రూ.12.5 లక్షల కోట్ల డిమాండ్! ఎలోన్ మస్క్ స్పేస్ఎక్స్ ఐపీఓ ప్రపంచ రికార్డు!
Publish Date:Jun 10, 2026
Advertisement
ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలోన్ మస్క్ ఏం చేసినా అందులో ఒక సంచలనం ఉంటుంది. ఇప్పుడు ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్ఎక్స్’ గ్లోబల్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త రికార్డును సృష్టించడానికి సిద్ధమైంది. ఈ కంపెనీ తీసుకొస్తున్న ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. వాల్ స్ట్రీట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, కంపెనీ ఆశించిన దానికి అక్షరాలా రెట్టింపు స్థాయిలో ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ వచ్చి పడింది. మార్కెట్ రేసులో స్పేస్ఎక్స్ ఏకంగా 150 బిలియన్ డాలర్ల (దాదాపు 12.5 లక్షల కోట్ల రూపాయల) రికార్డు స్థాయి డిమాండ్‌ను రాబట్టి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. కంపెనీ మార్కెట్ నుంచి 75 బిలియన్ డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే, దానికి డబుల్ పాపులారిటీతో ఈ ఐపీఓ దూసుకుపోతోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం బుధవారం అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల బుకింగ్స్ అన్నీ ముగియనున్నాయి. ఈ ఐపీఓ ద్వారా స్పేస్ఎక్స్ కంపెనీ మొత్తం 555.6 మిలియన్ల షేర్లను విక్రయానికి ఉంచింది. ఒక్కో షేరును 135 డాలర్ల స్థిర ధరతో ఇన్వెస్టర్లకు ఆఫర్ చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ ఐపీఓ ద్వారా కంపెనీ ఈజీగా 75 బిలియన్ డాలర్లను సేకరిస్తుంది. దీనితో స్పేస్ఎక్స్ మొత్తం మార్కెట్ విలువ అక్షరాలా 1.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇది అగ్రస్థానంలోకి దూసుకెళ్తుంది. ఇంతకుముందు 2019లో సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ చమురు దిగ్గజం 'సౌదీ అరామ్కో' ఐపీఓ ద్వారా 29.4 బిలియన్ డాలర్లు వసూలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఎలోన్ మస్క్ ఆ రికార్డును చాలా సులువుగా బద్దలు కొట్టబోతున్నారు. అయితే, కంపెనీ పబ్లిక్‌గా మారినప్పటికీ పూర్తి నియంత్రణ ఎలోన్ మస్క్ చేతుల్లోనే ఉంటుంది. ఆయన తనకున్న వాటాను ఏడాది పాటు విక్రయించకుండా లాక్ చేసుకున్నారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు బుధవారంతో గడువు ముగిసినప్పటికీ, మనలాంటి సామాన్య రిటైల్ ఇన్వెస్టర్లకు మరికొంత సమయం అందుబాటులో ఉండటం విశేషం. ఈ మెగా ఐపీఓలో దాదాపు 30 శాతం కోటాను సామాన్య ఇన్వెస్టర్ల కోసమే కేటాయించారు. దీనివల్ల వాల్ స్ట్రీట్ బడా కంపెనీలతో పాటు చిన్న చిన్న ఇన్వెస్టర్లు కూడా స్పేస్ఎక్స్లో భాగస్వాములు అయ్యే ఒక అద్భుతమైన అవకాశం లభించింది. బుధవారం బుక్ బిల్డింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత, బ్యాంకులు షేర్ల ధరను మరియు ఎవరికి ఎన్ని షేర్లు కేటాయించాలనేది జూన్ 11న ఫైనల్ చేస్తాయి. ఆ తర్వాత జూన్ 12 నుంచి అమెరికాలోని ప్రముఖ నాస్డాక్ (Nasdaq) ఎక్స్ఛేంజ్లో 'SPCX' అనే టిక్కర్ పేరుతో ఈ షేర్ల ట్రేడింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది. డిమాండ్ ఊహించని విధంగా విపరీతంగా ఉండటంతో, చాలా మంది ఇన్వెస్టర్లకు వారు అడిగిన దానికంటే తక్కువ షేర్లు కేటాయించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
http://www.teluguone.com/news/content/spacex-ipo-2026-elon-musk-wall-street-history-36-222439.html





