురు తీశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు జ్ణానాపురం చర్చి వద్ద దెయ్యం వదిలిస్తామంటూ పూజలు ఎవరు నిర్వహిస్తున్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. 
చిన్నారి ఉసురు తీసిన మూఢనమ్మకం.. విశాఖలో దారుణం Publish Date: Apr 25, 2025 3:20PM

పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

  పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న పాకిస్థాన్ జాతీయులకు సంబంధించిన వీసాలను రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి, తమ రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను గుర్తించి, వారిని వెనక్కి పంపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అమిత్ షా ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన వారిని త్వరగా వెనక్కి పంపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసే ప్రక్రియను చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంమంత్రి సూచించినట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ నాటికి అన్ని వీసాలు రద్దవుతాయని కేంద్రం తెలిపింది. ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా హైదరాబాద్ లో 208మంది పాకిస్తానీయులు ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు హైదరాబాద్ ఎస్ బీ లో 208 పాకిస్తాన్ పౌరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నాారని ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదానికీ నీడనిస్తున్న దేశం పై భారత్ కఠినంగా వ్యవహరించాలని.. అంతర్జాతీయ చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయని.. ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నామని ఒవైసీ పేర్కొన్నారు.
పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు Publish Date: Apr 25, 2025 3:11PM

ఇస్రో మాజీ ఛైర్మ‌న్ క‌స్తూరి రంగ‌న్ క‌న్నుమూత‌

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ  మాజీ ఛైర్మ‌న్ డాక్టర్ కృష్ణ‌స్వామి కస్తూరి రంగన్  (84) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచానట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1994 నుంచి 2003 వరకు ఆయన ఇస్రో చైర్మన్ గా గా కొనసాగారు. PSLV, జీఎస్ఎల్వీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు. 2020 జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. అనంతరం 2003 నుంచి 2009 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. అలాగే మోదీ సర్కార్ రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను తయారు చేసిన కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షత వహించారు. 2004 నుంచి 2009 మధ్యకాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (NIAS)కు డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. ఈ సంస్థ ద్వారా దేశం యొక్క శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధికి కస్తూరి రంగన్ తోడ్పాటు అందించారు.  కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.  1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు.    
ఇస్రో  మాజీ ఛైర్మ‌న్  క‌స్తూరి రంగ‌న్ క‌న్నుమూత‌ Publish Date: Apr 25, 2025 2:47PM

రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై వైసీపీ దుష్ప్రచారం తగదు : కేశినేని చిన్ని

  లిక్కర్ స్కామ్ దృష్టి మళ్లించేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. త్వరల్లో మాజీ మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతల అవినీతి అంతా త్వరలోనే బయటపడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై దుష్ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ఎన్నారైలు ఉత్సాహం చూపుతున్నారని, 9 నెలల్లో రూ. 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. జగన్ హయాంలో 21 సూట్ కేసు కంపెనీలు వచ్చాయని ఎద్దేవా చేశారు. 21వ సెంచరీ రియాల్టీస్‌లో భాగస్వాములు.. ఎవరో కేశినేని ట్రావెల్స్  భాగస్వాములెవరో అందరికీ తెలిసన్నారు.  అభివృద్ధిని అడ్డుకుంటుంటూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న ఎన్నారైల పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని కేశినేని చిన్ని సూచించారు. ఎన్నారైలకు తాము అండగా ఉంటామని, రాష్ట్రంలో నిర్భయంగా పెట్టుబడులు పెట్టొచ్చని కేశినేని చిన్ని భరోసా ఇచ్చారు.  రాజధాని అమరావతికి నిధులు రాకుండా వైసీపీ బ్యాచ్‌ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రానికి, నిరుద్యోగ యువతకు నష్టం చేసే పనులను మానుకోవాలి’’ అని కేశినేని చిన్ని పేర్కొన్నారు. రాజకీయంగా ఏదైనా చేయాలనుకుంటే నన్ను చేయండి కానీ పెట్టుబడిదారులను భయపెట్టి నాపై బురద చల్లాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు  
రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై వైసీపీ దుష్ప్రచారం తగదు : కేశినేని చిన్ని Publish Date: Apr 25, 2025 2:25PM

యుద్ధం వస్తుందా .. వస్తే ఏమవుతుంది?

సర్వత్రా ఇదే ఉత్కంఠ! పహల్గాం ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల తరువాత  ప్రధానమంత్రి (గురువారం (ఏప్రిల్ 24)  తొలిసారిగా స్పందించారు. ఉగ్రదాడి నేపధ్యంలో విదేశీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని బుధవారమే(ఏప్రిల్23) స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోడీ  గురువారం (ఏప్రిల్ 24) వరకూ వ్యూహాత్మక మౌనం పాటించారు. మరో వంక కాగల కార్యం, కానిచ్చేవారు  కానిచ్చారు.  విదేశీ పర్యటన నుంచి  తిరిగి వస్తూనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా అనూహ్యమైన కీలక నిర్ణయాలు  తీసుకున్నారు.  ప్రధానంగా, 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటుగా అట్టారి భూ-రవాణా పోస్టును వెంటనే మూసివేయడం వంటి అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఒక విధంగా ఇది, అటు పాకిస్తాన్ కు ఇటు దేశంలోని పాక్ అనుకూల శక్తులకు కూడా మింగుడు పడ లేదు. నిజానికి, పాకిస్తాన్ సైన్యం, మోదీ మరో మెరుపు దాడి చేస్తారని  ఉహించి  ఎదుర్కునేందుకు సన్నద్దమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో వైమానిక దళాలను, సైన్యాన్నిమోహరించింది.   అయితే  మోదీ మళ్ళీ మరో మెరుపు దాడి చేశారు కానీ..  పాకిస్తాన్, పాక్ ప్రేమికులు ఆశించిన విధంగా కాదు.. అనూహ్యంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాక్ పై వ్యూహాత్మక మెరుపు దాడి చేశారు. ఇంతవరకు దాయాది దేశాల మధ్య యుద్దాలు జరిగాయి, పాకిస్తాన్ సీమాంతర  ఉగ్రవాదాన్ని పతాక స్థాయికి తీసుకు పోయింది. మన దేశంలో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా  ఉగ్రవాద సంస్థలకు ప్రత్యక్ష పరోక్ష సహకారం అందించింది, అయితే..  ఉభయ దేశాల మధ్య వైషమ్యాలు పతాక స్థాయికి చేరినా, మానవతా దృక్పథంతో, మంచితనంతో మన దేశం పాకిస్తాన్ కు జీవాధారం అయిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయం తీసుకోలేదు. కానీ  హద్దులు దాటిన పాక్   పాపాలకు చుక్క  పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఇక ఉపేక్షించి లాభం లేదని నిర్ణయానికి వచ్చింది. కఠిన నిర్ణయం తీసుకుంది.  అయితే.. ఇంతటితో  అయిపోయిందా, పహల్గాం ఉగ్రదాడిని ఇక్కడితో మరిచి పోవడమేనా?  అంటే,  లేదు  అసలు ‘యుద్ధం’ ఇప్పుడే మొదలైందని విశ్లేషకులు అంటున్నారు.  అవును.. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇంచుమించుగా 48 గంటలకు పైగా వ్యూహాత్మక మౌనం పాటించిన ప్రధాని మోదీ  గురువారం (ఏప్రిల్24) బీహార్లోని మధుబనిలో జరిగిన పంచాయతీ రాజ్ కార్యక్రమంలో తొలిసారిగా  పహల్గామ్ ఉగ్రదాడి పై బహిరంగంగా స్పందించారు. నిజానికి  ప్రధాని మోదీ స్పందించారు,అనే కంటే దేశ ప్రజల గుండె మంటలను ఆవిష్కరించే విధంగా నిప్పులు చెరిగారు.  గర్జించారు అనడం సమంజసంగా ఉంటుంది. 140 కోట్ల మంది గుండె మంటలను ప్రధాని మోదీ తన గొంతుకలో వినిపించారు.   అవును.. జమ్మూ కశ్మీర్లో అమాయకుల ప్రాణాలు హరించిన ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా, వెతికి, వెంటాడి, వేటాడి శిక్షిస్తామని హెచ్చరించారు. హంతక ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. అంతే కాదు..  ఉగ్రవాద మూకలకు మద్దతి స్తున్న వారిని కూడా వదిలేది లేదని, కలలో కూడా ఉహించలేని విధంగా  కఠినంగా  శిక్షిస్తామని, ప్రపంచం అంతటికీ వినిపించేలా ప్రపంచ భాష  ఇంగ్లీష్ లోనూ  చెప్పారు.   ఈ రోజు, బీహార్ గడ్డపై..  నేను ప్రపంచం మొత్తానికి చెబుతున్నాను, భారతదేశం ప్రతి ఉగ్రవాదిని శిక్షిస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న, కుట్రలో భాగమైన ప్రతి ఒకరినీ వారి ఊహకు కూడా అందని విధంగా కఠినంగా శిక్షిస్తాం. ఇప్పుడు.. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చేందుకు మిగిలి ఉన్న ఆ కొద్ది భూభాగాన్ని మట్టి కరిపిస్తాం. మొత్తం దేశం ఈ సంకల్పంలో దృఢంగా ఉంది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మనతో ఉన్నారు  అని ప్రధానమంత్రి అన్నారు. అయితే.. ఖచ్చితంగా ప్రభుత్వం  ఎలాంటి  చర్యలు తీసుకుంటుంది? మాటలు ఎంత వరకు కార్యరూపం దలుస్తాయి? ప్రభుతం ఎందాకా పోతుంది? ఉభయ దేశాల మధ్య మరో యుద్ధానికి దారి తీస్తుందా?  అన్నది ఇప్పుడు దేశం ముందున్నప్రశ్న. నిజానికి, దేశం ముందు కాదు,  ప్రపంచం ముందున్న ప్రశ్న కూడా ఇదే..  అలాగే..  యుద్దమే వస్తే ఏమవుతుంది? అనేది కూడా ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ..
 యుద్ధం వస్తుందా .. వస్తే ఏమవుతుంది? Publish Date: Apr 25, 2025 1:00PM

మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు మాధవరెడ్డి అరెస్టు.. పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిసిందా?

మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం సంఘటనలో కుట్ర అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని సిట్ అరెస్టు చేసింది. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాధవరెడ్డి గత ఆరు నెలలుగా కోర్టు నుంచి ముందస్తు బెయిలు పొంది అరెస్టు కాకుండా తప్పించుకున్నారు. అయితే సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించి ఆ యాంటిసిపేటరీ బెయిలు రద్దు అయ్యేలా చేశారు. మాధవరెడ్డికి యాంటిసిపేటరీ బెయిలు రద్దు కావడంతో అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని పెద్దగొట్టిగల్లోలోని ఒక ఫామ్ హౌస్ లో మాధవరెడ్డి ఉన్నట్లుగా అందిన పక్కా సమాచారం మేరకు సిట్ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయనను అదుపులోనికి తీసుకున్నారు.  అరెస్టు సమయంలో మాధవరెడ్డి తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను నీటిలో పడేసేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డిని అదుపులోనికి తీసుకుని  తిరుపతికి తరలించారు. మాధవరెడ్డి అరెస్టుతో ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిసినట్లేనని అంటున్నారు.  జగన్ హయాంలో వైసీపీ నేతల అక్రమ సంపాదన, భూకబ్జాల వ్యవహారం అడ్డూ అదుపూలేకుండా సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలా అడ్డూ అదుపూ లేకుండా భూకజ్జాలకు పాల్పడిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందువరుసలో ఉన్నారని అప్పట్లోనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడిన ఒక్కొక్కరూ భయంతో వణుకుతున్నారు. పోలీసు కేసులకు భయపడి సాక్ష్యాలను తారుమారు చేయడానికి పెద్దరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తన భూ ఆక్రమణలకు సంబంధించిన సాక్ష్యాలను గల్లంతు చేయడం కోసమే మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాల యంలో అగ్నిప్రమాద కుట్రకు తెరలేపారన్న అనుమానాలు ఉన్నాయి. ప్రాథ‌మిక విచార‌ణ‌లో పైళ్ల ద‌గ్దం ప్ర‌మాద‌శాత్తూ జ‌ర‌గ‌లేద‌ని, ఎవ‌రో కావాల‌నే నిప్పు పెట్టార‌ని తేలింది.   ఆ ఫైళ్ల‌కు నిప్పుపెట్టి కాలిపోయేలా చేసింది పెద్దిరెడ్డి అనుచ‌రులే అని అప్ప‌ట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.  దీనిపై ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఫైళ్ల దగ్ధం వెనుక కుట్ర ఉందన్నది వెల్లడైంది. దీంతో ఈ కేసు దర్యాప్తునకు ప్రభు త్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది.   ఇప్పుడు ఆ కేసులోనే పెద్దరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అరెస్టయ్యారు. దీంతో తరువాతి వంతు పెద్దిరెడ్డిదేనా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 
మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు మాధవరెడ్డి అరెస్టు.. పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిసిందా? Publish Date: Apr 25, 2025 12:20PM

లోకేష్ భజన చేసిన దువ్వాడ.. కత్తికట్టిన జగన్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైమ్ అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు.  గతంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై బూతు పురాణం వల్లె వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది. వరుసగా  మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ.. పక్కన పెట్టేశారు. క్రమశిక్షణ చర్యలు పేరుతో సస్పెన్షన్ వేటు వేశారు.  వైసీపీ అధికారంలో ఉండగా  అడ్డూ అదుపూ లేకుండా  నోరు పారేసుకున్న ఆ పార్టీ నాయకుల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటారు.  చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లపై అసభ్యకర భాషతో విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అందుకే దువ్వాడ వైసీపీ స్థాపించాక ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా  జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి ... మధ్యలో దివ్వెల మాధురి. ఈ ఫ్యామిలీ డ్రామా గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.  ప్రస్తుతం వారి వివాదం కోర్టులో కొనసాగుతోంది.  మాధురితో కలిసి హైదరాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేసుకుంటున్న దువ్వాడ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక మళ్లీ మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ స్పందించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని.. అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని దువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో బలిపశువును చేశారన్నారు.   దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ వ్యవహారం రోడ్డుకెక్కడంతోపాటు.. మాధురితో ఆయన కలిసి ఉండడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. నిజంగా దువ్వాడపై జగన్ తీసుకున్నది క్రమశిక్షణ చర్యే అయితే.. ఆ పని ఎప్పుడో చేసి ఉండాలి. దివ్వెల మాదురి వ్యవహారంలో రచ్చకెక్కినప్పుడు సస్పెన్షన్ వేటు వేయాలి. మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్  ఇన్‌స్టా రీల్స్‌, తిరుమల పర్యటనలో ఫొటోషూట్‌, కుటుంబ వివాదాలతో దువ్వాడ ఎప్పుడో రచ్చకెక్కారు. కానీ... జగన్‌ ఏమాత్రం పట్టించుకోలేదు.  అలాంటిది... ఉన్నట్టుండి ఆయనను ఎందుకు సస్పెండ్‌ చేశారన్న దానిపై ఆరా తీస్తే ఆసక్తికర విషయం తెలిసింది. మంత్రి లోకేష్‌ను పొగడటమే దువ్వాడపై వేటుకు కారణమని తెలిసింది. ఇటీవల ఒక సోషల్ మీడియా ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి పాల్గొన్నారు. బాలయ్య తర్వాత స్వీటెస్ట్‌ పర్సన్‌ ఎవరు అని అడిగిన ప్రశ్నకు... లోకేష్ అని ఇద్దరూ కూడబలుక్కున్నట్లు ఒకే సారి సమాధానం చెప్పారు. లోకేష్ తెలివైనవాడని, ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తారని, యువకుడనీ తెగ పొగిడేశారు. ఆ లోకేష్ జపం ఆ నోటా ఈ నోటా జగన్ చెవిన పడిందంట. లోకేష్‌ను అంతగా పొడిగితే జగన్‌ ఊరుకుంటారా.. అందుకే దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారంట. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు.. ఇదేనేమో..?
లోకేష్ భజన చేసిన దువ్వాడ.. కత్తికట్టిన జగన్ Publish Date: Apr 25, 2025 11:42AM

ఒక్క ఒప్పందం ర‌ద్దు.. పాక్ ఖేల్ ఖ‌తం.. దుకాణం బందేనా?

