మనిషి జీవితంలో గురువు ప్రాధాన్యత తెలిపే కథనం!!
Publish Date:Oct 9, 2023
Advertisement
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
http://www.teluguone.com/news/content/role-of-teacher-in-our-life-37-163045.html