టార్గెట్ మిథున్ రెడ్డి.. భుజం కసిరెడ్డిది!
Publish Date:Mar 14, 2025

Advertisement
ఎవరీ రాజ్ కసిరెడ్డి..?
జగన్ దగ్గర రాజ్ కసిరెడ్డి అంత ప్రాపకం ఎలా సంపాదించారు..?
పెద్దిరెడ్డి అండ్ సన్స్ కు రాజ్ కసిరెడ్డికి ఉన్న లింకులేంటీ..?
జూనియర్ పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..?
రాజ్ కసిరెడ్డి. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం (మార్చి12) సీఐడీ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఈ పేరు గురించే ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు అంశంలో విజయసాయి రెడ్డి విచారణకు హజరైనా.. మీడియా అడిగిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి బదులిస్తూ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని తేటతెల్లంగా చెప్పేశారు. దీంతో జగన్ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని వైసీపీలో నెంబర్ టూగా వ్యవహరించి.. ఇప్పుడు రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి చెప్పేశారు. అంటే లిక్కర్ స్కాంను జరిగిందని నిర్ధారించారు విజయసాయి రెడ్డి. ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ప్రస్తావించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరు..? అనే చర్చ జరుగుతోంది.
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. వరంగల్ జిల్లా వాస్తవ్యుడు. ఐఐటీ ఖరగ్ పూర్ లో విద్యనభ్యసించాడని వైసీపీ నేతలు చెబుతారు. ముందుగా ఐ-ప్యాక్ టీంలో ఓ సాధారణ మెంబరుగా ఉండేవారట. ఆ తర్వాత తనకున్న సామాజిక వర్గం నేపథ్యం చూపించారో.. లేక తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారో కానీ.. రాజ్ కసిరెడ్డి నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారిపోయారని వైసీపీ వర్గాలే చెబుతాయి. అదీ ఎంతగా అంటే.. పార్టీలో చాలా కాలం ఐటీ వింగ్ లో పని చేసిన వారికి కూడా ఇవ్వని ఐటీ సలహాదారు పదవిని రాజ్ కసిరెడ్డికి కట్టబెట్టేటంతగా ఎదిగిపోయారు రాజ్ కసిరెడ్డి. అయితే ఐటీ సలహలకంటే.. రాజ్ కసిరెడ్డి సంపద సృష్టి సలహలే ఎక్కువ ఇచ్చినట్టున్నారు.. ఎక్సైజ్ శాఖ నుంచి ఎంత వరకు పిండొచ్చు.. ఎన్నిరకాలుగా పిండొచ్చు.. ఏయే దారుల్లో పిండొచ్చనే కథా కమామిషు మొత్తం రాజ్ కసిరెడ్డి ద్వారానే జరిగిదని టాక్.
డబ్బులు పిండుకోవడం.. ఆ డబ్బులను మళ్లించడం.. ఆ డబ్బులను అనుకున్న గమ్యస్థానానికి చేర్చడం వంటి పనులను తూచా తప్పకుండా చేసింది అంతా రాజ్ కసిరెడ్డేనని తెలుస్తోంది. ఇదే విషయాన్ని విజయసాయి రెడ్డి కూడా చెప్పేశారు. అయితే రాబోయే ప్రమాదాన్ని రాజ్ కసిరెడ్డి ముందే గ్రహించాడో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని అంచనా వేశాడో కానీ.. ఏడాదిన్నరకు ముందే వైసీపీ క్యాంప్ నుంచి రాజ్ కసిరెడ్డి సైలెంటుగా జంప్ అయిపోయినట్టు తెలుస్తోంది. అయినా లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డి భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉండడంతోపాటు.. లిక్కర్ స్కాం సూత్రధారి-పాత్రధారి కసిరెడ్డేనని విజయసాయిరెడ్డి స్పష్టం చేయడంతో మరోసారి రాజ్ ఎపిసోడ్ మళ్లీ తెర మీదకు వచ్చింది.
ఇదంతా ఓ ఎత్తు అయితే.. ఇప్పుడు లిక్కర్ స్కాం రాజ్ కసిరెడ్డి ఎంత వరకు దొరుకుతాడో ఏమో కానీ.. జూనియర్ పెద్దిరెడ్డి అంటే.. మిధున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టు సమాచారం. ఈ మద్యం కిక్ బ్యాగ్స్ వ్యవహరంలో తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ మిధున్ రెడ్డి కొన్ని రోజుల క్రితం ప్రెస్ కాన్పరెన్స్ కూడా పెట్టాడు. దీంతో తన అరెస్ట్ గురించి మిధున్ రెడ్డి ముందుగానే ఊహించినట్టున్నారనే చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖకు మంత్రిగా నాటి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నారు. కానీ ఆయన్ను డమ్మి చేసి ఎక్సైజ్ శాఖకు అనధికారిక మంత్రిగా చెలాయించింది పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డేనని అందరికీ తెలిసిందేనంటున్నారట. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి రాజ్ కసిరెడ్డి ప్రస్తావించడం.. అదే రోజున మిధున్ రెడ్డి స్పందించడం వంటివి చూస్తుంటే.. మిధున్ రెడ్డికి కటకటాల కష్టాలు తప్పవేమోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఇదే సందర్భంలో మరో అంశం కూడా తెర మీదకు వచ్చింది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిగా పని చేసిన ఓ ఉద్యోగి అప్రూవర్ గా మారినట్టు సమాచారం. ఇదే నిజమే అయితే.. అతి త్వరలో మిధున్ రెడ్డి కేంద్రంగా అతి పెద్ద డెవలప్మెంట్ జరిగే సూచనలు కన్పిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/whi-is-kasireddy-39-194404.html