ఏమిటీ సింధూ జ‌లాల ఒప్పందం? ఈ  ఒప్పందం ర‌ద్దుతో పాకిస్తాన్ లో ఏర్ప‌డ‌నున్న సంక్షోభాల తీవ్ర‌త ఎంత? ఇప్ప‌టికే క్రికెట్ సంక్షోభంతో విల‌విల‌ ఇక ఆహార‌, ఆర్ధిక‌, సామాజిక‌, రాజ‌కీయంగానూ అవ‌స్థలేనా? కొన్ని శ‌తాబ్దాల కిందట అంటే, ఐస్ ఏజ్ కాలం నాటి సంగ‌తి. అప్ప‌ట్లో ఖండాలు ఒక్కోసారి విడిపోయి.. స‌ముద్ర జ‌లాల‌పై ప్ర‌యాణిస్తూ.. వివిధ ర‌కాల ప్రాంతాల్లో సెటిల‌య్యేవ‌ని అంటుంది మ‌న పురాత‌న భౌగోళిక చ‌రిత్ర. అలా ఒక ఆఫ్రికా ఖండం నీటిపై ప్ర‌యాణిస్తూ వ‌చ్చి ఏషియా ఖండాన్ని ఢీ కొట్టింద‌నీ.. అలా మ‌న‌కు హిమాల‌యా ప‌ర్వ‌తాలు ఏర్ప‌డ్డాయ‌ని అంటారు.  ఎప్పుడ‌యితే ఇక్క‌డ‌ మంచు శిఖ‌రాలు ఏర్ప‌డ్డాయో.. అప్ప‌టి వ‌ర‌కూ ఎడారిలాంటి ఈ ప్రాంతంలోకి బిందువులు సింధువులుగా మారి.. ఒక ప్ర‌వాహం  ఏర్ప‌డింద‌నీ.. త‌ద్వారా ఇక్క‌డొక‌ నాగ‌రిక‌త ఏర్ప‌డింద‌నీ.. దాన్నే సింధూ నాగ‌రిక‌త అంటార‌నీ చెబుతుంది మ‌న నైస‌ర్గిక భౌగోళిక‌ చ‌రిత్ర‌.  ఎప్పుడైతే ఇక్క‌డ జ‌ల ప్ర‌వాహం ఏర్ప‌డిందో దాన్ని ఆశించి.. ఆఫ్ఘ‌న్, ఇరాన్ వంటి  ప్రాంతాల నుంచి కొంద‌రు జీవ‌నాన్ని వెతుక్కుంటూ వ‌చ్చార‌నీ.. వారే త‌ర్వాతి కాలంలో ఆర్యులుగా అవ‌త‌రించార‌నీ అంటారు. ఇక‌, ఆఫ్రికా ఖండంతో పాటు వ‌చ్చిన వారు ద‌క్షిణాదిన ద్ర‌విడులుగా స్థిర‌ప‌డ్డార‌నీ చెబుతుంటారు. ఇది బేసిక్ ఆర్య ద్ర‌విడ థియ‌రీ అయితే..  ఈ థియ‌రీలో మేజ‌ర్ పార్ట్ సింధూ  జ‌లాల‌దే. ఈ జ‌లాల‌ను వెతుక్కుంటూ వ‌చ్చిన వారే ఆర్యులుగా చెబుతుందీ ఆర్య ద్ర‌విడ సిద్ధాంతం. ఇదిలా ఉంటే కాల‌క్ర‌మేణా ఉత్త‌ర ద‌క్షిణ భార‌తాలు క‌ల‌సి ఒక దేశంగా ఏర్ప‌డ్డం.. ఒక‌ప్ప‌ట్లో అఖండ భార‌తంగా ఉన్న ఈ దేశం త‌ర్వాతి  రోజుల్లో పాక్, బంగ్లాతో పాటు శ్రీలంక‌, నేపాల్ అంటూ విడిపోయింద‌ని అంటుంది మ‌న సుదీర్ఘ కాల చ‌రిత్ర‌. 1947 నాటి నుంచి మ‌నం భార‌త్- పాకిస్థాన్ లు గా విడివ‌డ్డాం. 1960ల కాలంలో నాటి భార‌త‌ ప్ర‌ధాని నెహ్రూ, నాటి పాక్ అధ్య‌క్షుడు అయూబ్ ఖాన్ చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా వ‌చ్చిందే  సింధూ న‌దీ జ‌లాల ఒప్పందం. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం మూడు సార్లు అంటే, 1965- 1971- 1999 భార‌త్ పాక్ మ‌ధ్య యుద్ధాలు జ‌రిగినా.. ఈ జ‌ల‌ ఒప్పందాలు మాత్రం చెక్కు చెద‌ర‌లేదు. మ‌ధ్య‌లో.. భార‌త్ పాక్ కి వ‌చ్చిన జ‌ల‌వివాదం ఎలాంటిదంటే.. ఇది ప్ర‌పంచ బ్యాంకు వ‌ర‌కూ వెళ్లింది. కిష‌న్ గంగ పై ఒక జ‌ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించింది భార‌త్. కిష‌న్ గంగ‌, రాట్లే ప్రాజెక్టులు నిర్మించిన భార‌త్ పై పాక్ ఆరోప‌ణ‌లు గుప్పించింది. అంతే త‌ప్ప.. ఈ సింధూ జ‌లాల ఒప్పందం మీద ఇంత వ‌ర‌కూ మ‌న‌కూ పాకిస్థాన్ కి  ఎలాంటి గొడ‌వా రాలేదు. ఈ ఒప్పందం ర‌ద్దు అప్పుడ‌ప్పుడూ తెర‌పైకి వ‌చ్చినా అవ‌న్నీ తామ‌రాకు మీద నీటిబొట్టులాంటిదే అయ్యింది.   అయితే ఇప్పుడు ప‌హెల్గాం దాడి త‌ర్వాత‌.. భార‌త్ ఈ జ‌ల‌ ఒప్పందం నుంచి త‌ప్పుకుంటే మొద‌ట జ‌రిగే ప‌ని.. జీలం, చినాబ్, రావి, బియాస్, స‌ట్లేజ్ వంటి న‌దీ జ‌లాలు పాక్ కి వెళ్ల‌కుండా క‌ట్ట‌డి చేసే అవ‌కాశ‌ముంది. వీటిపై భార‌త్ మ‌రింత‌ విస్తృతంగా ప్రాజెక్టులు క‌ట్టే ఛాన్సుంది. ఎప్పుడైతే.. ఈ డ్యాముల నిర్మాణం జ‌రుగుతుందో అప్ప‌టి నుంచీ పాకిస్థాన్ కి జ‌ల సంక్షోభం సంభ‌వించే ప్ర‌మాద‌ముంది. ఎప్పుడైతే ఈ న‌దీ జ‌లాల‌ ప్ర‌వాహం క‌ట్ట‌డి చేయ‌బ‌డుతుందో అప్ప‌టి నుంచీ ఆహార సంక్షోభం మొదలౌతుంది. ఎప్పుడైతే ఆహార సంక్షోభం వ‌స్తుందో ఆ నాటి నుంచి పాక్ లో క‌ర‌వు విల‌య తాండ‌వం చేస్తుంది. దీంతో పాకిస్థాన్ దాదాపు మ‌టాష్ అయిపోతుంది. అంటే ఒక్క బొట్టు కూడా ర‌క్తం చిందించ‌కుండానే ఈ నిర్జ‌ల ఉత్పాతాన్ని సృష్టించ‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఇది పాకిస్తాన్ త‌న‌కు తాను చేజేతులా చేసుకుంటున్న ఒకానొక దుశ్చ‌ర్య‌. ప‌హెల్ గాం దుండ‌గులు పాకిస్తాన్ సంబంధించిన వారేనంటూ ఇక్క‌డి నుంచి పాకిస్థాన్ దిశ‌గా వెళ్లిన డిజిట‌ల్ లింకులు చెబుతూనే ఉన్నాయి. దీని వెన‌క ల‌ష్క‌రే తోయిబాకి చెందిన‌ రెసిస్టెంట్ గ్రూప్ ఉన్నా.. దీని మూలాలు పాక్ లోనే తేలుతున్నాయి. ప్ర‌స్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, గ‌తంలో ఈ దేశ‌పు గూడాచార సంస్థ‌ ఐఎస్ఐకి చీఫ్ గా ప‌ని చేశారు. ఈ స‌మ‌యంలోనే మునీర్ కి ల‌ష్క‌రే వంటి టెర్ర‌రిస్టు గ్రూపుల‌తో విప‌రీత‌మైన  సంబంధాలు ఏర్ప‌డ్డాయి.  అత‌డే ఈ దుశ్చ‌ర్య‌కు క‌ర్త‌-కర్మ- క్రియ అంటూ కేవలం భార‌త్ మాత్ర‌మే కాదు అమెరికా సైతం విశ్వ‌సిస్తోంది. ఒక ప‌క్క అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ భార‌త్ లో ప‌ర్య‌టిస్తుండగా జ‌రిగిందీ ఉగ్ర దాడి. దీని వెన‌క పాక్  హ‌స్తం ఉన్న‌ట్టు గ‌ట్టిగా భావిస్తోన్న అమెరికా.. అంతే కాదు మునీర్ కీ లాడెన్ కీ పెద్ద తేడా లేదని యూఎస్ వాఖ్యానిస్తోందంటే.. ప్ర‌పంచ స్థాయిలో పాక్ ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు.  ఇప్పుడు సింధూ జ‌ల ఒప్పందాల ర‌ద్దు ద్వారా పాకిస్థాన్ కి జ‌రిగే న‌ష్టం ఎలాంటిదో ఉద‌హ‌రించ‌డానికి.. ఇటీవ‌లి ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణే అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌. భార‌త్ ఈ టోర్నీలో ఆడ‌టానికిగానూ పాకిస్థాన్ భూభాగంలో అడుగు పెట్టేది లేద‌ని తెగేసి చెప్పింది. దానికి తోడు రోహిత్ సైన ఫైన‌ల్ కి చేర‌డంతో.. పాకిస్థాన్ లో జ‌ర‌గాల్సిన  ఫైన‌ల్ కాస్తా దుబాయ్ లో జ‌రిగింది. దీంతో అప్పటి వ‌ర‌కూ పాక్ ఈ టోర్నీ కోసం పెట్టిన ఖ‌ర్చు మొత్తం వృధా అయ్యి... భారీ న‌ష్టం మిగిలింది. భార‌త్ తో పెట్టుకుంటే అలా ఉంటుంది. ఇక సింధూ జ‌లాల‌తో పాటు.. పాకిస్థాన్ లోని భార‌త‌ దౌత్య అధికారుల ను సైతం తిరిగి  ర‌ప్పిస్తున్నారు. ఇక్క‌డున్న పాక్ యాంబ‌సీని కూడా పెట్టేబేడ స‌ర్దుకోమంటున్నారు. అంతేనా దేశంలో ఉన్న పాకిస్తానీయులు, ఇత‌ర ప‌ర్యాట‌కుల‌ను వారం లోగా దేశం వ‌దిలి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.  ఇక‌పై పాకిస్థాన్ కి గ‌తంలో లా ఉండ‌దు. ప‌హెల్ గామ్ దాడిలో 26 మందిని పొట్ట‌న పెట్టుకున్న పాపానికి త‌గిన ప్రాయ‌శ్చిత్తం అనుభ‌వించ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే ఆ దేశం ఎల్ఓసీ ద‌గ్గ‌ర భ‌ద్ర‌త అప్ర‌మ‌త్తం చేసింది. ఇక ఏ ముహుర్తాన భార‌త సైనికులు ఏ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేస్తారో అన్న భ‌యంక‌ర‌మైన భ‌యాన్ని అనుభ‌విస్తోందీ పాపిష్టి దేశం. ఒక ప‌క్క మ‌న ర‌క్ష‌ణ  శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇంత‌కింత అనుభ‌విస్తార‌న్న హెచ్చ‌రిక‌లు జారీ చేసిన స‌మ‌యాన‌.. ఎలాంటి భ‌యాన‌క ప‌రిస్థితి ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుందో అన్న ఉత్కంఠ రాజ్య‌మేలుతోంది పాకిస్తాన్ లో. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది తాత్కాలికం. సిందూ జ‌లాల ఒప్పందం కార‌ణంగా పాకిస్థాన్ నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోతుంది. ఇటు జాలాల ఒప్పందం మాత్ర‌మే కాకుండా, అటు దౌత్య ప‌ర‌మైన సంబంధాల‌న్నిటినీ భార‌త్ పూర్తిగా తెంచుకుంటే పాకిస్థాన్ ప‌రిస్థితి వ‌చ్చే రోజుల్లో అగ‌మ్య గోచ‌ర ప‌రిస్థితి ఎదుర్కోవ‌డం ఖాయం. ఇప్ప‌టికే అమెరికా నుంచి నిధుల నిలిపివేత వేధ‌న అనుభ‌విస్తోన్న పాకిస్థాన్ కి మిగిలిన దిక్క‌ల్లా చైనా మాత్ర‌మే. అలాగ‌ని ప‌హెల్ గామ్ వంటి దాడుల‌తో రెచ్చిపోతున్న పాక్ కి అది బ‌హిరంగ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు. ఇప్ప‌టికే అమెరికా నుంచి విప‌రీత‌మైన సుంకాల దాడి ఎదుర్కుంటున్న చైనా.. త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డ్డానికే ఆప‌సోపాలు ప‌డుతుంటే.. పాకిస్థాన్ కి ప్ర‌త్య‌క్ష సాయం  చేసే ఛాన్స్ లేదు.  ఎందుకంటే భార‌త్ కూడా పొమ్మ‌న లేక పొగ‌బెడితే.. వ‌ర‌ల్డ్  బిగ్గెస్ట్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ చైనా తాను చేసిన ప్రాడ‌క్టులు తానే అమ్ముకోలేదు. పాకిస్తాన్ని ఆ దేశం ద‌గ్గ‌ర‌కు చేర్చేదే.. అతి  పెద్ద మార్కెట్ అయిన భార‌త్ ను  న‌యానా భ‌యానా ఒప్పించ‌డానికి. ఇప్పుడు పాక్ విషయంలో భార‌త్ మ‌రింత క‌ఠినంగా  వ్య‌వ‌హ‌రించ‌డంతో చైనా కూడా హ్యాండ్స‌ప్ అనాల్సిందే. వీటిన్నిటి దృష్ట్యా చూస్తే పాకిస్థాన్ వ‌చ్చే రోజుల్లో చూసే సామాజిక- రాజ‌కీయ- ఆర్ధిక- ఆహార- సంక్షోభం అతి భ‌యంక‌ర‌మైన‌దిగా అంచ‌నా వేయ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికైనా పాకిస్తాన్ ఆర్మీకున్న అధికారాల‌ను క‌త్తెరించి.. టెర్ర‌రిస్టులను స‌మూలంగా ఏరి వేస్తే త‌ప్ప‌... ఈ దేశానికి మ‌రో మార్గాంత‌రం లేదు.
ఒక్క ఒప్పందం ర‌ద్దు.. పాక్ ఖేల్ ఖ‌తం.. దుకాణం బందేనా? Publish Date: Apr 25, 2025 11:31AM

