టీ-కాంగ్రెస్ సభకి అధిష్టానం ఆశీస్సులు
Publish Date:Jun 29, 2013
Advertisement
ఇంత కాలం టీ-యంపీ, టీ-యంయల్యే, టీ-మంత్రులు అంటూ వేర్వేరు గ్రూపులుగా వ్యవహరిస్తూ వచ్చిన టీ-కాంగ్రెస్ నేతలందరూ, రేపు నిజం కాలేజీ మైదానంలో జరగబోయే సభను విజయవంతం చేయడం కోసం అందరూ కలిసి చాలా ఐకమత్యంగా పనిచేయడం చాలా అసాధారణంగా కనిపిస్తోంది. వారి ఐఖ్యత, హడావుడి చూసి తెరాస నేతలు కూడా కొంచెం కంగారు పడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం అదేశాలతోనే వారీవిధంగా ప్రవర్తిస్తున్నారా? అనే అనుమానాలున్నాయి. తెలంగాణా ఇచ్చేది తామేనని వారందరూ ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంగా చెపుతుండటంతో, కాంగ్రెస్ పార్టీ తన పదేళ్ళ ఉద్యమాన్నిఈవిధంగా ఆఖరి నిమిషంలో హైజాక్ చేయబోతోందా? అనే అనుమానం కూడా వారిలో మొదలయింది. ఒకవేళ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇవ్వదలిస్తే దాని పూర్తి ప్రయోజనం తనకే దక్కాలనుకొంటుంది తప్ప తెరాస చేతిలో పెట్టాలని అనుకోదు. గనుకనే, తన పార్టీ నేతలను ఈవిధంగా మాట్లాడేందుకు ప్రోత్సహించి, వారి ఒత్తిడి కారణంగానే తెలంగాణా ఇస్తున్నట్లు ప్రకటించడానికే ఈ సభని వెనుక నుండి ప్రోత్సహించిందా? అందుకే అందరూ కలిసి సభని నిర్వహిస్తున్నా కూడా ఇంత వరకు అధిష్టానం ఎటువంటి అభ్యంతరము చెప్పలేదా? వంటి ధర్మ సందేహాలున్నాయి.అదేవిధంగా, ఈ సభ సరిగ్గా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా ఎంపికయిన దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వస్తున్న సమయంలోనే జరగుతుండటం, కేవలం కాకతాళీయమా లేక ఇది ముందుగానే రచించబడిన కాంగ్రెస్ మార్క్ వ్యుహమా? అనే ధర్మ సందేహం కూడా ఉంది. ఒకవేళ అదే నిజమయితే, టీ-కాంగ్రెస్ నేతల చేత ఇటువంటివే మరో ఒకటి రెండు సభలు నిర్వహింపజేసి, చివరాకరిగా వారి ఒత్తిడి తట్టుకోలేకనే తెలంగాణా ఇచ్చేస్తున్నట్లు ప్రకటించేస్తే సాంకేతికంగా తెలంగాణా సాధన కాంగ్రెస్ ఖాతాలో జమా అవుతుందని, కాంగ్రెస్ ఆలోచన కావచ్చును. అయితే, ఈ డ్రామా అంతా తెలంగాణా ప్రజలను మభ్యపెట్టేందుకేనని తెరాస నేతలు తేలికగా కొట్టిపారేస్తూ వారి అత్యుత్సాహం చూసి తామేమి భయపడట్లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే ఉంటే ఈవిధంగా హడావుడి చేసే బదులు పార్లమెంటులో ఒక బిల్లు పెడితే సరిపోతుంది కదా అని తెరాస నేత కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. అయితే, టీ-కాంగ్రెస్ నేతలెవరూ కూడా ఇటువంటి విమర్శలేవీ పట్టించుకొనే స్థితిలో లేరు. రేపు ఏదో ఒక మహాద్భుతం జరగబోతున్నట్లు అందరూ చాలా హుషారుగా సభకి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి హడావుడికి తెరాస నేతలే కాకుండా సీమంద్రా నేతలలో కూడా గుబులు మొదలయింది. కానీ వారి సభ సారాంశాన్నిపూర్తిగా విశ్లేషించిన తరువాతనే, తమ భవిష్య ప్రణాళికలు గురించి ఆలోచించుకోవాలని వారు నిర్ణయించుకొన్నారు. ఏమయినప్పటికీ, రేపు నిర్వహించే ఈ సభతో టీ-కాంగ్రెస్ నేతలందరిలో ఐఖ్యత కొట్టవచ్చినట్లు కనబడుతోంది. వారు ఇదే విధంగా ఐకమత్యంగా తమ సత్తా చాటుతూ, తెరసాకు ధీటుగా నిలిస్తే ఒకవేళ, కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పుడు తెలంగాణా ప్రకటించే ఆలోచన లేకపోయినప్పటికీ, తప్పకుండా అందుకు సిద్దపడవచ్చును.
http://www.teluguone.com/news/content/tcongress-37-23953.html