కాంగ్రెస్ పార్టీకి తెరాస, వైకాపాలతో పొత్తులు తప్పవా
Publish Date:Jun 28, 2013
Advertisement
రానున్నఎన్నికలలో తెలంగాణాయే ప్రధానంశంగా ఉంటుంది. గనుక, తెలంగాణా ప్రాంతాన్నిశాసిస్తున్నతెరాసను ఎదుర్కోవడానికి అన్నిపార్టీలు ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేసుకోక తప్పదు. అయితే, కేంద్రం తెలంగాణాపై ప్రకటించే వైఖరిని బట్టి, అన్నిపార్టీలు తమ తమ వ్యూహాలు రచించుకొంటాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణాపై ఎటువంటి నిర్ణయం తీసుకొంటే తనకు పూర్తి ప్రయోజనం కలుగుతుందో దానికే మొగ్గు చూపుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తెరాసను, మిగిలిన ప్రాంతంలో తెదేపా మరియు వైకాపాలను డ్డీ కొనవలసి ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికలలోగా తెలంగాణా ప్రకటన చేయకపోతే, తెరాస ప్రచారం చేసుకొంటున్నట్లు 100/15 సీట్లు కాకపోయినా అందులో సగమయినా తెరాస చీల్చుకు పోవడం ఖాయం. మిగిలినవి మూడు పార్టీలమధ్య చీలిపోతాయి. అందువల్ల, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తానని మాట ఇచ్చో, లేకపోతే అతనితో లోపాయికారీగా రహస్య ఒప్పందమో చేసుకొనో, ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే, ఒకవేళ రాష్ట్రంలోసంకీర్ణం ఏర్పడినా కనీసం తెరాస మద్దతయినా దొరుకుతుంది. అలా కాని పక్షంలో తెలంగాణాలో నాలుగు ప్రధాన పార్టీలు ఓట్లు చీల్చుకొంటే, ముందుగా నష్టబోయేది కాంగ్రెస్ పార్టీయే గనుక, నేడు కాకపోతే రేపయినా కాంగ్రెస్ పార్టీ తన గుమ్మం దగ్గిరకు వచ్చి నిలబడక తప్పదని కేసీఆర్ నిర్భయంగా ఉన్నాడు. ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేందుకు సిద్దపడినప్పటికీ, ఎన్నికల తరువాత రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాలలో చక్రం తిప్పాలని కలలుకంటున్న తెరాస అధినేత కేసీఆర్ ముందు ఒప్పుకొన్నట్లుగా ఇప్పుడు విలీనానికి అంగీకరించకపోవచ్చును. ఒకవేళ ఒప్పుకొంటే చక్రం తిప్పడం సంగతి అటుంచి ముందు సోనియా, రాహుల్ గాంధీల ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. అందువల్ల కేసీఆర్ అవసరమయితే కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవచ్చును గానీ, విలీనానికి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించక పోవచ్చును. ఇక, తెలంగాణాలో గులాబీ కారులో కాంగ్రెస్ ప్రయాణం సాఫీగా జరిగితే, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతంలో తెదేపాను ఎదుర్కోవడానికి దానికి ఉన్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం వైకాపాయే. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అడగక ముందే ప్రకటించిన వైకాపాని, జగన్ విడుదలతో లింకు పెట్టి రాష్ట్రంలో కూడా మద్దతుకి ఒప్పించవచ్చును. అయితే, జగన్ కూడా కేసీఆర్ లాగే కాంగ్రెస్ లో విలీనానికి అంగీకరించకపోవచ్చును. విలీనానికి ఒప్పుకొంటే ఆయన తన ఉనికినికోల్పోవడమే కాకుండా, కాంగ్రెస్ లో డజన్ల కొద్దీ ఉన్నముఖ్యమంత్రి అభ్యర్దులతో రేసులో దిగితే, ముఖ్యమంత్రి అవడానికి ఆయన జీవిత కాలం సరిపోదు. అదే కేవలం పొత్తులు పెట్టుకొంటే కాంగ్రెస్ హస్తాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మెలి తిప్పుతూ తన అదుపులో ఉంచుకోవచ్చును. ఈవిధంగా కాంగ్రెస్ రెండు ప్రాంతాలలో రెండు పార్టీలతో ఎన్నికల పొత్తులు గనుక ఏర్పర్చుకొంటే, అప్పుడు వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో తెదేపా ముందే ఆలోచించుకోక తప్పదు. లేకుంటే, తెదేపాకు ఇన్ ఫ్రంట్ ఇన్ ఫ్రంట్ దేరీజే క్రోకడైల్ ఫెస్టివల్ తప్పదు.
http://www.teluguone.com/news/content/congress-37-23928.html