అశోక్‌గజపతిరాజుకి రాజ్యంగ పదవి!

కేంద్ర మాజీ మంత్రి,  తెలుగుదేశం సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు కీలక పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం అధిష్టానం కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తోంది. పార్టీలో చంద్రబాబు సహచరుడిగా సుదీర్ఘ కాలం కొనసాగిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలగిన ఆయనకు సమున్నత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని, త్వరలోనే అశోక్ గజపతికి అత్యున్నత స్థానం దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది.  పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం రాజవంశస్థులు. అయినా ఆయనలో ఇసుమంతైనా దర్పం కన్పించదు . ప్రజాస్వామ్యంపై ఆయనకు ఎనలేని గౌరవం.  నేటికీ ఆయన పబ్లిక్‌గా మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఆ పదం వినిపిస్తుందంటే  డెమోక్రసీ పై ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు . 1978 లో రాజకీయాల్లోకి వచ్చి 2019 వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా , కేంద్ర మంత్రిగా వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఆయన సొంతం.  ప్రస్తుతం ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం తెలుగుదేశం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వివాద రహితుడు, హుందా రాజకీయాలకు పెట్టింది పేరైన మిస్టర్ క్లీన్ కాబట్టే 2024 ఎన్నికల తరువాత టీడీపీకి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గవర్నర్ పదవి కేటాయిస్తుందనే ప్రచారం జరుగుతున్న ప్రతిసారీ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన అశోక్‌గజపతి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. అ పదవికి ఆయన మాత్రమే సూటబుల్ అని  తెలుగు తమ్ముళ్ళుతో పాటు అధినేత చంద్రబాబు కూడా అభిప్రాయపడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది .  మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడైన విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి , వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు . మరోవైపు రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న తమిళనాడు గవర్నర్ రవిని కేంద్రం తొలగిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ఖాళీలను ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో అటు బీజేపీ, ఇటు టీడీపీ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి  ఆంధ్రప్రదేశ్ కోటాలో ఇస్తారంటున్నారు. అలాగే తమిళనాడు గవర్నర్ పదవిని తెలుగుదేశం పార్టీ తీసుకోవడానికి రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది .  అదే జరిగితే టీడీపీకి కేంద్రం తరఫున లభించే తొలి గవర్నర్ పోస్టును అశోక్ గజపతిరాజుకు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో నాలుగు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం మార్చే అవకాశం ఉందంటున్నారు. వాటిలో అశోక్ గజపతిరాజుకు ఛాన్స్ లభించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2014లో మోడీ ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్‌గజపతిరాజు అంటే ప్రధానికి ఎంతో గౌరవం ఉందని, అందుకే ఆయనకు రాజ్యాంగ పదవి దక్కడం ఖాయమంటున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా అశోక్ గజపతిరాజుకే ఆ పదవి ఇవ్వడానికి కారణాలు లేకపోలేదంటున్నారు . రాష్ట్రంలో వివిధ శాఖలకు మంత్రిగా , కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా పని చేసిన అశోక్ గజపతిరాజుపై  మచ్చుకైనా ఒక్క అవినీతి మారక లేదు.  ఎక్కడా పార్టీకి సంబంధించి గానీ , ప్రజలను ఉద్దేశించి గానీ ఇప్పటివరకు వివాదాస్పదంగా మాట్లాడిన సందర్భం లేదు . టీడీపీలో అంత సీనియర్ అయినప్పటికీ ఆయన పార్టీ లైన్ ను ఎక్కడా క్రాస్ చేయలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ స్టాండే తన స్టాండ్ అన్నట్లు కట్టుబడి ఉన్నారు.  2018లో ఎన్డీఏ కూటమి నుండి టీడీపీ బయటకి వచ్చినపుడు చంద్రబాబు ఆదేశించగానే అశోక్‌గజపతి  రాజు తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు . నేటికీ ఏ ఒక్కరినీ ఏకవచనంతో పిలవడం ఆయనకు తెలీదు. తమ కుటుంబ సంస్థ అయిన మాన్సస్ ట్రస్ట్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయనను ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని ప్రజాస్వామ్యబద్దంగానే ఎదుర్కొన్నారు అశోక్ . అంతేగాని జగన్‌ని పర్సనల్‌గా టార్గెట్ చేయలేదు. నడవలేని పరిస్థితుల్లో కూడా టిక్కెట్లు ఆశించే ఈరోజుల్లో..  2024 ఎన్నికల సమయంలో వయోభారం కారణంగా ఇక ప్రత్యక్ష రాజకీయాలకు తాను అన్‌ఫిట్ అనీ,  ఇక ఎన్నికల్లో పోటీచేయనని స్వయంగా ప్రకటించారు.  ఒకవేళ కావాలి అనుకుంటే ఈ ఎన్నికల్లో ఆయనే విజయనగరం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకునే వారు . కానీ రాజకీయాల్లో కొత్త రక్తం దావాలన్నది ఆయన అభిమతం.  అదలా ఉంటే ఇప్పటికీ ఏ ఒక్కరోజూ తనకు గానీ , తన వాళ్ళకు గానీ ఫలానా పదవి కావాలని పార్టీ అధినేతను కోరిన దాఖలాలు లేవు . అంతెందుకు తన కుమార్తె విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు మంత్రి పదవి కావాలని కూడా అడగలేదట. పార్టీ చెప్పిన పని చేయడమే మన పని అనేది ఆయన సిద్దాంతం . ఈ సిద్దాంతాలు ఉండడం వల్లనే టీడీపీ నుండి గవర్నర్ అనగానే ఆయన పేరే వినిపిస్తోంది. చూడాలి మరి ప్రచారాలకు పుల్ స్టాప్ పెట్టి , ఆ రాజ్యాంగబద్ద పదవి ఆయన్ని ఎప్పుడు వరిస్తుందో.
అశోక్‌గజపతిరాజుకి రాజ్యంగ పదవి! Publish Date: Apr 25, 2025 11:07AM

ఏపీ సీఐడీ పీవీ సునీల్ కుమార్ పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జి.. ఇక అరెస్టేనా?

ఏపీసీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అరెస్టునకు రంగం సిద్ధమైందా? ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ అంజనేయులు అరెస్టైన రోజుల వ్యవధిలోనే మరో సీనియర్ పోలీసు అధికారి అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న ఎవరైనా సరే ఔననే సమాధానమిస్తారు. ముంబై నటి కాదంబరి జత్మలానీపై అక్రమంగా కేసు నమోదు చేసి ముంబై నుంచి విజయవాడ తీసుకువచ్చి అక్రమంగా నిర్బంధించిన కేసులో పీఎస్సార్ ఆంజనేయులు అరెస్టయ్యారు. ఇప్పుడు జగన్ హయాంలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ గా తన పరిమితులను మీరి, ఇష్టారీతిగా వ్యవహరించిన పీవీ సునీల్ కుమార్ అరెస్టునకు రంగం సిద్ధమైంది. పీవీ సునీల్ కుమార్ పై తాజాగా సర్వీసు నిబంధనల ఉల్లంఘనను ప్రస్తావిస్తూ తెలుగుదేశం కూటమి సర్కార్ గురువారం ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ ను గురువారం (ఏప్రిల్ 24) జారీ చేసింది.  జగన్ హయాంలో సీఐడీ చీఫ్ గానూ, అగ్నిమాపక డీజీగానూ పని చేసిన పీవీ సునీల్ కుమార్ అప్పట్లో నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఆయనపై ప్రభుత్వం ఆర్టికల్స్ ఆఫ్ చార్జి జారీ చేసింది.  ప్రభుత్వానికి  సమాచారం ఇవ్వకుండా పీవీ సునీల్‌కుమార్‌ పలుమార్లు విదేశాలకు వెళ్లారని  విచాణలో తేలిన సంగతి తెలిసిందే.   గత ప్రభుత్వ హయాంలో 2022లో జార్జియా పర్యటనకు అనుమతులు తీసుకున్న పీవీ సునీల్‌కుమార్‌ యూఏఈకి వెళ్లారనే దానిపై ఒకటి, మరో సారి ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా స్వీడన్‌ దేశానికి వెళ్లారన్నదానిపై మీద రెండోది, పోస్టింగ్  లేకుండా వెయిటింగ్‌లో ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే అమెరికా దేశానికి వెళ్లారన్న దానిపై మరోటి చొప్పున ప్రభుత్వం   ఆర్టికల్ ఆఫ్ చార్జ్ జారీ చేసింది.  అంతకు ముందు కూడా అంటే  2019లో అమెరికా వెళ్తున్నట్లు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది యూకే వెళ్లారనే దానిపైనా  చార్జ్ చేసింది.   మొత్తం ఆరు సార్లు ప్రభుత్వానికి తెలియకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలపై ఆయనను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.  పీవీ సునీల్‌కుమార్‌ మీద మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో కూడా అభియోగాలు ఉన్నాయి.  ఆరు సార్లు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపైన విచారణ చేపట్టేందుకు సీనియర్‌ ఐఏఎస్, స్పెషల్‌ సీఎస్‌ స్థాయిలో ఉన్న ఆర్‌పీ సిసోడియాను విచారణ అధికారిగా నియమించింది. ఐపీఎస్‌ అధికారులు విదేశాల పర్యటనలకు వెళ్లే ముందు చైన్‌ ఆఫ్‌ కమాండ్‌ ప్రోటోకాల్‌లను పాటించాలని, కానీ పీవీ సునీల్‌ కుమార్‌ పదే పదే నిబంధనలను ఉల్లంఘించారని, ఇది క్రమ శిక్షణా రాహిత్యంగా పరిగణించడంతో పాటుగా ఆలిండియా సర్వీసెస్‌ రూల్స్‌ కింద సస్పెండ్‌ చేస్తున్నట్లు ఇది వరకు తెలిపిన ప్రభుత్వం తాజాగా ఆర్టికల్స్‌ ఆఫ్‌ ఛార్జ్‌ను నమోదు చేసింది.
ఏపీ సీఐడీ పీవీ సునీల్ కుమార్ పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జి.. ఇక అరెస్టేనా? Publish Date: Apr 25, 2025 10:28AM

కాళ్ల పారాణి ఆరక ముందే!

జమ్మూ కశ్మీర్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు సాగించిన మారణకాండ మామూలు విషాదం కాదు. మాటలకందని మహా విషాదం. ముష్కర మూకలు సాగించిన రాక్షస కృత్యం.  అవును. పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని విషాదంలో ముంచెత్తిన మహా విషాదం. ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన రాక్షస కృత్యం. బార్య కళ్ళెదుట భర్తను, పిల్లల కళ్ళెదుట తండ్రిని, తల్లి కళ్ళెదుట ఎదిగొచ్చిన కొడుకును  తూటాలకు బలిచేసిన మహా ఘాతుకం. పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు చేసిన ఈ ఉగ్రదాడిలో మరణించిన ప్రతి ఒక్కరిదీ ఒక విషాద వ్యథ. గుండెలు పిండే విషాదం.   అందులోనూ దేశం మొత్తం కన్నీరు పెట్టేలా చేసిన నేవీ ఆఫీసర్  వినయ్ నర్వాల్  వ్యధ మరింత విషాదం. కేవలం వారంరోజుల క్రితమే వినయ్ నావల్, హిమాన్షి మూడు ముళ్ళ బంధంతో  ఒకటయ్యారు. హనీ మూన్ కు కశ్మీర్ వెళ్లారు. అదే వారు చేసిన తప్పో లేక హిందువులుగా పుట్టడమే వారు చేసిన మహాపరాధమో కానీ  హనీమూన్ విషాదంగా మారింది. ఉగ్రవాదులు హిమాన్షి కళ్ళ ముందే  వినయ్ నావల్ ని కాల్చి చంపారు.   పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. కానీ,ఒక్క వారం రోజుల వ్యవధిలోనే ఆ కొత్త జంట నూరేళ్ళ జీవితం ముగిసి పోయింది. పెళ్లి కలలు కరిగి పోయాయి. నవవధువు పాదాల పారాణి ఆరక ముందే, కళ్యాణ తిలకం ఆమె కన్నీళ్ళలో కరిగి గుండెల్లోకి జారిపోయింది.  అవును. ఏప్రిల్ 16 న ముస్సోరీలో  మూడు ముళ్ళ సాక్షిగా ఆ ఇద్దరు ఒకటయ్యారు. ఏప్రిల్ 19న కర్నల్ లో బంధు మిత్రులకు వివాహ విందు ఇచ్చారు. అందరి ఆశీస్సులు అందుకున్నారు. ఏప్రిల్ 21న  హనీమూన్ కు కశ్మీర్ చేరుకున్నారు. ఏ ప్రిల్ 22.. ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపారు  ఏప్రిల్ 23న అతడి మృతదేహం కర్నల్ చేరుకుంది. ఎంతో భవిష్యత్ ఉన్న నేవీ ఆఫీసర్  వినయ్ నావల్ నూరేళ్ళ స్వప్నం.. విషాద చిత్రంగా మిగిలి పోయింది. నిజానికి గతంలోనూ  దేశంలో అనేక చోట్ల  ఉగ్ర దాడులు జరిగాయి. విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఎన్నో ప్రాణాలను ఉగ్రవాదులు బలితీసుకున్నారు. కానీ, పహల్గాం ఉగ్రదాడి  హిందువులే లక్ష్యంగా సాగిన ఉగ్రదాడి. ఉగ్రవాదులు తూటా పేల్చేందుకు ముందుగా  విక్టిమ్’  ఎవరో, ఏ మతమో అడిగి నిర్ధారణ చేసుకుని ఆ తర్వతనే తూటాలు పేల్చారు.  వినయ్ నర్వాల్ విషయంలోనూ అదే జరిగింది. ఆ ఇద్దరు బేల్ పూరి తింటున్న సమయంలో,  ఉగ్రవాది ఒకడు నర్వాల్ ని సమీపించి నువ్వు ముస్లిమా అని అడిగాడు.. కాదనగానే కాల్చి చంపాడు. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. హిమాన్షి స్పాట్లో చెప్పిన, వీడియోలో రికార్డు అయిన సత్యం. ఇలా జరుగుతుందని, ఎప్పుడు అనుకోలేదని  ఆమె భోరు మన్నారు.  ఇంకా విషాదం ఏమంటే, మరో వారం రోజుల్లో  మే 1న నర్వాల్ ని 27పుట్టిన రోజు. ఇంతలోనే ఈ విషాదం. మరో రెండు రోజుల్లో కొత్త జంట, కొచ్చి నేవీ క్యాంపు లో కొత్త జీవితం (కాపురం) ప్రారంభించేందుకు  ముహూర్తం పెట్టుకున్నారు. కానీ  ఇంతలోనే  ఉగ్రవాదులు ‘మృత్యు’ ముహూర్తం పెట్టారు. ప్రాణాలు తీశారు.  కర్నాల్ సిటీలో నర్వాల్ ఇంటి ముందున్న పెళ్లి పందిరి, పందిరికి కట్టిన పచ్చటి మామిడి తోరణాలు, అలంకారాలు అలా ఉండగానే, అదే పందిరిలోకి నర్వాల్ శవ పేటిక వచ్చింది. ఆ విషాద దృశ్యం చూసి కంటతడి పెట్టని వారు లేరు. తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మలు, తల్లి తండ్రులు బంధువులు, మొత్తం కర్నాల్ నగరమే కన్నీరు మున్నీరైంది. సరే హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్, మరి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు నర్వాల్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు, నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.  ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగేలా చూస్తుందని  హామీ ఇచ్చారు.  కానీ.. పాదాల పారాణి అయినా అరక ముందే భర్తను కోల్పోయిన హిమాన్షి కి ప్రభుత్వం ఏమి  న్యాయం చేస్తుంది. ఆ తల్లితండ్రుల కడుపు కోతకు ప్రభుత్వం ఏ విధంగా తీరుస్తుంది?  అయినా  పభుత్వం మహా అయితే.. పోయిన ప్రాణానికి విలువ కట్టి, నష్ట పరిహారం ఇస్తే ఇవ్వవచ్చును ?  పెళ్ళయి పది రోజులు అయినా  కాకముందే  చెరిగిన నుదిటి బొట్టుకు నష్ట పరిహారం  ఇంతని ఎవరు ఖరీదు కడతారు?  ఏదో ఇస్తారు, ఏదో జరుగుతుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిజ్ఞ చేసిన విధంగా  ఉగ్రవాది ఎక్కడ నక్కినా, వెతికి, వేటాడి శిక్షించ వచ్చును. ఇంకా ఏమైనా  చేయవచ్చును.కానీ కంటి తుడుపు చర్యలు, ప్రకటనలు, ప్రగల్భాలతో ప్రయోజనం ఉంటుందా? ఉగ్రవాదానికి ముగింపు ఉంటుందా?
కాళ్ల పారాణి  ఆరక ముందే! Publish Date: Apr 25, 2025 9:56AM

పీఓకేలో 42 ఉగ్ర లాంచ్ ప్యాడ్స్!

