పాముకు పాలు పోస్తున్న చంద్రబాబు
Publish Date:Mar 14, 2025
.webp)
Advertisement
తన సీటుకే ఎర్త్ పెట్టుకునేలా విశ్వేశ్వర రెడ్డిని బలోపేతం చేస్తున్న ఏపీ సీఎం..
బాలయ్య సీటుకు ఎర్త్ పెట్టేలా బలోపేతమవుతున్న విశ్వేశ్వరెడ్డి తమ్ముడు..
పాముకు పాలు పొయొద్దు.. పోస్తే అది తిరిగి మనల్నే కాటేస్తుంది. ఇదీ కొన్నాళ్ల క్రితం వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు తెలుగుదేశం నేతలకు చెప్పిన మాటలు. వైసీపీ నేతలను దగ్గరకు రానీయొద్దు.. తెలుగుదేశం నేతలను ప్రలోభపెట్టాలని వైసీపీ నేతలు, వారి సానుభూతి పరులు ప్రయత్నిస్తున్నారు, మనతోనే వాళ్ల పనులు చేయించుకుంటారంటూ పార్టీ నేతలకు చాలా పెద్ద ఎత్తునే హితబోధ చేశారు చంద్రబాబు. అలాంటి వాళ్లను దగ్గరకు రానీయొద్దంటూ పెద్ద లెక్చరే పీకారు.
కానీ అదే చంద్రబాబు రెండు రోజులు తిరిగే సరికి.. వైసీపీతో అంటకాగిన వారిని, గత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డికి కళ్లు, ముక్కు, చెవులుగా ఉన్న వారిని అక్కున చేర్చుకుంటున్నారు. వారికి ఆర్థికంగా భారీ మొత్తంలో లాభాలు తెచ్చిపెడుతున్నారు. పెద్ద ఎత్తున భూములూ కట్టబెట్టేస్తున్నారు.
తాజాగా జరిగిన ఎస్ఐబీపీ సమావేశంలో గత ప్రభుత్వంలో విద్యుత్ రంగం నుంచి, ఆ రంగంలోని వివిధ కాంట్రాక్టర్లు, విద్యుత్ కంపెనీల నుంచి రావాల్సిన అమ్యామ్యాలను వసూలు చేసి పెట్టిన వారికి పెద్ద పీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యానికే చెందిన మరో సంస్థ ఇండోసోల్ కంపెనీకి భారీ ఎత్తున భూములు కట్టబెట్టింది ఏపీ ప్రభుత్వం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 58469 కోట్ల రూపాయలతో ఇండోసోల్ ప్రాజెక్టు పెట్టుబడి పెడుతుందని.. దానికి ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎస్ఐపీబీ సమావేశంలో 119659 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెడుతున్న వివిధ సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇందులో 58469 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్న ఇండోసోల్ ప్రాజెక్టు కూడా ఒకటి. ఓ విధంగా చెప్పాలంటే ఇండోసోల్ కోసం లేటెస్ట్ ఎస్ఐపీబీ సమావేశాన్ని ప్రభుత్వం పెట్టినట్టుగా కన్పిస్తోంది.
ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పిన ఇండోసోల్ ప్రాజెక్టుకు కేటాయించిన భూములు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 8348 ఎకరాల భూమిని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో కేటాయింపులు జరుపుతున్నారు. ఇక పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నందుకు ప్రభుత్వం వైపు నుంచి భారీగా ఆర్థిక, ఆర్థికేతర ప్రొత్సహాకాలివ్వాలని ఇండోసోల్ కోరింది. ఆర్థిక ప్రొత్సహకాలు ఎంతో తెలుసా.. ఏకంగా 41254.50 కోట్ల రూపాయలు. ఇది కాకుండా, ఆర్థికేతర ప్రొత్సహకాలు ఉన్నాయి. వీటిల్లో ఇండోసోల్ పెట్టిన మెజార్టీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ స్థాయిలో జగన్ కు బినామీ అనుకున్న సంస్థకు ఎలా కట్టబెడతారనేది ఇప్పుడు తెలుగుదేశం సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ.
పోనీ ఇదేదో పై స్థాయిలో జరుగుతోంది.. చూసీ చూడనట్టు పోదామన్నా.. వీల్లేని పరిస్థితులు కల్పిస్తోంది ఇండసోల్ సంస్థ. ఇండోసోల్ అధినేత విశ్వేశ్వర రెడ్డి నేరుగా చేస్తున్నారో.. లేక ఆయన పేరుతో ఎవరైనా చేస్తున్నారో తెలియదు కానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన వారు.. పార్టీ సానుభూతి పరులు విద్యుత్ కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన టెండర్లను వేస్తే వాటిని అడ్డుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహరంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు పెత్తనం చేస్తున్నారట. సదురు సంతోష్ రావు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి భక్తుడు. ఈ సంతోష్ రావు చెప్పిన వారికే కాంట్రాక్టులు దక్కుతున్నాయి. హిందూపురం తోపుదుర్తి గ్రామంలో విశ్వేశ్వర రెడ్డి సోదరుడు బ్రహ్మానంద రెడ్డి విద్యుత్ కాంట్రాక్టర్. దీంతో విశ్వేశ్వర రెడ్డి అండతో.. సంతోష్ రావు సహకారంతో సదురు బ్రహ్మానంద రెడ్డికే పనులు దక్కుతున్నాయట. తెలుగుదేశం పార్టీకి చెందిన క్లాస్ వన్ కాంట్రాక్టర్ గంగాధర నాయుడు విద్యుత్ కాంట్రాక్టులకు టెండర్లు వేయాలన్నా.. వేయనీయకుండా అడ్డుకుంటున్నారట.
మళ్లీ చంద్రబాబు చెప్పిన పాముకు పాలు పోస్తే సామెతను ఇక్కడ గుర్తు చేయాల్సి వస్తోంది. పై స్థాయిలో విశ్వేశ్వర రెడ్డిని బలోపేతం చేస్తున్నారు.. క్షేత్ర స్థాయిలో టీడీపీ వాళ్లను కాదని.. విశ్వేశ్వర రెడ్డి తమ్ముడిని బలోపేతం చేస్తున్నారు. వీళ్లు ఆర్థికంగా బలోపేతమై.. అమరావతిలో కూర్చొన్న విశ్వేశ్వర రెడ్డి చంద్రబాబకు, లోకేషుకు ఎర్త్ పెట్టడమో, హిందూపురంలో బాలయ్య సీటుకు ఎర్త్ పెట్టడమో చేయరని గ్యారెంటీ ఏంటీ అనే చర్చ జరుగుతోంది. పాము పాలు థియరీ చెప్పడం కాదు.. పాటిస్తే ఇంకా బాగుంటుందని తెలుగుదేశం కేడర్.. లీడర్లు విసుక్కుంటూ సణుక్కుంటున్నారట.
http://www.teluguone.com/news/content/cbn-encouraging-ycp-support-contracters-39-194406.html












