ట్రంప్ దూకుడికి అమెరికా సెనేట్ కళ్లెం!
Publish Date:Jun 23, 2026
Advertisement
అంతర్జాతీయ వేదికపై ఇరాన్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలోనే ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా ఇరాన్‌పై ఎలాంటి ఏకపక్ష సైనిక చర్యలు చేపట్టడానికి వీల్లేదంటూ యూఎస్ సెనేట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఇరాన్ సరిహద్దుల వద్ద మోహరించిన అమెరికా సాయుధ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. వైట్‌హౌస్ వర్గాల నుంచి వస్తున్న యుద్ధ సంకేతాలకు కళ్లెం వేసేలా అమెరికా పార్లమెంట్ ఎగువ సభ సెనేట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కీలక తీర్మానంపై సెనేట్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఓటింగ్ ప్రక్రియలో తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 48 ఓట్లు పడ్డాయి. 2 ఓట్ల స్వల్ప తేడాతో ట్రంప్ వైఖరిని తప్పుబడుతూ ఈ తీర్మానం ఆమోదం పొందింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు కీలక సెనేటర్లు సొంత పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వారు విపక్ష డెమొక్రాట్లతో చేతులు కలిపి ఈ యుద్ధ నిరోధక తీర్మానానికి మద్దతుగా ఓటు వేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే అమెరికా దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోనూ ఇదే తరహా తీర్మానం భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. అమెరికా రాజ్యాంగ నియమాల ప్రకారం ఉభయ సభల ఆమోదం లభించిన ఇటువంటి సంయుక్త తీర్మానాలకు అధ్యక్షుడి అధికారిక సంతకం అవసరం లేదు. సాంకేతికంగా, చట్టబద్ధంగా ఈ తీర్మానం ట్రంప్‌ను పూర్తిగా కట్టడి చేయలేకపోయినప్పటికీ, రాజకీయంగా ఆయనపై నైతిక ఒత్తిడిని పెంచుతుందనడంలో సందేహం లేదు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన తర్వాత అమెరికా కాంగ్రెస్‌లోని రెండు సభలు ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
http://www.teluguone.com/news/content/senate-reins-in-trumps-aggressive-moves-36-223953.html