పాక్ భారత్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు అన్ని రకాలుగా సహాయపడుతోందన్నడానికి మరో తిరుగులేని ఆధారాన్ని భారత భద్రతా దళాలు కనిపెట్టాయి. పాక్  ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ద్వారా ఉగ్రవాదులను భారత్ లోకి పంపి విధ్వంసం, హింసా సృష్టించేందుకు పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను భద్రతా బలగాలు వెలుగులోకి తీసుకువచ్చాయి. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, వారిని భారత్ లోకి పంపించేందకు పాకిస్థాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏకంగా 42 లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేసింది. ఈ లాంచ్ ప్యాడ్ లను గుర్తించిన భారత భద్రతా బలగాలు.. అక్కడ నుంచి భారత్ లోకి చొరబడేందుకు దాదాపు 130 మంది ఉగ్రవాదులు రెడీగా ఉన్నాయని గుర్తించారు. ఈ ఉగ్రవాదులంతా పై నుంచి? ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని భద్రతా దళాలు పేర్కొన్నారు. భారత్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించడమే వీరి లక్ష్యమని తెలుస్తోంది. అలాగే హిజ్బుల్ ముజాహిదీన్, జైషేమహ్మద్, లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 60 మంది ఉగ్రవాదులు, వారికి తోడుగా స్థానిక టెర్రరిస్టులు పాకిస్థాన్ లో యాక్టివ్ గా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.  
 పీఓకేలో 42 ఉగ్ర లాంచ్ ప్యాడ్స్! Publish Date: Apr 25, 2025 9:33AM

మునక్కాయలు.. కిడ్నీలో రాళ్లు.. ఈ రెండింటికి సంబంధం తెలుసా?

  మునక్కాయలు వేసవి కాలంలో విరగకాస్తాయి.  చాలామందికి మునగ కాయలతో చేసే వంటకాలు అంటే చాలా ఇష్టం.  ఈ మధ్య కాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చూస్తూనే ఉన్నాం. ఇలా కిడ్నీలో రాళ్ల సమస్యకు మునక్కాయ మంచి పరిష్కారం అవుతుందని  సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో పూర్తీగా తెలుసుకుంటే.. మునగకాయలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు విచ్చిన్నమవుతాయట. అవి బయటకు వచ్చేస్తాయట. ఈ విషయాన్ని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు మునక్కాయలను ఎడాపెడా తింటున్నారు.  మునక్కాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పోషకాలు కూడా మెరుగ్గా ఉంటాయి. మునక్కాయలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది మూత్ర పిండాల ఆరోగ్యాన్ని, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా మెరుగుపరుస్తుంది.  ఇవన్నీ నిజమే కానీ.. మూత్రపిండాలలో రాళ్లను విచ్చిన్నం చేసి వాటిని బయటకు రావడంలో మునక్కాయలు సహాయపడతాయి అనే మాట మాత్రం అస్సలు నిజం కాదని వైద్యులు అంటున్నారు. మునక్కాయలు మాత్రమే కాదు.. ఏ కూరగాయ కూడా కిడ్నీలో రాళ్లు పోగొట్టడంలో నేరుగా సహాయపడదు అని వైద్యులు అంటున్నారు.  మునక్కాయలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు పోతాయనే అపోహతో వాటిని ఎక్కువ తింటే అది ఆరోగ్యానికి హాని చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. మునగతో లాభం.. మునగ తినడం వల్ల ఖనిజాలు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. ఇది కొత్త రాళ్ళు ఏర్పడే ప్రక్రియను ఖచ్చితంగా ఆపుతుంది. ఈ కూరగాయలోని యాంటీఆక్సిడెంట్లు,  నిర్విషీకరణ లక్షణాలు మూత్రపిండాల నిర్విషీకరణకు,  మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది అనేక ఇతర ఆరోగ్య సమస్యల  నుండి దూరంగా ఉంచుతుంది. మునగతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కానీ మునగను తినడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు పోతాయనే మాట మాత్రం వాస్తవం కాదు. కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇలాంటి ప్రయోగాలు చేయకుండా వైద్యులను సంప్రదించడమే మంచిది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
మునక్కాయలు.. కిడ్నీలో రాళ్లు.. ఈ రెండింటికి సంబంధం తెలుసా? Publish Date: Apr 25, 2025 9:30AM

మలేరియా అంతమే అంతిమ లక్ష్యం కావాలి..

నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం. మలేరియా గురించి అవగాహన పెంచడానికి,  వ్యాధిని నియంత్రించడానికి, నివారించడానికి,  చివరికి మలేరియాను రూపుమాపడానికి  చర్యలను ప్రోత్సహించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఏర్పాటు చేసిన రోజిది.  ప్రతి సంవత్సరం మలేరియా దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తారు.  ఈ సంవత్సరం మలేరియా దినోత్సవం  థీమ్.. "మలేరియా మనతోనే అంతం అవుతుంది.  ఇది మలేరియా నిర్మూలన వైపు పురోగతిని వేగవంతం చేయడానికి అన్ని స్థాయిలలో ప్రయత్నాలను  శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.  ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా సంక్రమించే పరాన్నజీవుల వల్ల వచ్చే మలేరియా లక్షలాది మంది ప్రజలను, ముఖ్యంగా ఉష్ణమండల,  ఉపఉష్ణమండల ప్రాంతాలలో ప్రభావితం చేస్తూనే ఉంది. మలేరియా దినోత్సవం  మలేరియాను ఎదుర్కోవడంలో సాధించిన పురోగతిని అందరికీ గుర్తు చేస్తుంది.  ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకునేందుకు అవకాశం ఇస్తుంది.   వ్యాధి భారాన్ని తగ్గించడానికి వనరులు, ఆవిష్కరణలు,  ప్రజల భాగస్వామ్యాన్ని సమీకరిస్తుంది. చికిత్సతో పాటు, ఈ ప్రాణాంతక అనారోగ్యం నుండి వ్యక్తులు,  సమాజాలను రక్షించడంలో నివారణ చిట్కాలు కీలకమైనవి. మలేరియా ముందస్తు హెచ్చరిక సంకేతాలు & లక్షణాలు.. మలేరియా ముందస్తు హెచ్చరిక సంకేతాలు,  లక్షణాలు ఇతర వైద్య పరిస్థితులకు దగ్గరగా ఉండవచ్చు. అయితే మలేరియా తీవ్రత మారవచ్చు.  మలేరియాను వ్యాప్తి చేసే  దోమ కుట్టిన 10-15 రోజుల తర్వాత లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, మలేరియా అవయవ వైఫల్యం, కోమా లేదా మరణం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మలేరియా అని  అనుమానించినట్లయితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మలేరియా  సాధారణ ముందస్తు హెచ్చరిక సంకేతాలు.. జ్వరం అకస్మాత్తుగా వచ్చే అధిక జ్వరం అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. చలి చాలా మందికి చలి వస్తుంది. అది తీవ్రంగా ఉండవచ్చు. తరువాత చెమట పడుతుంది. చెమటలు పడటం చలి తర్వాత, జ్వరం తగ్గవచ్చు,   విపరీతంగా చెమట పట్టవచ్చు. తలనొప్పి మలేరియా కేసుల్లో తలనొప్పి, తరచుగా మధ్యస్థం నుండి తీవ్రంగా ఉండటం సాధారణం. అలసట చాలా అలసటగా లేదా బలహీనంగా అనిపించడం విలక్షణమైనది, ఇతర లక్షణాలు తగ్గిన తర్వాత కూడా ఇది కొనసాగవచ్చు. వికారం,  వాంతులు మలేరియా ఉన్న చాలా మంది వ్యక్తులు వికారం,  వాంతులు అనుభూతి చెందుతారు. కండరాలు,  కీళ్ల నొప్పి కండరాలు,  కీళ్లలో నొప్పులు సర్వసాధారణం. రక్తహీనత ఈ పరాన్నజీవి ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. ఇది రక్తహీనతకు (తక్కువ ఎర్ర రక్త కణాల సంఖ్య) దారితీస్తుంది. దీని వలన అలసట, బలహీనత,  పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు కొంతమందికి తేలికపాటి దగ్గు వస్తుంది. కడుపు నొప్పి కొంతమంది వ్యక్తులు పొత్తికడుపులో అసౌకర్యం లేదా నొప్పిని అనుభవిస్తారు. పై లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.                                        *రూపశ్రీ.
మలేరియా అంతమే అంతిమ లక్ష్యం కావాలి.. Publish Date: Apr 25, 2025 9:30AM

మలేరియా గురించి అపోహలు, వాస్తవాలు.. మలేరియా నివారణకు చేయవలసిన పనులు ఇవే..!

