కాసేపట్లో SRH vs RR రసవత్తర మ్యాచ్...గెలిచేదెవరు?
Publish Date:May 27, 2026
Advertisement
అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీ, ట్రావిస్ హెడ్‌పైనే... ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ మైదానం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హై-వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ చావో రేవో పోరుకు ముందు మైదానంలో ఆటగాళ్ల మధ్య కనిపిస్తున్న కసి, గెలవాలనే పట్టుదల క్రికెట్ అభిమానులలో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. లీగ్ స్టేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎదురైన 2 ఓటములకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ రాయల్స్ గట్టి పట్టుదలతో ఉంటే, తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుని ఫైనల్ రేసులో ముందడుగు వేయాలని ఆరెంజ్ ఆర్మీ వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. తన కెరీర్‌లోనే మొదటిసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడుతున్న ఈ యువ సంచలనం నెట్ ప్రాక్టీస్‌లో పగబట్టినట్లు బ్యాటింగ్ చేస్తూ భీభత్సం సృష్టించాడు. వైభవ్ ఏకంగా 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా నెట్స్‌లో గడిపాడు. ఇందులో 40 నిమిషాల పాటు కేవలం వైట్ బాల్స్‌ను దయాదాక్షిణ్యాలు లేకుండా స్టేడియం నలుమూలలా దంచికొట్టాడు. అతడు బాదిన షాట్ల ధాటికి బంతులు స్టేడియంలోని మీడియా బాక్స్ గ్లాస్‌లను, కుర్చీలను తాకుతూ భీకరమైన శబ్దాలు చేశాయి. కేవలం 5 నిమిషాలు మాత్రమే రవి బిష్ణోయ్ వేసిన అద్భుతమైన యార్కర్లను డిఫెండ్ చేయడానికి కేటాయించి, మిగతా సమయమంతా బౌలర్లపై దండయాత్ర చేశాడు. వైభవ్ ప్రశాంతతను రాజస్థాన్ ఆల్‌రౌండర్ దాసున్ శనక మెచ్చుకుంటూ, డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్లు సైతం ఒత్తిడికి లోనవుతుంటే, ఈ 15 ఏళ్ల కుర్రాడు మాత్రం పరుగులు చేసినా, చేయకపోయినా ఎంతో కూల్‌గా, ప్రొఫెషనల్‌గా ఉంటాడని కొనియాడాడు. అంతకుముందు నెట్స్‌లోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ డొనొవాన్ ఫెరీరా వరుసగా 7 సిక్సర్లు బాది తన పవర్ ఏంటో చూపించాడు. ఆ తర్వాత ఫెరీరా స్వయంగా వైభవ్‌కు బౌలింగ్ చేయగా, ఒక షాట్‌ను మిస్‌క్యూ చేయడంతో ఫెరీరా అద్భుతమైన క్యాచ్ అందుకుని మైదానంలో విమానంలా రెక్కలు చాపి షోయబ్ అక్తర్ తరహాలో సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ, ఆ తర్వాతి బంతికే వైభవ్ మళ్లీ కసితో ఫెరీరా బౌలింగ్ లో బౌండరీలు బాదడం విశేషం. మరోవైపు, రాజస్థాన్ దగ్గర కసి ఉంటే.. సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ దగ్గర అంతకంటే ఎక్కువ కసి, మంట ఉన్నాయి. వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో సెంచరీలు బాదిన బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయిన హెడ్‌కు ఈ ఐపీఎల్ సీజన్ కాస్త హెచ్చుతగ్గులతో కొనసాగింది. దానికి తోడు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు అతడిపై, అతడి కుటుంబంపై దారుణమైన ట్రోల్స్, అబ్యూస్‌కు పాల్పడ్డారు. అయితే క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, ఇలాంటి అవమానాలే హెడ్‌కు మరింత బూస్ట్‌గా మారి, పెద్ద మ్యాచ్‌లలో భీకరంగా రెచ్చిపోయేలా చేస్తాయి. సన్‌రైజర్స్ అసిస్టెంట్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ మాట్లాడుతూ, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లకు ఇది తమ మార్క్ చూపించడానికి ఒక గొప్ప అవకాశం అని, హెడ్ ఎప్పటిలాగే తన విధ్వంసకర ఆట తీరుతో మ్యాచ్-విన్నింగ్ రోల్ పోషిస్తాడనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. చండీగఢ్ మెయిన్ సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్లాన్‌పూర్ స్టేడియంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీ మైండ్‌తో బరిలోకి దిగుతున్న ఇరు జట్ల మధ్య జరగబోయే ఈ సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
http://www.teluguone.com/news/content/-ipl-2026-36-221073.html





