ఆటో డ్రైవర్ల కోసం యాప్.. చంద్రబాబు
Publish Date:Oct 4, 2025
Advertisement
రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు అండగా నిలిచే లక్ష్యంగా ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు రూ. 436 కోట్ల చెక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి సీఎం పవన్ కళ్యాణ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు అనేక కష్టాలు ఉన్నాయి.. గతంలో రోడ్లు గతుకులతో ఆటోలు తరచూ రిపేర్లకు గురయ్యేవి, ఆటో డ్రైవర్ల ఒళ్లు హూనం అయ్యేది ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ బాగు పడుతున్నాయి. రూ. 3400 కోట్ల రూపాయలు వ్యయం చేసి రోడ్లు బాగు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇకపై రోడ్లపై గుంతలు పడకుండా చూసుకోవలసిన బాధ్యత మీదేనన్న ఆయన జరిమానాల జీఓ రద్దు చేస్తాం, సీసీటీవీలో అంతా రికార్డ్ అవుతోంది కాబట్టి అందరూ క్రమశిక్షణతో ఉండాలన్నారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం కూటమి పాలనలో ప్రజల కష్టాలు తీరాయని చెప్పిన చంద్రబాబు.. సంక్షేమం లబ్ధిదారుల దరికి చేరిందన్నారు. ఆటో డ్రైవర్ల కోసం ఒక యాప్ తయారు చేస్తామని చెప్పిన ఆయన ఆ యాప్ ద్వారా బుకింగ్ లు వచ్చేలా చేస్తామన్నారు. ఇకపై ఆటో స్టాండ్ లకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా ఆటో డ్రైవర్లకు గిరాకీ లభించేలా సాంకేతికత ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా మీకు అవకాశాలు దొరికేలా చేస్తాం. ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మీకు మంచి చేసిన కూటమి ప్రభుత్వం గురించి పది మందికి చెప్పండని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముందు వరకూ అంటే 16 నెలల కిందటి వరకూ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయనీ, పాలన ఎక్కడికక్కడ ఆగిపోయిందని చెప్పిన చంద్రబాబు.. తాను అధికార పగ్గాలు చేపట్టిన తరువాత మళ్లీ అన్నిటినీ గాడిన పెట్టానని చెప్పారు.అంతకు ముందు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉంవల్లి నుంచి ఆటోలో వేదిక వద్దకు వచ్చారు.
http://www.teluguone.com/news/content/special-app-for-auto-drivers-39-207344.html