  మలేరియా జ్వరంగా పరిగణించబడే సమస్య.  మలేరియా వ్యాధి గురించి చాలామందిలో చాలా అపోహలు ఉంటాయి.  వాటినే నిజం అనుకుంటూ ఉంటారు.  దీని వల్ల మలేరియా కారణంగా కలిగే నష్టమే ఎక్కువ ఉంటుంది.  అపోహలు,  వాస్తవాల గురించి.. అలాగే  మలేరియా వ్యాధి నివారించడానికి చేయవలసిన పనుల గురించి తెలుసుకుంటే.. అపోహ: మలేరియా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే వస్తుంది. వాస్తవం: గ్రామీణ,  పట్టణ ప్రాంతాలలో మలేరియా సంభవించవచ్చు. నీరు నిలిచి ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలు దోమల వృద్ధికి ఎక్కువగా గురవుతుండగా, ముఖ్యంగా పారిశుధ్యం,  నీటి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక ప్రాంతాలలో దోమలు ఎక్కువ ఉంటే  నగరాల్లో కూడా మలేరియా వ్యాప్తి చెందుతుంది. అపోహ: రాత్రిపూట మాత్రమే ఇన్పెక్షన్  దోమ నుండి మలేరియా వస్తుంది. వాస్తవం: మలేరియాను వ్యాప్తి చేసే అనాఫిలిస్ దోమలు ప్రధానంగా సంధ్యా సమయంలో,  తెల్లవారుజామున చురుకుగా ఉంటాయి. కొన్ని జాతులు రోజంతా కూడా కుట్టగలవు. అన్ని సమయాల్లో..  ముఖ్యంగా మలేరియా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో దోమ కాటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. అపోహ: మలేరియా వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. వాస్తవం: మలేరియా వ్యక్తి నుండి వ్యక్తికి నేరుగా సంక్రమించదు. రక్త మార్పిడి ద్వారా లేదా గర్భధారణ సమయంలో తల్లి నుండి బిడ్డకు వంటి అరుదైన సందర్భాలలో తప్ప. ఇది ప్రధానంగా సోకిన అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. అపోహ: ఒకసారి మలేరియా బారిన పడిన తర్వాత జీవితాంతం దానికి రోగనిరోధక శక్తి ఉంటుంది. వాస్తవం: ఒకసారి మలేరియా బారిన పడటం వల్ల జీవితాంతం రోగనిరోధక శక్తి లభించదు. పదే పదే వ్యాధి బారిన పడటం వలన కాలక్రమేణా పాక్షిక రోగనిరోధక శక్తి ఏర్పడవచ్చు. కానీ అది పూర్తి రక్షణకు హామీ ఇవ్వదు. గతంలో మలేరియా బారిన పడిన వ్యక్తులు కూడా పరాన్నజీవికి గురైతే మళ్ళీ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మలేరియా నివారణ కోసం చేయవలసినవి.. మలేరియా నివారణలో దోమల బారిన పడటాన్ని తగ్గించే,  పరాన్నజీవి వ్యాప్తి చెందకుండా నిరోధించే పద్ధతుల ఉంటాయి. వీటితో పాటు, ప్రభావవంతమైన నివారణ,  చికిత్స కోసం మలేరియాను ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఇవి మలేరియా సంక్రమించే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించడానికి,  ఈ ప్రమాదకరమైన వ్యాధి నుండి తమను తాము మాత్రమే కాకుండా  ఇతరులను రక్షించుకోవడానికి  సాధారణంగా చేయవలసినవి ఏంటంటే.. కీటక వికర్షకాలను వాడాలి.. దోమలను దూరంగా ఉంచడానికి  చర్మంపై DEET, పికారిడిన్ లేదా నిమ్మకాయ యూకలిప్టస్ నూనె కలిగిన క్రిమి వికర్షకాన్ని పూయాలి. దోమల తెర.. ముఖ్యంగా రాత్రిపూట దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నిద్రపోయేటప్పుడు దోమతెర ఉపయోగించాలి. రక్షణ.. ముఖ్యంగా సాయంత్రం,  తెల్లవారుజామున దోమలు ఎక్కువగా ఉండే సమయంలో పొడవాటి చేతుల చొక్కాలు,  పొడవాటి ప్యాంటు ధరించాలి. దోమల తెరలు.. దోమలు ఇంటి లోపలికి రాకుండా నిరోధించడానికి కిటికీలు,  తలుపులకు దోమల తెరలు ఉండేలా చూసుకోవాలి. దోమలు పెరిగే ప్రాంతాలు..  ఇంటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించాలి.  ఎందుకంటే దోమలు ఎక్కువ కాలం నిలిచి ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. బకెట్లు,  పూల కుండలు,  వర్షపు నీటితో నిండిన పాత టైర్లు వంటివి తొలగించాలి. యాంటీమలేరియల్ మందులు..  మలేరియా వ్యాప్తి చెందుతున్న ప్రాంతానికి ప్రయాణిస్తుంట, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి  వైద్యుడు సూచించిన యాంటీమలేరియల్ మందులను తీసుకోవాలి.  వైద్య సహాయం.. ముఖ్యంగా మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతానికి ప్రయాణించిన తర్వాత జ్వరం, చలి లేదా అలసట వంటి లక్షణాలు ఎదురైతే ముందస్తు రోగ నిర్ధారణ,  చికిత్స కోసం వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
మలేరియా గురించి అపోహలు, వాస్తవాలు.. మలేరియా నివారణకు చేయవలసిన పనులు ఇవే..! Publish Date: Apr 25, 2025 9:30AM

ప్రతి భర్త రోజూ ఈ 5 పనులు చేస్తే బార్య ఎప్పటికీ నిరాశ పడదు..!

వివాహం అనేది భారతీయ సమాజంలో జీవితాంతం నిలిచే బంధంగా పరిగణించబడే సంబంధం. అయితే  ఈ జీవిత బంధాన్ని సంతోషంగా గడపాలనుకుంటే ఆ సంబంధంలో ప్రేమ, గౌరవం అవసరం. చాలా మంది భార్యాభర్తలు ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు కానీ  వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు, వాటిలో ఒకటి నిరాశ. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలి తన భర్త ఇంటికి వచ్చినప్పుడు, ఆమె అతన్ని అంగీకరించడమే కాకుండా తన భర్త పద్ధతులను, ఇష్టాయిష్టాలను కూడా స్వీకరిస్తుంది. కానీ ఒక పురుషుడు తన భార్య తనకు ఎంత ప్రత్యేకమైనదో ఆమెకు తెలియజేయడంలో విఫలమవుతాడు. ఈ కారణంగా  స్త్రీలు తమ భర్తల పట్ల,  ఆ సంబంధం పట్ల నిరాశ చెందుతారు.  భర్త భార్యను నిరాశపరచకూడదనుకుంటే, ఆమె భర్తను ఎల్లప్పుడూ ప్రేమించాలని,   సంబంధం సంతోషంగా ఉండాలని కోరుకుంటే ప్రతి భర్త ఈ ఐదు పనులు ప్రతిరోజూ చేయాలి. ప్రేమను వ్యక్తపరచడం..  అవకాశం దొరికినప్పుడల్లా భార్యతో "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పాలి.  ప్రేమను వ్యక్తపరచడం వల్ల  భార్య పట్ల  శ్రద్ధ వహిస్తున్నారని ఆమెకు భరోసా లభిస్తుంది. రోజూ  ప్రేమను వ్యక్తపరచడంతో పాటు వారితో రోజుకు రెండు మూడు సార్లు ప్రేమగా మాట్లాడితే మహిళలు కూడా దీన్ని చాలా ఇష్టపడతారు. ప్రేమ ఉంది కానీ దానిని వ్యక్తపరచకపోతే లేదా చూపించకపోతే భార్యకు ఎలా తెలుస్తుంది? కలిసి తినడం.. దంపతులు ఎంత బిజీగా ఉన్నా కనీసం  భోజనం కలిసి తినాలి. భర్త రోజుకు ఒకసారి అయినా భార్యతో కూర్చుని భోజనం చేయాలి. అల్పాహారం అయినా, భోజనం అయినా, రాత్రి భోజనం అయినా ఇద్దరూ కలిసి కూర్చుని భోజనం చేసినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే కుటుంబం ఉన్నప్పటికీ భర్త లేకుండా భార్య భోజనం చేసినప్పుడు ఆమె ఒంటరిగా ఫీలవుతుంది. కాబట్టి భర్త  తన భార్యతో కలిసి భోజనం  చేయడానికి సమయం కేటాయించాలి. బయటకు వెళ్ళే ముందు.. ఆఫీసుకు వెళ్లే ముందు భార్యతో సమయం గడపాలని కోరుకుంటున్నారని, కానీ మీరు పనికి వెళ్లాలని ఆమెకు అనిపించేలా చేయండి. దీనికోసం మీరు ప్రేమపూర్వకమైన ఒక నోట్ రాయవచ్చు లేదా ఇంటి నుండి బయలుదేరే ముందు వారిని కౌగిలించుకుని  జాగ్రత్త చెప్పవచ్చు.  ఈ చిన్న  విషయాలు వారికి  ప్రేమను అర్థం అయ్యేలా చేస్తుంది. కౌగిలి.. ఉదయం నిద్ర లేవగానే  భార్యను కౌగిలించుకోవడం ప్రతి భార్య చాలా సేఫ్ ఫీలింగ్ అనుభూతి చెందుతుంది. ప్రతి భార్య తన భర్త చేతుల్లో సురక్షితంగా,  సుఖంగా ఉంటుంది. ప్రేమను వ్యక్తపరచడానికి,  భార్య హృదయాన్ని గెలుచుకోవడానికి కౌగిలించుకోవడం మంచి మార్గం.  ఆఫీసుకు వెళ్ళేటప్పుడు లేదా తిరిగి వచ్చినప్పుడు భార్యను కౌగిలించుకోవడం ఇద్దరికీ చాలా ఊరట ఇస్తుంది. ఫిర్యాదు వద్దు, మద్దతు ఇవ్వాలి.. మహిళలు తమ భర్తలను, అత్తమామలను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఆమె తన భర్త మద్దతు మాత్రమే కోరుకుంటుంది. అయితే, భర్త తమ భార్య లోపాల గురించి ఫిర్యాదు చేసినప్పుడు భార్య నిరుత్సాహపడుతుంది. మీరు వారితో ఉన్నారనే భావన వారికి కలిగించాలి. ఫిర్యాదు చేయడానికి బదులుగా, చిన్న పనులలో వారికి మద్దతు ఇవ్వాలి. మంచం సర్దడం లేదా  టీ తయారు చేయడం వంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా  వారి హృదయాలను గెలుచుకోవచ్చు.                                 *రూపశ్రీ
 ప్రతి భర్త రోజూ ఈ 5 పనులు చేస్తే బార్య ఎప్పటికీ నిరాశ పడదు..! Publish Date: Apr 25, 2025 9:30AM

