చిక్కుల్లో సర్కార్.. సందిగ్ధంలో విపక్షం!
Publish Date:Mar 13, 2025
.webp)
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో ఏమి జరుగుతోంది? ఓ వంక అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి 14 నెలలు పూర్తయినా, ఆయనకు, పరిపాలనపై పూర్తి పట్టు చిక్కినట్లు లేదు. మంత్రుల పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ మంత్రులు సైతం, ఎందుకనో అంటీ ముట్ట నట్లే ఉంటున్నారు. ఇగో ప్రాబ్లమో, స్టేచర్ సమస్యో తెలియదు కానీ, ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సయోధ్య ఉన్నట్లు కనిపించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కూడా అదే పరిస్థితి. ఓవరాల్ గా ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో ఏదో జరుగుతోంది. అదేమిటో తెలియదు కానీ, అంతా బాగుంది అనుకునే పరిస్థితి అయితే లేదు. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం.
నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరు పట్ల, ఇంటా బయటా పెదవి విరుపులే కానీ, ప్రశంసలు పెద్దగా వినిపించడం లేదు. ముఖ్యమంత్రి విమర్శలు చెవిలో, ప్రశంసలు మైకులో చెప్పాలని మైకులో వేడుకున్నా, కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నట్లు ఇటుదటు, అటు దిటు చేసి పార్టీ నాయకులు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి స్థానిక నాయకులే కాదు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలకూ నచ్చడం లేదు. ప్రజల సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటడం లేదు అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన ఉందని సామాన్య జనం, పెదవి విరుస్తున్నారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పని చేసిన తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉందని అంటున్నారు.
ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఎంత అద్వానంగావుందో స్వయంగా ముఖ్యమంత్రే, ఢిల్లీ వెళ్లి డప్పు కొట్టి మరీ దేశం మొత్తానికి వినిపించేలా చెప్పి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నెలసరి ఆదాయం గత ప్రభుత్వ హాయంలో చేసిన అప్పుల పై కడుతున్న వడ్డీలు, ప్రభుత్వ ఉద్యోగుల భత్యాలకే సరిపోతోందని, ఆ రెండు పద్దులకూ పోను కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే ఆభివృద్ధి, సంక్షేమం, ఇతర రోజువారీ ఖర్చులకు మిగులుతున్నదని ‘ఇండియా టుడే’ గోష్టిలో చెప్పి వచ్చారు. అదే విషయాన్ని ఇంకొంచం క్లారిటీతో బుధవారం (మార్చి 12), జరిగిన సభలో వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కాన్సర్ సోకిందని, సవివరంగా వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత అద్వాన్నంగా వుందో కళ్ళకు కట్టి నట్లు చెప్పారు. ఇదలా ఉంటే ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అంటూ వస్తున్న వార్తలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి.
అధికార పార్టీ, ప్రభుత్వం పరిస్థితి ఇలా ఉంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఎందుకో, అంతగా దూకుడు చూపడం లేదు. ముఖ్యంగా, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ నిన్నమొన్నటివరకు రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్న సందేహం వచ్చే విధంగా, పర్ణశాల (ఫార్మ్ హౌస్)కే పరిమితం అయ్యారు. ఇంచుముంచుగా ఆరేడు నెలలకు పైగా అసెంబ్లీకి అయినా రాలేదు. సభకు ముఖం చూపలేదు. ఇంతలో, ఓ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీంతో సభలో ప్రతిపక్షం బలం పలచ బడింది. అలాగే, ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకుండా ముఖం చాటేయడంతో ప్రతిపక్షం వాయిస్ మరింత బలహీనపడింది. అయితే, గత కొద్దిరోజులుగా, కీసీఆర్ రీ ఆక్టివ్ అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు, మార్చి 12 న ఏదో మొక్కుబడిగా సభకు వచ్చి సంతకం చేసి వెళ్ళారే కానీ , బడ్జెట్ సమావేశాలు చివరి వరకు క్రియాశీల పాత్ర పోషించక పోవచ్చని పార్టీ వర్గాల సమాచరం. ఏప్రిల్ 27న, వరంగల్ లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభ తర్వాతనే కేసీఆర్ రీ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకులు తమ చేతకాని తనంతో అధికారాన్ని ఫార్మ్ హౌస్ కు వచ్చి మరీ బంగారు పళ్ళెంలో పెట్టి. ఇచ్చిపోతారని, కేసీఆర్ సార్ .. గట్టిగా నమ్ముతున్నారని అంటున్నారు. అందుకే, అప్పుడైనా వస్తారా.. అనేది అనుమానమే అంటున్నారు. అలాగే, ఈ లోగా. రాష్ట్ర రాజకీయాలు, ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అప్పటికి రాజెవరో .. రెడ్డెవరో ...?
http://www.teluguone.com/news/content/revanth-sarkar-in-troubles-and-opposition-39-194376.html












