జిమ్ ట్రైనర్ల ముసుగులో స్టెరాయిడ్ల దందా..హైదరాబాద్‌లో ఆరుగురు అరెస్ట్..!
Publish Date:Jul 4, 2026
Advertisement
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. ముషీరాబాద్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త దాడుల్లో జిమ్ ట్రైనర్లు సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ప్రధాన నిందితులైన బట్టే శివ (32), మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్ (28) లతో పాటు మహమ్మద్ సైఫ్ అలియాస్ మహమ్మద్ ఎహ్సాన్ ఉల్హక్ (20), ఫర్జాన్ ఖాన్ (20), మహమ్మద్ యూసుఫ్ (26), సోంభట్టిని అభిలాష్ (24) ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. వీరంతా జిమ్‌కు వచ్చే యువతను లక్ష్యంగా చేసుకుని "త్వరగా కండరాలు పెరుగుతాయి, బాడీ బిల్డింగ్ వేగంగా జరుగుతుంది" అంటూ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, హార్మోన్ డ్రగ్స్, బాడీ సప్లిమెంట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు బట్టే శివ గతంలో 'ఐరన్ హౌస్ జిమ్' యజమాని, ట్రైనర్‌గా పనిచేసినట్లు తేలింది. ప్రస్తుతం ఆన్‌లైన్ జిమ్ ట్రైనర్‌గా ఉంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముదిద్ చౌహాన్ నిర్వహిస్తున్న 'మెడ్‌హౌస్ ఫార్మా' ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు తెప్పించి మహమ్మద్ యూసుఫ్, సోంభట్టిని అభిలాష్‌లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్ పంజాబ్‌కు చెందిన రాజన్ ప్రీత్ సింగ్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ వేదిక ద్వారా స్టెరాయిడ్లు, బాడీ సప్లిమెంట్లు తెప్పించి మహమ్మద్ సైఫ్, ఫర్జాన్ ఖాన్‌లకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముదిద్ చౌహాన్, రాజన్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ దాడుల్లో 440 టెర్మిన్ (నియాన్) వయల్స్, 336 మెఫెన్‌టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు, సొమాట్రోపిన్, డ్రోస్టానోలోన్, ఇతర బాడీ సప్లిమెంట్లు, 336 టాబ్లెట్లు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ.6.50 లక్షలు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ జిమ్ యజమానులు, ట్రైనర్లు, యువతకు హెచ్చరిక జారీ చేశారు. వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్లు, హార్మోన్ ఇంజెక్షన్లు, ఇతర బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లను వినియోగించవద్దని సూచించారు. తాత్కాలికంగా కండరాలు పెరిగినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో గుండె, కాలేయం, మూత్రపిండాలు తదితర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నగరంలోని జిమ్‌లపై నిరంతర నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం వ్యక్తం చేశారు
ప్రాథమిక విచారణలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి అక్రమంగా స్టెరాయిడ్లు సరఫరా అవుతున్నట్లు, అలాగే వైద్యుల ప్రిస్క్రిప్షన్లను కృత్రిమ మేధ (AI) సాయంతో నకిలీగా తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
http://www.teluguone.com/news/content/steroid-racket-under-the-guise-of-gym-trainers-36-225084.html




