ఎస్‌విఎం ఆదిత్య హోమ్స్ మోసం కేసు...రూ.15 కోట్లకు పైగా వసూళ్లు
Publish Date:May 27, 2026
Advertisement
రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ పరిధిలోని పి.ఆర్.ఎల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో నమోదైన భారీ రియల్ ఎస్టేట్ మోసం కేసు సంచలనంగా మారింది. విల్లాలు నిర్మించి అప్పగిస్తామని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మెస్సర్స్ ఎస్‌విఎం ఆదిత్య హోమ్స్ సంస్థపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదును ఖానామెట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెడడం రామారావు మే 21న డీసీపీ క్రైమ్స్ అండ్ ఈఓడబ్ల్యూ, సైబరాబాద్ కార్యాలయంలో సమర్పించారు. ఫిర్యాదు ప్రకారం.. సంస్థ ప్రతినిధులు రంజిత, నితీష్ కుమార్‌లు 2023 అక్టోబర్‌లో తనను సంప్రదించి సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిస్తారెడ్డిపేటలో “టెక్ హోమ్స్” పేరుతో విల్లా ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలిపారు. సంస్థ మేనేజింగ్ పార్టనర్లు ఎన్. శ్రీనివాస బాబు, జులకంటి మధుసూదన్ రెడ్డి తదితరులు కలిసి సుమారు 9 ఎకరాల భూమిలో 200కు పైగా ఆధునిక విల్లాలను నిర్మిస్తున్నామని, హెచ్ఎండిఏ సహా అన్ని అనుమతులు ఉన్నాయని నమ్మబలికినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్కువ ధరకే విల్లాలు అందిస్తున్నామని ప్రచారం చేసి పలువురిని ఆకర్షించినట్లు వెల్లడైంది. ఫిర్యాదుదారు రామారావు కొండాపూర్‌లోని సంస్థ కార్యాలయాన్ని సందర్శించి విల్లా నంబర్-92ను కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. 183 చదరపు గజాల విస్తీర్ణంలో, 3043 చదరపు అడుగుల నిర్మాణంతో ఉండే ఆ విల్లా ధర రూ.1.79 కోట్లు కాగా, సౌకర్యాల పేరిట అదనంగా రూ.6 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. 2023 నవంబర్ 27 నుంచి 2024 ఏప్రిల్ 6 వరకు వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా మొత్తం రూ.80 లక్షలను చెక్కులు, ఆర్టీజీఎస్ రూపంలో సంస్థ ఖాతాలకు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగతా మొత్తాన్ని నిర్మాణ దశల వారీగా చెల్లించాలని ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. అయితే పూర్తి చెల్లింపులు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన సంస్థ.. బాధితులకు కేవలం రూ.100 నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్‌పై నమోదుకాని అవగాహన ఒప్పంద పత్రాలు మాత్రమే ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే ప్రాజెక్ట్ పేరుతో మరో 19 మంది వినియోగదారుల నుంచి కూడా భారీ మొత్తాలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుల జాబితాలో సయ్యద్, జగదీష్, చక్రధర్, పద్మజ, మాధవ్ తదితరులు ఉన్నారు. వీరి నుంచి కలిపి సుమారు రూ.14.30 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. తర్వాత భూమి సంస్థ పేరిట గానీ, నిందితుల పేరిట గానీ రిజిస్ట్రేషన్ కాలేదని, విక్రయించే హక్కు కూడా వారికి లేదని బాధితులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు జరగడం లేదని, లేఅవుట్ అభివృద్ధి కూడా నిలిచిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతో ప్రజలను మోసం చేసి వారి కష్టార్జితాన్ని దోచుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 318(4), 316(2), 3(5)తో పాటు టీఎస్‌పీడీఎఫ్‌ఈ చట్టం సెక్షన్-5 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును ఈఓడబ్ల్యూ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హబీబుల్లా ఖాన్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితుల ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, భూమి పత్రాలు, ఒప్పందాలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.
http://www.teluguone.com/news/content/svm-aditya-homes-fraud-case-36-221070.html