ప్రధానిని ఆహ్వానించేందుకు హస్తినకు చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోదీ జీ అమరావతి పర్యటన  ఖరారైన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ అమరాతి పనుల పున: ప్రారంభోత్సవానికి మే 2వ  రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రోడ్ షోలో కూడా పాల్గొంటారు. మొత్తం మీద గంట సేపు సాగే ఆయన పర్యటన కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ప్రధానంగా అమరావతి  చరిత్ర తెలిపేవిధంగా ఏర్పాటు చేయనున్న పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందం టున్నారు. కాగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం (ఏప్రిల్ 25) ఢిల్లీ వెళ్లనున్నారు. అమరావతి పర్యటనకు ప్రధాని షెడ్యూల్ ఇలా ఉ:ది. మే2 మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో అమరావతిలో  దిగుతారు. అక్కడ నుంచి సభాస్థలి వరకూ దాదాపు కిలోమీటర్ పైగా దూరానికి రోడ్ షో ద్వారా వెడతారు. ఈ రోడ్ షో దాదాపు 15 నిముషాల పాటు సాగుతుంది.  అనంతరం అమరావతి పెవిలియన్ ను సందర్శిస్తారు. ఆ తరువాత అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఇలా ఉండగా  ప్రధాని సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు.  వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికపై 100 మంది ఉంటారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదిక ఏర్పాటు చేస్తున్నారు.   ప్రధాని సభ ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ కోసం ఆరుగురు మంత్రులలో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో మంత్రులు  నారాయణ, పయ్యావుల,  నారా లోకేశ్, సత్య కుమార్ యాదవ్,   నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్రలు ఉన్నారు.  అలాగే ఈ పర్యటనకు నోడల్ అధికారిగా జి.వీరపాండియన్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది.  
ప్రధానిని ఆహ్వానించేందుకు హస్తినకు చంద్రబాబు Publish Date: Apr 25, 2025 9:13AM

పాక్ హైకమిషన్ లోకి కేక్.. సంబరాల కోసమే అంటూ జనాగ్రహం.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

ఢిల్లీలోని  పాకిస్తాన్  హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేల సంఖ్యలో జనం ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బారికేడ్స్ అడ్డుపెట్టి జనాలను నిలువరించారు. విషయమేంటంటే.. పెహల్గాం ఉగ్రదాడిలో 27 మంది మరణించిన ఘటనపై దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగి ఉన్న సమయంలో పాక్ హైకమిషన్ కార్యాలయం కేక్ ఆర్డర్ చేసి సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమైందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఓ వైపు ఉగ్రదాడి మృతుల అంత్యక్రియలు జరుగుతున్న వేళ.. ఓ వ్యక్తి కేక్ తీసుకుని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలోకి వెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడి యోలో ఓ వ్యక్తి చేతిలో కేక్ తో పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి వడివడిగా నడుచుకువెడుతున్నాడు. అక్కడ ఉన్న మీడియా అతనిని ప్రశ్నిస్తోంది. అయితే మీడియా ప్రతినిథులకు సమాధానం ఇవ్వకుండా ఆ కేక్ ను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ వీడియోపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పెహల్గాం ఉగ్రవాదిలో మరణించిన వారి కోసం యావత్ దేశం కన్నీరు పెడుతుంటే, శోక సంద్రంలో మునిగిపోయి ఉంటే.. పాకిస్థాన్ సంబరాలు చేసుకుంటోందంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అదీ భారత గడ్డ మీద పాక్ హైకమిషన్ కార్యాలయం ఈ సంబరాలకు వేదిక కావడం ఆ దేశం తెంపరి తనానికి, పైశాచికత్వానికి నిలువెత్తు నిదర్శనమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్ హైకమిషన్ లో సంబరాలు అంటూ వార్త   వేగంగా వ్యాపించింది. భారత్ విషాద సాగరంలో మునిగి ఉన్న సమయంలో అదే గడ్డ మీద పాకిస్థాన్ సంబరాలా అంటూ జనం ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా భారత్ హైకమిషన్ వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు.  అదలా ఉంటే.. పెహల్గాం ఉగ్రదాడి తరువాత కూడా పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది.   సింధు నదీ జలాల్లో ప్రతి నీటిబొట్టూ పాకిస్థాన్ కే చెందుతుందంటూ ఆ దేశ మంత్రి అవాయిస్ లెఘారీ పేర్కొన్నారు. ఇండస్ వాటర్ ట్రయిటీ నుంచి భారత్  ఏకపక్షంగా వైదలగడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమనడమే కాకుండా, భారత్ నిర్ణయాన్ని రాజకీయంగా, న్యాపరంగా ఎదుర్కొంటామనీ, భారత్ కు గట్టి గుణపాఠం చెబుతామని సవాల్ విసిరారు. అంతర్జాతీయ సంస్థలకు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదలగజాలదనీ, భారత్ కు ఆ హక్కు లేదనీ పేర్కొన్నారు.  ఇలా ఉంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్  నుంచి భారత్ లో చొరబడి విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు భారీ ప్రణాళిక రచించినట్లు భద్రతా బలగాలు చెప్పాయి. పీకోకేలో ఇందు కోసం ఉగ్రవాదులు  42 లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేశాయని గుర్తించినట్లు భద్రతాబలగాలు వెల్లడించాయి. దాదాపు 130 మంది టెర్రరిస్టులు భారత్ లో చొరబడేందుకు తమ బాస్ ల ఆదేశాల కోసం ఎదురు చేస్తున్నారని పేర్కొన్నాయి.   
పాక్ హైకమిషన్ లోకి కేక్.. సంబరాల కోసమే అంటూ జనాగ్రహం.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత Publish Date: Apr 24, 2025 4:24PM

ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

కర్రెగుట్టల్లో యుద్ధ వాతావరణం భీకర కాల్పులు.. వేల సంఖ్యలో మావోయిస్టులు..  వాయుసేన సహకారంతో భద్రతా దళాల కూంబింగ్ ఛత్తీస్‌గఢ్‌లో  ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.  ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ధర్మ తాళ్లగూడెంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. నక్సల్స్ ముక్త ఆపరేషన్ లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో గత కొంత కాలంగా భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. కాల్పులు విరమించి శాంతి చర్చలకు రావాలని మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇలా ఉండగా   చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని కర్రె గుటల్లో రెండ్రోజులుగా పెద్ద సంఖ్యలో భద్రతా దళాలు మోహరించి మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. అక్కడ దాదాపు 3000 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈ గాలింపు జరుగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో యుద్ధ మేఘాలు అలముకున్నాయి.  వేల సంఖ్యలో భద్రత దళాలు కర్రెగుట్టలను చుట్టు ముట్టాయి. వాయుసేన కూడా ఈ కూంబింగ్ లో భాగస్వామి అయ్యిందంటేనే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఈ ఆపరేషన్ తో  నక్సల్స్ ముక్త భారత్ దిశగా పడుతున్న అడుగులు ముగింపు దశకు వచ్చినట్లే అవుతుందని కూడా అంటున్నారు.  కూబింగ్ నిలిపివేయాలి, శాంతి చర్చ లకు పిలవాలి అంటూ మావోయిస్టులు   రాసిన లేఖను  కేంద్రం పట్టించుకున్న దాఖలాలు కనిపిం చడం లేదు.   వచ్చే ఏడాది మార్చినాటికి నక్సల్స్ ముక్త భారత్ ను చూడాలన్న లక్ష్యంతో  కేంద్రం అడుగులు వేస్తున్నది. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో వేల సంఖ్యలో భద్రతా దళాలను రంగంలోకి దింపింది. స్థానిక పోలీసులు, గ్రేహౌండ్స్, సీఆర్ పీఎఫ్, సైన్యం సంయుక్త ఆపరేషన్ కింద ఆపరేషన్ కగార్ సాగుతోంది.  ఇప్పుడు మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా మారిన కర్రెగుట్టల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి.   తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంతోపాటు ఎత్తయిన గుట్టలతో సుమారు 53 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కర్రెగుట్టలను మావోయిస్టులు అత్యంత సేప్టీ జోన్ గా భావిస్తుంటారు. ఆ కారణంగానే అందుకే ఛత్తీస్ గఢ్ లో తమ ఆనుపానులన్నీ భద్రతా దళాలు తెలుసుకుని దాడులు చేస్తుండటంతో మావోయిస్టులు కర్రెగుట్టల్లో తలదాచుకున్నారు. ఇలా ఇక్కడ మకాం వేసిన వారిలో  పార్టీ అగ్రనేతలు కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  దీంతో ఆ ప్రాంతంలో వేల సంఖ్యలో జవాన్లను మొహరింపజేసి కూంబిగ్ నిర్వహిస్తున్నారు. కర్రెగుట్టలకు దారితీసే అన్ని మార్గాలనూ దాదాపుగా చుట్టుముట్టేశారు.  మావోయిస్టుల ఆచూకీ కోసం కర్రెగుట్టలను వాయిసేన విమానాలు జల్లెడపడుతున్నాయి.  కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే కర్రెగుట్టల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయని అంటున్నారు. కర్రెగుట్టలను భద్రతా బలగాలు మోహరించిన నేపథ్యంలో హరగోపాల్ వంటి పౌరహక్కుల సంఘం నేతలు రంగంలోకి దిగి.. శాంతి చర్చల కోసం మావోలు లేఖ రాసిన తరువాత కూడా ఈ తీరులో ఏరివేత కార్యక్రమం కొనసాగించడాన్ని తప్పుపడుతున్నారు. వెంటనే కూంబింగ్ నిలిపివేసి శాంతి చర్చలకు మావోయిస్టులను పిలవాలని కోరుతున్నారు. 
ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి Publish Date: Apr 24, 2025 3:11PM