పీవోకేలో తిరుగుబాటు.. పాక్ ది చట్ట విరుద్ధ ఆక్రమణ అంటూ ఎలుగెత్తిన హక్కుల నేత.!
Publish Date:Jul 16, 2026
Advertisement
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లో మునుపెన్నడూ లేని విధంగా ఉప్పెనలాంటి తిరుగుబాటు మొదలైంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకుల అణచివేతను, అన్యాయాలను భరిస్తూ వస్తున్న స్థానికులు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చారు పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తాజాగా పీవోకేలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో నిరసనకారులను ఉద్దేశించి స్థానిక హక్కుల నాయకుడు అమ్జాద్ అయూబ్ మీర్జా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ సైనిక బలగాలు తమ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఆక్రమించుకున్నాయని అమ్జాద్ అయూబ్ మీర్జా ప్రకటించారు. ఈ ప్రాంతం ఎంతమాత్రం స్వతంత్రమైనది కాదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పీవోకే ప్రాంతానికి చెందిన సహజ వనరులను ఇస్లామాబాద్ పాలకులు దోచుకుంటున్న తీరును ఆయన కళ్లకుకట్టారు. తమ ప్రాంతంలో పుష్కలంగా లభించే నీటిని, ఇక్కడ ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం తరలించుకుపోతోందని, కానీ అదే విద్యుత్‌ను తయారు చేసే తమ ప్రాంత ప్రజలను మాత్రం కనీస కరెంట్ సదుపాయం కూడా లేకుండా అంధకారంలో ముంచుతోందని మండిపడ్డారు. ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది పాకిస్తాన్ మోపిన అదనపు పన్నుల భారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాలుగా తమకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైన ఇస్లామాబాద్ ప్రభుత్వం, ఇప్పుడు అడ్డగోలుగా పన్నులు వసూలు చేయడంపై ప్రజలు రగిలిపోతున్నారు. ఈ అణచివేతను ఇకపై ఏమాత్రం సహించే ప్రసక్తే లేదని, తమ హక్కులను సాధించుకునే వరకు, అలాగే పాకిస్తాన్ అక్రమ ఆక్రమణ నుండి పీవోకే విముక్తి పొందే వరకు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నిరసనకారులు స్పష్టం చేశారు. ఒకవైపు విద్యుత్ సంక్షోభం, మరోవైపు ఆర్థిక భారంతో నలిగిపోతున్న పీవోకే ప్రజలు ఒకేతాటిపైకి వచ్చి చేస్తున్న ఈ భారీ ప్రదర్శనలు ప్రస్తుతం పాక్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. PoK Protests, Amjad Ayub Mirza, Pakistan Occupied Kashmir, Islamabad Government, Resource Exploitation, PoK Rebellion
http://www.teluguone.com/news/content/revolt-in-pok-36-226149.html





