తెలంగాణాపై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ సిద్ధం
Publish Date:Jun 30, 2013
Advertisement
నిన్న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో జరిగిన టీ-కాంగ్రెస్ నేతల తెలంగాణా సాధన సభ, విజయవంతమయింది. నేతలందరి సమిష్టి కృషివల్ల వేలాదిగా జనాలు తరలివచ్చారు. వారిని చూసిన నేతలకి కూడా మరింత ఉత్సాహం కలిగింది. ఇంతకు ముందు జరిగిన సభలు, సమావేశాలకి ఈ సభకి వారిలో చాలా స్పష్టమయిన మార్పు కనిపించింది. ఇదివరకు వారు తమ ప్రసంగాలలో తమ అధిష్టానాన్ని వెంటనే తెలంగాణా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇవ్వకుంటే తీవ్ర నిర్ణయాలు తీసుకొంటామని బెదిరిస్తూ మాట్లాడేవారు. అయితే, ఈ సారి మాత్రం అందరూ తమ అధిష్టానంపై పూర్తి నమ్మకం ప్రకటించడమే కాకుండా, కేవలం కాంగ్రెస్ వల్లనే తెలంగాణా వస్తుందని మరీ మరీ నొక్కి చెప్పారు. ప్రసంగించిన నేతలందరూ కూడా, ఇతర అంశాలను పక్కన బెట్టి, కేవలం ‘కాంగ్రెస్ వల్లనే తెలంగాణా వస్తుందని’ చెప్పడానికే ఎక్కువ ప్రాముఖ్యతనీయడం గమనిస్తే, దీని వెనుక కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఉద్యమాలతో తెలంగాణాలో పాతుకుపోయున్న కేసీఆర్ మరియు అతని పార్టీని ఎదుర్కోవడానికి తన పార్టీ నేతలని సిద్దం చేసి, ప్రత్యేక రాష్ట్రం ప్రకటించినప్పుడు ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకే దక్కేలా చేయడానికే అధిష్టానం ఈ తతంగమంతా నడిపిస్తున్నట్లు అనిపిస్తోంది. మధుయాష్కీ మాట్లాడుతూ, కేవలం 15మంది యంపీలను గెలిపిస్తే తెరాస ఏవిధంగా తెలంగాణా సాధిస్తుందని ప్రశ్నించారు. 15మంది గెలిస్తే తెరాస బలపడుతుంది తప్ప రాష్ట్రం ఏర్పడదని, అందువల్ల జాతీయపార్టీ అయిన తమ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణా ఇవ్వగలదని చెప్పడం పార్టీ పెద్దల మాటలని అప్పజెప్పడమే. అది కూడా రానున్నఎన్నికలలోగానే తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని కూడా విస్పష్టంగా ప్రకటించడం గమనిస్తే ఈ సభ మొత్తం అధిష్టానం కనుసన్నలలో జరిగిందని అర్ధం అవుతుంది. అందువల్ల ఈ ‘మాస్టర్ ప్లాన్’ ప్రకారం త్వరలోనే ఇటువంటి సభలు సమావేశాలు తెలంగాణా వ్యాప్తంగా మరిన్నిజరిపించి, తెలంగాణా ప్రజలలో ఇంకిపోయిన తెరాస ప్రభావాన్ని కొంత మేరయినా తగ్గించిన తరువాత చివరాఖరిగా ‘తెలంగాణా ప్రక్రియ ఇస్టార్ట్’ అంటూ కేంద్ర ప్రకటన వెలువడచ్చును. ఈ లోగా, కేసీఆర్ ని, అతని పార్టీని తన చిలకలతో దారికి తెచ్చుకోవడం, తోక జాడిస్తున్న సీమంద్రా నేతలని, పార్టీలో, ప్రభుత్వంలో అసమ్మతి రాగాలు వినిపిస్తున్న వారికి నయాన్నో భయాన్నోనచ్చజెప్పి దారిలో పెట్టుకోవడం వంటి చిన్నాపెద్దా కార్యక్రమాలన్నిటినీ పార్టీ పూర్తి చేసుకోవలసి ఉంటుంది. రాబోయే ఎన్నికలలో చక్రం తిప్పాలని కలలు గంటున్నకేసీఆర్ కి, తెలంగాణాలో పాగా వేయాలని తిప్పలు పడుతున్న బీజేపీకి కాంగ్రెస్ హస్తం అడ్డుపడవచ్చును. మరి, తన పదేళ్ళ శ్రమని (ఉద్యమాన్ని) కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా ఆఖరి నిమిషంలో వచ్చి హైజాక్ చేసుకుపోతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకొంటాడని భావించలేము. దానికి ఆయన ఎటువంటి ఎత్తుగడ వేస్తాడో వేచి చూడాల్సిందే.
http://www.teluguone.com/news/content/telangana-37-23955.html